2జీ స్కాం వెంటాడుతున్నా.. నీలగిరుల్లో వీస్తున్న రాజా ‘గాలి’

అన్నాడీఎంకేలో కుమ్ములాటలు కూడా రాజాకు ఎన్నికల్లో కలసివస్తున్నాయి. టీటీవీ దినకరన్‌కు చెందిన AMMK వల్ల కూడా అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్‌కు గండి పడేలా ఉంది.

news18-telugu
Updated: March 30, 2019, 10:54 PM IST
2జీ స్కాం వెంటాడుతున్నా.. నీలగిరుల్లో వీస్తున్న రాజా ‘గాలి’
ఏ.రాజా (Reuters)
  • Share this:
ఉదగమండలం (తమిళనాడు) : కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న నీలగిరి కొండల్లో చల్లగా ఉంటుంది. సమ్మర్ హీట్ నుంచి ఉపశమనం పొందడానికి, కొంచెం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి జనం ఇక్కడకు వస్తుంటారు. 6500 అడుగుల నీలగిరులు ఎక్కి చల్లగాలిని ఆస్వాదిస్తుంటారు. ఊటీ, వెల్లింగ్టన్, కూనర్ లాంటి ప్రాంతాల్లో సేదతీరుతుంటారు. నీలి రంగులో, ఆకాశాన్ని అంటుతూ కనువిందు చేస్తూ చల్లటి గాలి వీచే నీలగిరి కొండల్లో ప్రస్తుతం పొలిటికల్ గాలి వీస్తోంది. కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు అనుకూలంగా బలమైన గాలి వీస్తోంది. 2జీ స్కామ్ ఆయన్ను వెంటాడుతున్నా.. డీఎంకే అభ్యర్థి అయిన రాజా మరోసారి నీలగిరుల్లో పాగా వేయడం ఖాయంగా ఉంది. 2జీ స్కామ్ వల్లే 2014 ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన ఏ.రాజా మళ్లీ పట్టునిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నారు.

నీలగిరి లోక్‌సభ స్థానానికి ఏ.రాజా ఓ రకంగా బయటివ్యక్తే. గతంలో ఆయన పెరంబదూర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. డీఎంకే టికెట్ మీద ఆయన మూడు సార్లు గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నీలగిరి సీటు ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో రాజా 2009లో నీలగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో అన్నాడీఎంకే అభ్యర్థి గోపాలకృష్ణన్ చేతిలో ఓడిపోయారు. ఈసారి రాజాపై ఎం.త్యాగరాజన్‌‌ను అన్నాడీఎంకే పోటీకి దింపింది. బరిలో మరికొందరు ఉన్నా కూడా పోటీ మాత్రం రాజా, త్యాగరాజన్ మధ్యే ఉంటుందనేది అందరూ అంగీకరించే అంశం. ఈసారి తన గెలుపు ఖాయమని రాజా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మే 23న దేశ ప్రజలు బీజేపీని దింపేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంకుశ పాలన, అభివృద్ధి లేమిపై ప్రజలు విసుగెత్తి ఉన్నారు. ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. నేను ఎప్పుడు కలిసినా జనం నోట్ల రద్దు మీద ఫిర్యాదుచేస్తున్నారు. నోట్ల రద్దు వల్ల పేదలు ఎక్కువగా నష్టపోయారు. జీఎస్టీతో వ్యాపారస్తులు కూడా అసంతృప్తితో ఉన్నారు.

న్యూస్‌18తో ఎ. రాజా, కేంద్ర మాజీ మంత్రి
తమిళ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బీజేపీతో చేతులు కలిపారని రాజా మండిపడ్డారు.

ఇన్నాళ్లూ నేను అన్నాడీఎంకేకి మద్దతిచ్చా. కానీ, బీజేపీతో పొత్తుతో తీవ్ర నిరాశకు గురయ్యా. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు ఆ పార్టీని ఫినిష్ చేసేస్తుంది. బీజేపీ మీద ప్రజలు చాలా అంశాల్లో వ్యతిరేకతతో ఉన్నారు. మోదీ తమిళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ ఢిల్లీకి సామంతుల్లా పనిచేస్తున్నారు. ఈసారి రాజాకే ఓటేస్తా. అమ్మ (జయలలిత) చనిపోయిన తర్వాత అన్నాడీఎంకేలో ఏమీ లేదు.
న్యూస్‌18తో రఘు, ఊటీలో ఓ ఆటో డ్రైవర్
నీలగిరుల్లోని గిరిజన తెగల నుంచి కూడా రాజాకు అనుకూలమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడి నాలుగు ప్రధాన గిరిజన తెగలైన బడగ, తోడ, కోట, కురుంబ వర్గాలను రాజా తనకు అనుకూలంగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది.

ఊటీలో ఐదేళ్ల క్రితం కొండచరియలు విరిగిపడినప్పుడు రాజా బాగా పనిచేశారు. రాజాని సులువుగా కలవొచ్చు. ప్రజలతో కలిసిపోతారు. యూపీఏ అధికారంలోకి వస్తే ఆయన మరోసారి కేంద్ర మంత్రి అవుతాడనుకుంటున్నాం.
విలియం, చిరు వ్యాపారి


రాజా అమాయకుడని, రాజకీయ కారణాలతో కొందరు 2జీ స్కాంలో ఆయన్ను ఇరికించారని రాజా అనుచరులు చెబుతారు. దళితుడు కాబట్టే అతడ్ని ఇరికించారని ఓ డీఎంకే కార్యకర్త పార్తిబన్ అభిప్రాయపడ్డారు.

రాజాని కోర్టు నిర్దోషిగా ప్కటించింది. దీన్ని బట్టి అసలు 2జీ స్కాం లేదని తేలిపోయింది. అదంతా అప్పటి కాగ్ వినోద్ రాయ్ సృష్టి. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపిన ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి.
న్యూస్‌18తో పార్తిబన్, డీఎంకే కార్యకర్త


అన్నాడీఎంకేలో కుమ్ములాటలు కూడా రాజాకు ఎన్నికల్లో కలసివస్తున్నాయి. రెండేళ్ల క్రితం జయలలిత మరణం తర్వాత ఈపీఎస్ - ఓపీఎస్ వర్గాల మధ్య విబేధాలు వచ్చాయి. పార్టీని క్రమశిక్షణలో నడపలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది. మరోవైపు బీజేపీతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకోవడంతో కొందరు ప్రచారానికి దూరంగా ఉన్నారు. కొందరైతే డీఎంకేకి ఓటేయాలని కూడా నిర్ణయించుకున్నట్టు అంతర్గత వర్గాల ద్వారా సమాచారం.

రాజా, స్టాలిన్


దీంతో పాటు అన్నాడీఎంకే నుంచి గెంటివేతకు గురైన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు చెందిన AMMK వల్ల కూడా అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్‌కు గండి పడేలా ఉంది. ‘దినకరన్ గెలవకపోవచ్చు. కానీ కచ్చితంగా అన్నాడీఎంకేని మాత్రం ఓడిస్తాడు. బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుతో పోటీ చేసిన సీట్లలో కనీసం 50వేల నుంచి లక్ష ఓట్ల వరకు చీలుస్తారు.’ అని స్థానిక రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

నీలగిరి కొండలు


రాజా గెలవడం వంద శాతం కాదు 200 శాతం ఖాయమైందని మరో రాజకీయ విశ్లేషకుడు అన్నారు. గతంలో నెగిటివ్ ప్రచారం వల్ల రాజా ఓడిపోయారని చెప్పారు. దీంతోపాటు అప్పుడు జయలలిత బతికే ఉన్నారని, అప్పుడు సీఎం కూడా ఆమేనని తెలిపారు. ఈసారి మాత్రం రాజా గెలుపు నల్లేరు మీద నడకేనని అభిప్రాయపడ్డారు. గెలుస్తామన్న ధీమా ఉన్నా కూడా చాన్స్ తీసుకోకూడదన్న ఉద్దేశంతో రాజా, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏప్రిల్ 18న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.

(డీపీ సతీష్, సౌత్ హెడ్, న్యూస్‌18)
First published: March 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు