AP Panchayat Elections: ఏపీలో ఇంతవరకు పంచాయతీ ఎన్నికలు జరగని గ్రామం ఇదే...

(ప్రతీకాత్మక చిత్రం)

AP Panchayat Elections: ఇంతవరకు ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవంటే నమ్ముతారా...? పంచాయతీ ఎన్నికల్లో పోటీ అంటేనే అక్కడివారకు గిట్టదట.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల హడావిడే నడుస్తోంది. ఓ వైపు ఎస్ఈసీ మరోవైపు ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతుంటే.. మరోవైపు గ్రామాల్లో నామినషన్ల ప్రక్రియ జరుగుతోంది. ఐతే ఎప్పుడూ లేనంతగా ఈసారి ఏకగ్రీవాల అంశం హాట్ టాపిక్ గా మారింది. బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే... గ్రామాల్లోకి రాజకీయాలెందుకు తీసుకొస్తున్నారని అధికార పక్షం ప్రశ్నిస్తోంది. ఇంతటి పొలిటికల్ హీట్ లోనూ ఓ గ్రామం ఏకగ్రీవానికే ఓటేస్తోంది. ఇంతవరకు ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవంటే నమ్ముతారా...? పంచాయతీ ఎన్నికల్లో పోటీ అంటేనే అక్కడివారకు గిట్టదట. వివరాల్లోకి వెళ్తే ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం, బైరిపురంలో ఇంతవరకు సర్పంచ్ పదవి కోసం ఎన్నికలు జరగలేదట.

    రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారుతున్న ఆ గ్రామంలో ప్రజలందరిదీ ఒకే మాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రామస్తులు ఆయా పార్టీలకు మద్దతిచ్చినా.., పంచాయతీ ఎన్నికలొచ్చేసారకి ఆ మాటెత్తితే ఊరుకోరట. గ్రామంలో ఎన్నికలంటే మేంమేం చూసుకుంటాం.. ఇందులో పార్టీల గొడవలొద్దనేది అక్కడివారు చెప్పే మాట. 1300 మందికి పైగా జనాభా ఉన్న బైరిపురంలో పంచాయతీ ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే ఓ సమావేశం జరుగుతుంది. ఆ మీటింగ్ కి గ్రామంలోని ఒక్కొ ఇంటి నుంచి ఒక్కొక్కరు హాజరవుతారు.

    గ్రామాభివృద్ధి, సర్పంచ్ అభ్యర్థిపై ఆ సమావేశంలో చర్చిస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుందో చర్చించుకొని వారినే ఎంపిక చేస్తారు. గ్రామస్తులు చేసిన తీర్మానానికి తిరుగుండదు. మళ్లీ ఎన్నికలొచ్చేవరకు ఆ వ్యక్తే సర్పంచ్ గా కొనసాగుతారు. గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాన్ని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తర్వాతి చర్యలు తీసుకోమని కోరతారు.

    దీని ద్వారా రెండు లాభాలున్నాయనేది గ్రామస్తులు చెప్తున్న మాట. మొదటిది ఊళ్లో రాజకీయ తగాదాలు లేకుండా ఎన్నిక ప్రక్రియ పూర్తవడం.., రెండోది ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రొత్సాహం. ఈ నిధులతో గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడామన్నారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలు చాలా చోట్ల జరుగుతున్నా.. గ్రామస్తులే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సర్పంచ్ ను ఎన్నుకోవడం గమనార్హం. దశాబ్దాలుగా ఇక్కడ ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది.
    Published by:Purna Chandra
    First published: