సుమలత గెలిస్తే కాంగ్రెస్‌‌కి ప్లస్.. మాండ్యాలో నిఖిల్ గెలుపు కోసం జేడీఎస్ కులం కార్డు..

మాండ్యాలో సుమలత గెలిస్తే ఆమె బీజేపీలో చేరతారని కమలం నేతలు లెక్కలు వేస్తున్నారు. అయితే, ఆమె కాంగ్రెస్‌తోనే ఉంటారని హస్తం నేతలు ధీమాగా ఉన్నారు.

news18-telugu
Updated: April 6, 2019, 8:22 PM IST
సుమలత గెలిస్తే కాంగ్రెస్‌‌కి ప్లస్.. మాండ్యాలో నిఖిల్ గెలుపు కోసం జేడీఎస్ కులం కార్డు..
సుమలత మాత్రం తాను పద్ధతిగా వాడుకుంటుంటే... అక్రమార్కులెవరో దానిలోకి చొరబడి... నిబంధనలకు విరుద్ధంగా దాన్ని మార్చేశారనీ, అందువల్లే అది బ్లాక్ అయ్యిందనీ ఆరోపిస్తున్నారు. కుమార స్వామీ, జేడీఎస్ నేతలు ఎంత భయంకరమైన వాళ్లో దీన్ని బట్టే అర్థమవుతోందని ఆమె మండిపడ్డారు.
  • Share this:
రెండు రోజుల క్రితం మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ తన మనవడు మాండ్యా లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న నిఖిల్ కుమారస్వామి తరఫున జిల్లాలో ప్రచారం నిర్వహించారు. గౌడ కుటుంబంలో మూడోతరం నాయకుడిని గెలిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు ఎండ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత మధ్య ఆయన ప్రచారం సాగింది. బహిరంగసభల్లో దేవెగౌడ దాదాపు ఏడ్చినంత పనిచేశారు. అయితే, అది కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రం కరిగించలేకపోయింది. మాండ్యా నుంచి దేవెగౌడ అలా వెనుదిరిగిన మరుక్షణమే కాంగ్రెస్ కార్యకర్తలు ‘మాండ్యాలో యుద్ధం, కాంగ్రెస్ - జేడీఎస్ మధ్యే’ అని ప్రకటించారు. బీజేపీ ఇక్కడ తమకు పోటీ కాదని స్పష్టం చేస్తున్నారు. నిన్నటికి నిన్న కర్ణాటక సీఎం కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ మీద ఓ రేంజ్‌లో ఊగిపోయారు. మాండ్యాలో తన కుమారుడు నిఖిల్‌ను ఓడించడానికి చక్రవ్యూహం పన్నారని మండిపడ్డారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత తాను చాలా మంది బండారం బయటపెడతానని హెచ్చరించారు. అదే సమయంలో నిఖిల్ గౌడ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను కలసి మాండ్యాలో తన కోసం ప్రచారం చేయాల్సిందిగా కోరారు. మాండ్యాలో అసలు రచ్చకు కారణం సిద్ధరామయ్యే అని గౌడ కుటుంబం ఆరోపిస్తున్న తరుణంలో నిఖిల్ గౌడ ఆయన వద్దకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మాండ్యాలో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ తమ అభ్యర్థిని ప్రకటించని బీజేపీ, ఆమెకు అధికారికంగా మద్దతు తెలిపింది. మరోవైపు రైతా సంఘా (ఫార్మర్స్ పార్టీ)కి స్థానిక కాంగ్రెస్ నాయకత్వం అనధికారికంగా మద్దతునిస్తోంది. దీంతో గౌడ కుటుంబం ఇక్కడ విస్త్రతంగా ప్రచారం చేస్తోంది.


కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మాండ్యాలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి రాష్ట్రంతో పాటు దేశంలోని చాలా మందిలో నెలకొంది. బెంగళూరు - మైసూర్ మధ్య మాండ్యా నియోజకవర్గం ఉంటుంది. ఇక్కడ చెరకు రైతులు అధికం. ఇక్కడ జనాభాలో 60శాతం మంది వక్కళిగ సామాజికవర్గం ఉంటుంది. మాండ్యా జిల్లాలో బీజేపీకి పెద్దగా ప్రభావం లేదు. ప్రధాన ఫైట్ మాత్రం కాంగ్రెస్ - జేడీఎస్ మధ్య నెలకొంది. జేడీఎస్ - కాంగ్రెస్ పొత్తుల్లో భాగంగా మాండ్యా సీటును దేవెగౌడ కుటుంబానికి ఇవ్వడంతో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మాండ్యా నుంచి స్థానిక నేతను బరిలోకి దింపుతారని అంతా ఆశించారు. అయితే, తన మనవడు, హీరో నిఖిల్ గౌడను రంగంలోకి దించారు.

నిఖిల్ గౌడ, దేవెగౌడ, సుమలత


మాండ్యాలో ఆరు నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచి జేడీఎస్ తరఫున బరిలో దిగిన ఎల్ఆర్ శివరామె గౌడ విజయం సాధించారు. ఈసారి కూడా ఆయన బరిలో దిగాలనుకున్నారు.కానీ, జేడీఎస్ అధినాయకత్వం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అంబరీష్ ఇటీవల చనిపోయారు. మాండ్యా నుంచి అంబరీష్ భార్య సుమలత పోటీ చేయాలనుకున్నా హస్తం పార్టీ పెద్దగా స్పందించలేదు. దీంతో సుమలత ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు. ఆమెకు బీజేపీ మద్దతు ప్రకటించింది.

మాండ్యాలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య వైరం ఉంది. దీంతో అధిష్టానం మాటలను కూడా స్థానిక కాంగ్రెస్ నాయకులు లెక్క చేయడం లేదు. సుమలతకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బెంగళూరులో ఉండే పార్టీ పెద్దలకు ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు. జేడీఎస్ స్థానిక రాజకీయాల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు.

గౌడ కుటుంబం మమ్మల్ని బాగా వేధించింది. చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి ఇబ్బంది పెట్టింది. మంత్రి రేవణ్ణ మమ్మల్ని వేధించారు. అప్పుడు సీఎం కుమారస్వామి సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు జేడీఎస్ మీద ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. మాండ్యా పాల యూనియన్ కాంగ్రెస్‌కు మద్దతిస్తోంది. ఇది పూర్తిగా స్థానిక సంగ్రామం.
న్యూస్‌18తో ఓ కాంగ్రెస్ నేత


‘ఇది కేరళలో యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ ఫైట్ లాంటిది. కర్ణాటకలో ఉన్న 24 జిల్లాల్లో ఆరు జిల్లాల్లో మాత్రమే మాతో జేడీఎస్‌కి టఫ్ ఫైట్ ఉంది. హసన్, మాండ్యా ల్లో బస్తీమే సవాల్ అన్నట్టుగా ఉంది. ఇక్కడ జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య శత్రుత్వం ఉంది. వారిద్దరూ కలిసి ఎలా పనిచేస్తారు? సీఎం కుమారుడిని పోటీకి దింపడంతో ఆ శత్రుత్వం మరింత పెరిగింది.’ అని మాండ్యాలో గురు అనే కాంగ్రెస్ కార్యకర్త చెప్పారు.

సుమలత, అంబరీష్


సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమె తమ పార్టీ అభ్యర్థే అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ కలసి ప్రచారం చేయడం విశేషం. ‘సుమలత... బీజేపీ మద్దతిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థే.’ అని మాండ్యాలో ఓ వ్యాపారి శ్రీరంగ గౌడ వ్యాఖ్యానించడం గమనించాల్సిన అంశం. ‘మాండ్యా మినహా మిగిలిన మొత్తం కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ కలసి బీజేపీతో పోటీపడుతున్నాయి. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ - బీజేపీ కలసి జేడీఎస్‌ను ఢీకొడుతున్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితి.’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని న్యూస్‌18తో మాట్లాడిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వ్యక్తం చేశారు. మాండ్యాలో కాంగ్రెస్‌ను కాపాడుకోవడం కోసం తాము జేడీఎస్‌తో తలపడుతున్నామని చెప్పారు. నిఖిల్ గౌడకు మద్దతిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ వైపు మళ్లే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఒకవేళ సుమలత ఓడిపోయినా కేడర్ పార్టీని అంటిపెట్టుకునే ఉంటుందని వారు చెప్పారు.

‘సుమలత గెలిస్తే అది కాంగ్రెస్ పార్టీకి గుడ్ న్యూసే. ఇక్కడ బీజేపీకి లక్ష ఓట్లు ఉంటాయి. ఆమె గెలిస్తే అది కేవలం కాంగ్రెస్ ఓట్ల వల్లే. అందుకే సుమలత ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది.’ అని కాంగ్రెస్ కార్యకర్తలు న్యూస్‌18కి తెలిపారు.


మరోవైపు మాండ్యాలో సుమలత గెలిస్తే ఆమె బీజేపీలో చేరతారని కమలం నేతలు లెక్కలు వేస్తున్నారు. అయితే, ఆమె కాంగ్రెస్‌తోనే ఉంటారని హస్తం నేతలు ధీమాగా ఉన్నారు. అయితే, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరవచ్చని సుమలతకు సన్నిహితంగా ఉండే ఒకరు న్యూస్‌18కి తెలిపారు. మాండ్యా పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గౌడ సామాజికవర్గం నిఖిల్ గెలుపు కోసం కృషి చేస్తోంది. దీంతో పాటు సుమలత నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్న జేడీఎస్ ‘మాండ్యా ఆత్మగౌరవం’ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది.

సుమలత


సుమలత ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడు సామాజికవర్గానికి చెందిన వారని, ఆమె గౌడ కాదని సిట్టింగ్ జేడీఎస్ ఎంపీ ఎల్‌ఆర్ శివరామ గౌడ అన్నారు. ‘ఆమె (సుమలత) గెలిస్తే మాండ్యాని మొత్తం నాయుడు భూమి చేసేస్తుంది. ఆమెను ఓడించాలి’ అని శివరామ గౌడ పిలుపునిచ్చారు. కులం కార్డుతో ఇక్కడ గెలవాలని జేడీఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సుమలత మాత్రం తన భర్త అంబరీష్‌ చేసిన అభివృద్ధినే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. జేడీఎస్ మీద కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్న కోపం ఆమెకు కలిసొచ్చే అంశం.

(డీపీ సతీష్, సౌత్ హెడ్, న్యూస్‌18)
Published by: Ashok Kumar Bonepalli
First published: April 6, 2019, 7:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading