సరిగ్గా ఏడాది క్రితం కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, టీడీపీ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఎన్నేళ్లు ఎదురుచూసినా... కేంద్రంలోని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు సరైన న్యాయం చేయడం లేదని భావించింది. కనీసం మిత్రపక్షం అధికారంలో ఉందనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదని టీడీపీ ఆరోపించింది. అంతే... అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం... చివరకు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడానికి కారణమైంది. మొదట టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడంతో... ఇరు పార్టీల మధ్య స్నేహ బంధానికి బీటలు వారడం మొదలైంది.
అయితే టీడీపీ ఒత్తిళ్లకు బీజేపీ లొంగకపోవడంతో... ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఇరు పార్టీ మధ్య మొదలైన మాటల యుద్ధం... నేడు పతాకస్థాయికి చేరుకుంది. ఎన్డీయేకు దూరమైన ఈ సమయంలో... బీజేపీ, టీడీపీ మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోయింది. ఏకంగా ఎన్డీయేపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేంతవరకు వెళ్లింది. దీంతో... ఇరు పార్టీలు రాజకీయంగా బద్ధ శత్రులువుగా మారిపోయాయి. ఒకప్పుడు ఒకరినొకరు పొగుడుకున్న వాళ్లే... ఆ తరువాత ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకున్నారు. చివరకు బీజేపీకి దూరమైన టీడీపీ... తమ చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌తో స్నేహం చేయడానికి కూడా దగ్గరవడం... గత బడ్జెట్‌కు ఈ బడ్జెట్‌కు మధ్య జరిగిన పరిణామాల్లో కీలకమైనదిగా చెప్పుకోవచ్చు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని భంగపడ్డ టీడీపీ... ఏపీలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తుకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో దోస్తీ కొనసాగించాలని నిర్ణయించింది. ఎన్డీయే నుంచి బయటకు రావడానికి టీడీపీ కేంద్ర బడ్జెట్‌ను కేవలం ఓ సాకుగా వాడుకుందనే వార్తలు కూడా ఉన్నాయి. ఏదేమైనా... గత బడ్జెట్ తరువాత టీడీపీ, బీజేపీ మధ్య పెరిగిన దూరం... ఇప్పుడు పూర్తిస్థాయిలో వైరంగా మారడం విశేషం. మరి... ఈ సారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌తో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం మరింతగా ముదురుతుందా అన్న అంశంపై చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Chandrababu naidu, NDA, Pm modi, Tdp, Union Budget 2019