• HOME
 • »
 • NEWS
 • »
 • HIGH TEMPERATURE IN RAMAGUNDAM PEOPLE AFRAID TO COME OUT VB KNR

Telangana: ఎండలు బాబోయ్‌ ఎండలు.. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న ప్రజలు.. అక్కడ మాత్రం నిప్పులగుండమే..

Telangana: ఎండలు బాబోయ్‌ ఎండలు.. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న ప్రజలు.. అక్కడ మాత్రం నిప్పులగుండమే..

నిర్మానుష్యంగా మారిన రామగుండం ప్రధాన రహదారి

Peddapalli: ఒక వైపు కరోనా.. మరో వైపు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే మున్ముందు ఎలా ఉంటుందో అని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు..

 • Share this:
  రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఓ వైపు కరోనా.. మరోవైపు ఎండలు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు బయటకు వెళ్దామంటే వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నిప్పుల గుండంగా మారింది. 44.4 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వారం రోజుల నుంచి వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మండుతున్న ఎండలతో భయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటలైతే చాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక మధ్యాహ్నం వేళలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎండలు ఎలా ఉంటాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఏప్రిల్, మే నెలలో ఉంటాయనుకున్నా ఫిబ్రవరి నుంచే ‘సూర్య’ ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి 28న రామగుండం ప్రాంతంలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా ఏప్రిల్‌ 1న అత్యధికంగా 44.4 డిగ్రీలు నమోదయ్యింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 41.4 డిగ్రీల ఉష్టోగ్రత నమోదవ్వగా ఒక్క రామగుండంలోనే అత్యధికంగా 44.4 డిగ్రీలు నమోదయ్యింది.

  రామగుండంలోనే ఎందుకు అంత వేడి..? 

  రామగుండంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడానికి కారణం ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడమే. పారిశ్రామిక ప్రాంతం కాబట్టి సాధారణం కంటే కొద్దిగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సింగరేణి, నేషనల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(ఎన్‌టీపీసీ), సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లు ఉన్నాయి. అందుకే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతంగా రామగుండం చెప్పవచ్చు. సింగరేణిలో కార్మికులు ఎండ వేడిమితో పాటు వడగాలులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

  ramagundam, karimnagar, peddapalli, high temperature
  బోసిపోతున్న రామగుండం ప్రధాన చౌరస్తా


   ఊపందుకున్న ‘చల్లని’ వ్యాపారాలు..
  ఎండాకాలం వచ్చిందంటే చాలు శీతల పానీయాల అమ్మకాలు జోరందుకుంటాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందాలంటే మజ్జిగ, కొబ్బరి నీరు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం ఎక్కువగా తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తుండగా రోడ్డు పక్కన వెళ్లే వాహనదారులు, పాదచారులు చల్లని పానీయాలు సేవించి ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ ఎండల తీవ్రత పెరుగుతుండటంతో శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థపై వడదెబ్బ తగిలే అవకాశం ఉందని అందుకే అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఉపాధి హామీ పనులు చేసేవారు సైతం ఎండలో పనులు చేయకూడదన్నారు. తప్పని పరిస్థితిల్లో వెళ్లాల్సి వేస్తే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

  త్వరలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో...
  జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను త్వరలో అందుబాటులో ఉంచుతామని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. త్వరలో జరిగే జిల్లా స్థాయి సమావేశంలో ఎండాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై తీర్మానం చేసి అమలు చేస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
  Published by:Veera Babu
  First published:

  అగ్ర కథనాలు