టీడీపీని కాదని వైసీపీలోకి... అలీకి జగన్ ఇచ్చిన హామీ ఏంటి ?

అలీ పార్టీలోకి వస్తున్నాడని... గుంటూరు తూర్పు నుంచి ఆయనే పోటీ చేస్తాడని కొద్దిరోజుల క్రితం పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోయినప్పటికీ అలీ వైసీపీలో చేరడంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: March 12, 2019, 8:10 AM IST
టీడీపీని కాదని వైసీపీలోకి... అలీకి జగన్ ఇచ్చిన హామీ ఏంటి ?
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సినీనటుడు అలీ
  • Share this:
కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న సినీనటుడు అలీ... ఏ పార్టీలో చేరతారనే విషయంపై మాత్రం కొద్ది రోజులు సస్పెన్స్ కొనసాగించారు. మొదట జగన్‌ను కలిసిన అలీ... ఆ తరువాత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక అలీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలోకి వెళతారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోయినప్పటికీ అలీ వైసీపీలో చేరడంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అలీ పార్టీలోకి వస్తున్నాడని... గుంటూరు తూర్పు నుంచి ఆయనే పోటీ చేస్తాడని కొద్దిరోజుల క్రితం పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఆ స్థానం నుంచి టీడీపీ తరపున మరొకరి పేరును పరిగణనలోకి కూడా తీసుకోలేదనే టాక్ ఉంది. ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో అలీకి స్పష్టమైన హామీ ఇచ్చిన చంద్రబాబు... మంత్రి పదవి విషయంలో కమిట్‌మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. టీడీపీ తరపున గుంటూరు జిల్లా నుంచి కేబినెట్‌ బెర్త్ కోసం పోటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మంత్రి కావాలనేది తన చిరకాల కోరిక అని మనసులోని మాటను దాచుకోకుండా చెబుతున్న అలీ... ఆ పదవిపై హామీ ఇచ్చిన పార్టీలోకే వెళ్లాలని నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు.

ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే అలీకి మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని సమాచారం. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినా రాకపోయినా... పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలీకి స్పష్టమైన హామీ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చి మంత్రి కావాలనే అలీ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

First published: March 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు