Narendra Modi: తక్షణం మోదీ ఫొటోలను తొలగించండి.. పెట్రోల్ బంకులకు ఈసీ ఆదేశం

ప్రతీకాత్మక చిత్రం (Image:PTI)

ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో కేంద్ర పథకాల హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హోర్డింగ్‌లను తొలగించేందుకు పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు, ఇతర ఏజెన్సీలకు 72 గంటలు సమయం ఇచ్చింది.

  • Share this:
    కొన్ని రోజులుగా దేశమంతటా పెట్రోల్ రేట్లపైనే చర్చ జరుగుతోంది. ఇంధన ధరలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సెంచరీని దాటి.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. త్వరలోనే మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండబోతోంది. పెరిగిన రేట్లను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. పెట్రోల్ బంకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో కేంద్ర పథకాల హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. హోర్డింగ్‌లను తొలగించేందుకు పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు, ఇతర ఏజెన్సీలకు 72 గంటలు సమయం ఇచ్చింది.

    ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి.. పెట్రోల్ బంకుల్లో ప్రధాని మోదీ ఫొటోలతో ఉన్న హోర్డింగ్స్ గురించి ఫిర్యాదు చేశారు. ఇది కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. మోదీ ఫొటోతో ఉన్న ప్రభుత్వ పథకాల ప్రచార హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని పెట్రోల్ బంకుల యాజమాన్యాలను ఆదేశించింది.

    కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. మొత్తం 8 దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశ ఎన్నికలు - మార్చి 27న, రెండో దశ ఎన్నికలు - ఏప్రిల్ 1న, మూడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు - ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 17న, ఆరో దశ ఎన్నికలు - ఏప్రిల్ 22న, ఏడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 26న, ఎనిమిదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 29న జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం ఫలితాలతో పాటే మే2న బెంగాల్ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: