బడ్జెట్‌కు ముందు బీజేపీపై కుమారస్వామి బాంబు.. యడ్యూరప్ప బేరసారాల ఆడియో లీక్!

కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను లాగడానికి యడ్యూరప్ప&టీమ్ ప్రయత్నిస్తుండటంతో కుమారస్వామి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే యడ్యూరప్ప బేరసారాలకు సంబంధించిన ఆడియో టేపులను బయటపెట్టింది.

news18-telugu
Updated: February 8, 2019, 11:07 AM IST
బడ్జెట్‌కు ముందు బీజేపీపై కుమారస్వామి బాంబు.. యడ్యూరప్ప బేరసారాల ఆడియో లీక్!
మీడియా ముందు యడ్యూరప్ప ఆడియో టేపును బయటపెట్టిన కుమారస్వామి(File)
  • Share this:
కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ.. సీఎం కుమారస్వామి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు సంబంధించిన ఓ ఆడియో టేపును బయటపెట్టారు.జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు యడ్యూరప్ప జరుపుతున్న బేరసారాలు ఆడియో టేపులో రికార్డయ్యాయి. నాగనగౌడ అనే ఓ ఎమ్మెల్యేకు యడ్యూరప్ప రూ.25లక్షలు డబ్బుతో పాటు అతని తండ్రికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు అందులో వెల్లడైంది.ప్రధాని మోదీ అండదండలతోనే రాష్ట్రంలో బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కుమారస్వామి ఆరోపించారు.

మోదీ తన రాజకీయ జీవితంలో నైతిక విలువలను పాటించే వ్యక్తే అయితే.. వెంటనే యడ్యూరప్ప సహా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చాక దేశంలోని వ్యవస్థలన్ని నిర్వీర్యం అయిపోతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కూనీ చేస్తోందని విమర్శించారు.

కర్ణాటక అసెంబ్లీలో నేడు కుమారస్వామి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇంకా టచ్‌లోకి రాకపోవడం సంకీర్ణ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. బడ్జెట్ సెషన్స్ మొదటిరోజు కాంగ్రెస్ విప్ జారీ చేసినప్పటికీ దాదాపు 10మంది ఎమ్మెల్యేలు గైర్హాజరవడంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వంలో మరింత అలజడి రేగింది. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రమేష్ జర్కిహోళి, మహేశ్ కుమతల్లి, ఉమేశ్ జాదవ్, బి నాగేంద్ర ఇప్పటికీ పార్టీతో టచ్‌లోకి రాకపోవడంతో ఫిరాయింపుల చట్టం కింద వారిపై అనర్హత వేటు వేస్తామని మాజీ సీఎం సిద్దరామయ్య హెచ్చరించారు. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ బాడీ స్పీకర్‌ కేఆర్ రమేశ్‌కు ఒక లేఖ రాయనుంది.


మొత్తం 225మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుని కాంగ్రెస్-జేడీఎస్ బలం 117 కాగా.. బీజేపీ బలం 104. నలుగురు రెబల్ ఎమ్మెల్యేలను మినహాయిస్తే కాంగ్రెస్-జేడీఎస్ బలం 113. కాబట్టి నలుగురు రెబల్స్ పార్టీ వీడినా సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమి ఉండదు. ఒకవేళ ఈ నలుగురు రెబల్స్‌పై అనర్హత వేటు వేస్తే.. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 221.. మేజిక్ ఫిగర్ 111 అవుతుంది. ఎలాగూ సంకీర్ణ ప్రభుత్వానికి 113మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది కాబట్టి పెద్ద నష్టమేమి జరగదు.

అయితే కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను లాగడానికి యడ్యూరప్ప&టీమ్ ప్రయత్నిస్తుండటంతో కుమారస్వామి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే యడ్యూరప్ప బేరసారాలకు సంబంధించిన ఆడియో టేపులను బయటపెట్టింది. ఆడియో టేపుల్లో యడ్యూరప్ప కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. తమవద్ద మరిన్ని ఆధారాలున్నాయని, అన్నింటినీ బయటపెడుతామని కుమారస్వామి చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై బీజేపీ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Published by: Srinivas Mittapalli
First published: February 8, 2019, 10:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading