కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి అసమ్మతి సెగ తగులుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 20మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో సీఎం కుమారస్వామి 'కుర్చీ'పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అసమ్మతి నేతలను కాంగ్రెస్ బుజ్జగించే ప్రయత్నం చేసి.. అంతా సమసిపోయిందనుకుంటున్న తరుణంలో.. అనూహ్యంగా వారు ఝలక్ ఇచ్చారు.
మంత్రి రమేశ్ జార్కి హోళి, ఆయన సోదరుడు సతీశ్ జార్కిహోళి ఆధ్వర్యంలో దాదాపు 20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. వీరంతా ముంబై వెళ్లి పార్టీలో చేరికపై బీజేపీ అగ్రనేతలతో మంతనాలు సాగించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు వీరు సమాచారం అందించారని, వీరికి కావాల్సిన భద్రతను ఆయనే సమకూరుస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హోసకోట ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు, చిక్బళ్లాపురం ఎమ్మెల్యే డా.సుధాకర్.. ఈ తిరుగుబాటుకు వ్యూహం రచించారని తెలుస్తోంది. తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేల్లో శ్రీమంత పాటిల్, మహంతేశ్ కమటహళ్లి, ఆనంద్ సింగ్, నాగేంద్ర, గణేశ్, భీమానాయక్, రాజా వెంకటప్ప నాయక్, బి.సత్యనారాయణ, బీసీ పాటిల్, బీకే సంగమేశ్,నాగేంద్ర,ఆర్.శంకర్ ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని ప్రకటించిన మంత్రులు రమేశ్, సుధాకర్‌లు..రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చంటూ మాట మార్చడం కర్ణాటక సర్కార్‌లో మరింత కలవరం పెంచింది.
బీజేపీపై కుమారస్వామి ఆగ్రహం:
కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు కుమారస్వామి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తమ ఎమ్మెల్యేలను లాగేసుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. మిలటరీ వాహనాల్లో వారిని ముంబై తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల వల్లే కొంతమంది పార్టీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారని, అంతే తప్ప అందులో తమ ప్రమేయం ఏమి లేదని బీజేపీ అధికార ప్రతినిధి మధుసూదన్ అన్నారు.