మోహన్‌బాబుకు టీటీడీ చైర్మన్ పదవి దక్కేనా... వారి నుంచి గట్టి పోటీ ?

టీటీడీ చైర్మన్ పోస్టు దక్కొచ్చని ప్రచారంలో ఉన్న మోహన్ బాబుకు మరో ఇద్దరి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: May 31, 2019, 5:31 PM IST
మోహన్‌బాబుకు టీటీడీ చైర్మన్ పదవి దక్కేనా... వారి నుంచి గట్టి పోటీ ?
వైసీపీలో చేరిన మోహన్ బాబు(File)
  • Share this:
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉండే కీలకమైన పదవులు ఎవరికి దక్కుతాయనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అందులో టీటీడీ చైర్మన్ పోస్టు కూడా ఉంది. వైసీపీ అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పదవి సినీనటుడు, సీఎం వైఎస్ జగన్ బంధువు అయిన మోహన్ బాబుకు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు వైసీపీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. దీనికి తోడు ఆయన తిరుపతి వాసి కావడం, తిరుపతి సమీపంలో ఆయనకు విద్యాసంస్థలు ఉండటం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది.

అయితే టీటీడీ చైర్మన్ పోస్టుకు మోహన్ బాబుకు మరో ఇద్దరి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. జగన్ సమీప బంధువు, ఒంగోలు మాజీ ఎంపీ అయిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పోస్టు ఇవ్వాలని జగన్ గతంలోనే నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు మరోసారి వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చేందుకు నిరాకరించిన జగన్... పార్టీ అధికారంలోకి వస్తే... ఆయనకు కీలకమైన టీటీడీ చైర్మన్ పోస్టు ఇవ్వాలని డిసైడయ్యారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు టీటీడీ చైర్మన్ పోస్టు వీరిద్దరికి కాకుండా రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డికి ఇచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మేకా మల్లికార్జునరెడ్డి కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన ఆకేపాటికి టీటీడీ చైర్మన్ పోస్టు ఇచ్చే అంశాన్ని సైతం వైసీపీ నాయకత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ పదవిని వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల్లో ఒకరికి ఇచ్చే అవకాశం లేకపోలేదనే టాక్ కూడా వినిపిస్తోంది.

ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ కొనసాగుతున్నారు. పాలకమండలిని ప్రభుత్వం రద్దు చేసిన వెంటనే... కొత్తగా చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే విషయంపై క్లారిటీ వస్తుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారి టీటీడీ చైర్మన్ పోస్టును దక్కించుకునే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే అంశం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


First published: May 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading