అద్భుతం జరుగుతుందా..? యాక్సిడెంటల్ సీఎం కుమారస్వామి హోప్స్ అన్నీ దానిపైనే..

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతున్నా.. సీఎం కుమారస్వామి మాత్రం ప్రభుత్వం కొనసాగుతుందన్న ధీమాతోనే ఉన్నారు. కానీ ఆయన సన్నిహితులు మాత్రం.. అద్భుతం జరిగితే తప్ప ప్రభుత్వాన్ని నిలబెట్టలేమని వాపోతున్నారు

news18-telugu
Updated: July 9, 2019, 11:39 AM IST
అద్భుతం జరుగుతుందా..? యాక్సిడెంటల్ సీఎం కుమారస్వామి హోప్స్ అన్నీ దానిపైనే..
సీఎం కుమారస్వామి(File)
news18-telugu
Updated: July 9, 2019, 11:39 AM IST
(DP Satish,Senior Editor, News18)

కర్ణాటక యాక్సిడెంటల్ సీఎం కుమారస్వామి కుర్చీకి ఎసరొచ్చింది. రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోకుండా ఆపేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్-జేడీఎస్‌లకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే రాజీనామా చేశారు. మరో డజనుకి పైగా ఎమ్మెల్యేలు అదే బాటలో నడిచేందుకు సిద్దంగా ఉన్నారు. రెబల్ ఎమ్మెల్యేలను శాంతపరిచేందుకు కుమారస్వామి వారికి మంత్రి పదవులు ఆఫర్ చేస్తున్నారు. ఇందుకోసం కేబినెట్‌లోని 32మంది మంత్రులతో రాజీనామా చేయించారు. అయితే తమ ప్రతిపాదనను గుర్తించడంలో కుమారస్వామి ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని.. కాబట్టి తాము తిరిగి ప్రభుత్వంలో చేరే అవకాశం లేదని రెబల్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ఇంత జరుగుతున్నా.. కుమారస్వామి మాత్రం ప్రభుత్వం కొనసాగుతుందన్న ధీమాతోనే ఉన్నారు. కానీ ఆయన సన్నిహితులు మాత్రం.. అద్భుతం జరిగితే తప్ప ప్రభుత్వాన్ని నిలబెట్టలేమని వాపోతున్నారు.మరోవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు కమలనాథులు చకచకా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలను ముంబై నుంచి గోవా తరలిస్తున్నారు.ఇలాంటి తరుణంలో ఇప్పుడు అందరి చూపు స్పీకర్ పైనే ఉంది. మంగళవారం అసెంబ్లీలోని తన కార్యాలయానికి రానున్న స్పీకర్.. రాజీనామా పత్రాలను పరిశీలించనున్నారు. స్వతహాగా న్యాయవాది అయిన రమేష్ కుమార్.. ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాజ్యాంగబద్దంగా రమేష్ కుమార్ ముందు ఇప్పుడు కొన్ని మార్గాలు ఉన్నాయి..



1) ఒక్కో ఎమ్మెల్యేను స్పీకర్ కార్యాలయానికి పిలిచి వారితో మాట్లాడి, రాజీనామాలను
ఆమోదించే అవకాశం. అదే జరిగితే కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి, పాలన గవర్నర్
చేతుల్లోకి వెళ్తుంది.
Loading...
2) ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాన్ని స్పీకర్ వాయిదా వేయవచ్చు.

3) ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ తిరస్కరించవచ్చు. దాంతో రాజీనామా చేసిన
ఎమ్మెల్యేలంతా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

4)ఫిరాయింపుల చట్టం కింద రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు వేయవచ్చు.
అప్పుడు ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

ప్రలోభాలతో తమ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కుందని కాంగ్రెస్-జేడీఎస్ వర్గాలు ఆరోపిస్తుండగా.. అంతర్గత కుమ్ములాటలతోనే ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి బయటకొచ్చారని కమలనాథులు చెబుతున్నారు. మరోవైపు ఈ పరిణామాలన్నీ కొంతమంది బీజేపీ నేతల్లో గుబులు రేపుతున్నాయి.కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని.. ప్రభుత్వం ఏర్పడ్డాక వారికి మంత్రి పదవులు కట్టబెడితే.. తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డవారిని విస్మరించి పార్టీ ఫిరాయించినవారికి ప్రాధాన్యం ఇస్తే ఎలా అన్న అసంతృప్తిలో ఉన్నారు.

బీజేపీలో చేరబోయే మొత్తం 15 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెడుతామని ఆ పార్టీ హామీ ఇచ్చినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మాజీ సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కర్ణాటక ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వేణుగోపాల్ వ్యవహార శైలి వల్లనే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

మొత్తం మీద కుమారస్వామి ప్రభుత్వం నిలబడాలంటే.. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప అసాధ్యమన్న వాదన బలంగా వినిపిస్తోంది. గడిచిన 50 ఏళ్లలో కర్ణాటకలో ఒక్క డి.దేవరాజు హయాంలో మినహా.. ఎస్ఎం కృష్ణ, సిద్దరామయ్య తదితర అన్ని ప్రభుత్వాలు కుదుపుకు గురైనవే. దీనికి అసెంబ్లీ వాస్తు సరిగా లేకపోవడమే ఇందుకు కారణమన్నవారు లేకపోలేదు. కర్ణాటక రాజకీయ సంక్షోభం మరో స్థాయికి చేరడంతో... యాక్సిడెంటల్ సీఎం కుమారస్వామి.. ఇప్పుడో అద్భుతం జరగాలని
కోరుకుంటున్నారు.
First published: July 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...