AAP NAMES BHAGWANT MANN AS ITS PUNJAB CHIEF MINISTER CANDIDATE KEJRIWAL ANNOUNCED MKS
Punjab Elections 2022: స్టాండప్ కామెడీ టు సీఎం పోస్ట్ -ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్ : కేజ్రీవాల్ ప్రకటన
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి మాన్
ఒకప్పటి స్టాండప్ కమెడియన్, ప్రస్తుత ఆప్ ఎంపీ భగవత్ మాన్ పేరును పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మంగళవారం మొహాలీలో నాటకీయంగా సాగిన ప్రెస్ మీట్ లో..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఒకప్పటి స్టాండప్ కమెడియన్, ప్రస్తుత ఆప్ ఎంపీ భగవత్ మాన్ పేరును పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మంగళవారం మొహాలీలో నాటకీయంగా సాగిన ప్రెస్ మీట్ లో మాన్ పేరును ఫైనలైజ్ చేశారు కేజ్రీవాల్. చరిత్రలో ప్రజాభిప్రాయాన్ని బట్టి సీఎం అభ్యర్థిని ఎంపిక చేశామని, వాట్సాప్, మిస్డ్ కాల్, ఎస్సెమ్మెస్ తదితర మార్గాల్లో ప్రజలు తమ ప్రియతమ నేతను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారని, భగవంత్ మాన్కు 93.3 శాతం మంది మద్దతు పలికారని కేజ్రీవాల్ చెప్పారు.
పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే దీమాతో ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్న ఆప్ చీఫ్ కేజ్రీవాల్.. ఇవాళ ఓటింగ్ ఫలితాలను వెల్లడించారు. దాదాపు 21 లక్షల మంది వివిధ మార్గాల్లో ఓటింగ్ లో పాల్గొన్నారని, అందులో 93.3 శాతం మంది భగవత్ మాన్ ను సీఎం అభ్యర్థిగా కోరుకున్నారని కేజ్రీవాల్ వెల్లడించారు.
ఆప్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో పంజాబ్ సీఎంగా కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూను 3 శాతం మంది కోరుకోవడం గమనార్హం. ‘ప్రజలు ఎన్నికున్న వ్యక్తినే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం.. రేపు అదే ప్రజలు ఆయనను సీఎంగానూ ఎన్నుకుంటారు. పంజాబ్ లో ఆప్ విజయం ఖరారైపోయింది’ అని కేజ్రీవాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
పంజాబీ స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు పొందిన భగవంత్ మాన్ 2014 మార్చిలో ఆప్‌లో చేరారు. 2014, 2019లలో సంగ్రూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఆప్ ఎంపీగా వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖకు కూడా మాన్ చీఫ్ గా ఉన్నారు. ‘ఒకప్పుడు జనం నన్ను చూసి తెగ నవ్వేవారు. కానీ ఇప్పుడు అందరూ రోదిస్తున్నారు. తమను కాపాడమని కోరుతున్నారు’అని సీఎం అభ్యర్థి మాన్ వ్యాఖ్యానించారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న పోలింగ్ జరుగనుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.