news18-telugu
Updated: February 22, 2020, 12:12 PM IST
ప్రశాంత్ కిషోర్ (File)
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తమ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే ఆహ్వానిస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఓపన్ ఆఫర్ ఇచ్చింది. ప్రశాంత్ కిషోర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. ఆప్‌లో చేరాలో? వద్దో? ఆయనే నిర్ణయం తీసుకోవాలని ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ తర్వాత పలు రాష్ట్రాల్లో ఆప్‌ను బలోపేతం చేయడంపై ఆ పార్టీ నేతలు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో తమ పార్టీలో చేరాలని ప్రశాంత్ కిషోర్‌ను ఆప్ ఆహ్వనించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రశాంత్ కిషోర్ తమ పార్టీలో చేరితే ఈ యేడాది అక్టోబర్‌లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వొచ్చన్నది ఆప్ నేతల యోచన కావచ్చని తెలుస్తోంది.
మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ-ప్యాక్ కేజ్రీవాల్ విజయం కోసం పనిచేయడం తెలిసిందే. ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో 62 స్థానాల్లో గెలిచిన ఆప్..మూడోసారి అధికార పగ్గాలను సొంతం చేసుకుంది. సీఏఏ విషయంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు జేడీయు నుంచి ప్రశాంత్ కిషోర్‌ను నితీశ్ కుమార్ గత నెల బహిష్కరించారు. నితీశ్ కుమార్‌కు బీజేపీ గౌరవం ఇవ్వడం లేదని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. నితీశ్ కుమార్‌పై తనకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నా... సైద్ధాంతిక విబేదాల కారణంగా ఆయనకు దూరమవుతున్నట్లు పేర్కొన్నారు.
Published by:
Janardhan V
First published:
February 22, 2020, 12:12 PM IST