AAP FOCUS ON SOUTH FIRST TARGET TELANGANA SAYS SOMNATH BHARTI PUNJAB CM ELECTION BHAGWANT MANN SECURITY WITHDRAW ORDERS MKS
దక్షిణాదిలో ఆప్ తొలి టార్గెట్ తెలంగాణే.. ఇదీ ప్రణాళిక : పంజాబ్‌లో వీఐపీలకు సామాన్యుడి షాక్
పంజాబ్ కాబోయే సీఎం మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
దక్షిణాదిలోనూ బలంగా విస్తరించేలా ఆప్ పావులు కదుపుతున్నది. సౌత్ లో తెలంగాణే తమ తొలి టార్గెట్ అని ఆప్ నేత సోమ్ నాథ్ భారతి ప్రకటించారు. పంజాబ్ లో సామాన్యుడి సర్కారు కొలువుదీరకముందే పని మొదలుపెట్టింది. వివరాలివి..
పంజాబ్ లో సంచలన విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన తర్వాతి టార్గెట్లుగా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఎంచుకుంది. త్వరలో జరగబోయే హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే అక్కడి స్థానిక ఎన్నికల్లో చీపురు పార్టీ గణనీయమైన సీట్లు సాధించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమాయత్తం కోసం ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ త్వరలోనే తిరంగా యాత్ర ప్రారంభించనున్నారు. అదే సమయంలో దక్షిణాదిలోనూ బలంగా విస్తరించేలా ఆప్ పావులు కదుపుతున్నది. సౌత్ లో తెలంగాణే తమ తొలి టార్గెట్ అని ఆప్ నేత సోమ్ నాథ్ భారతి ప్రకటించారు. పంజాబ్ లో సామాన్యుడి సర్కారు కొలువుదీరకముందే పని మొదలుపెట్టింది. వివరాలివి..
117 సీట్లున్న పంజాబ్ లో 92 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన ఆప్ రాబోయే రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ సత్తాచాటాలనుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ సభ్యత్వ నమోదు, పాదయాత్ర నిర్వహించాలని ఆప్ నిర్ణయించింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో కార్యక్రమాలు మొదలుపెడతామని ఆ పార్టీ నేత సోమ్ నాథ్ భారతి తెలిపారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నుంచి దశలవారీగా దక్షినాదిలో పాదయాత్రలు చేపడతామన్నారు.
మొదట తెలంగాణలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాదయాత్ర ప్రారంభిస్తామని సోమ్ నాథ్ భారతి తెలిపారు. ఇటీవల కేసీఆర్ ఢిల్లీలో పర్యటించిన సందర్భంలోనూ సోమ్ నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ సర్కారు భారీ అవినీతికి పాల్పడుతోందని, బీజేపీతో లోపాయికారి ఒప్పందాల కోసమే కేసీఆర్ జాతీయ కూటమి అంటూ హడావుడి చేస్తున్నారని ఆప్ నేత ఆరోపించారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల ఐక్యత కోసం గతంలో ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అపాయింట్మెంట్ దక్కని సంగతి తెలిసిందే. సొంతగా ఎదగాలనుకుంటోన్న ఆప్ రాబోయేరోజుల్లో తెలంగాణలో పార్టీల అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే
పేరుకు తగ్గట్టే ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయాల్లోనూ సామాన్యులకే ప్రాధాన్యం ఇస్తామని, బడాబాబులకు అదనపు సౌకర్యాలు రద్దు చేస్తామని నిరూపించుకుంటున్నది. పంజాబ్ లో భారీ మెజార్టీతో గెలుపొందిన ఆప్ ఓవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తూనే, అప్పుడే పాలనాపరమైన నిర్ణయాలూ తీసుకుంటున్నది. ఆప్ నుంచి సీఎం భగవంత్ మాన్ ఈ మేరకు వెలువరించిన తొలి నిర్ణయమే సంచలనంగా మారింది. పంజాబ్ లో వీవీఐపీ భద్రతను అనుభవిస్తోనన 122 మంది మాజీలకు మాన్ షాకిచ్చారు.
BJP: బీజేపీ విజయ రహస్యం ఏంటో తెలుసా? ఎన్నికల సిలబస్‌లో గెలుపు గ్రామర్ ఇదే..
రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలకు చెందిన 122 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించుకోవాలని అధికార యంత్రాంగాన్ని కాబోయే సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. కేంద్ర హోం శాఖ సూచనల ప్రకారం బాదల్ కుటుంబం, మాజీ సీఎంలు కెప్టెన్ అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ వంటి వారు మినహా మిగతా వారి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి తీసుకోవాలన్నారు.
పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్ మాన్ శనివారం నాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. శుక్రవారం మొహాలిలో జరిగిన సమావేశంలో ఆప్ శాసనసభా పక్ష నేతగా మాన్ ఎన్నికవడం తెలిసిందే. మార్చి 16న(బుధవారం) భగత్ సింగ్ స్వగ్రామమైన ఖేత్కర్ కలాన్‌లో భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.