Home /News /national /

ZERO SEATS IN LOK SABHA 19 IN UP ASSEMBLY CAN MAYAWATI RESURRECT BSP IN 2019 BATTLE NK

లోక్‌ సభలో సున్నా... యూపీ అసెంబ్లీలో 19... మాయావతి బీఎస్పీ 2019 ఎన్నికల్లో సత్తా చాటగలదా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Lok Sabha Elections 2019 : ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ప్రభ నానాటికీ తగ్గుతోంది. 2007లో యూపీ అసెంబ్లీలో 206 సీట్లున్న బీఎస్పీకి ఇప్పుడున్నది 19 స్థానాలే. పార్టీ గ్రాఫ్ 90 శాతం పడిపోయింది.

2014 లోక్ సభ ఎన్నికలు మాయావతి సారధ్యంలోని బహుజన సమాజ్ పార్టీ (BSP)కి కలిసిరాలేదు. 2009లో 21 లోక్ సభ స్థానాలుండే ఆ పార్టీ... 2014 ఎన్నికల్లో ఒక్క స్థానమూ గెలవలేకపోయింది. దేశవ్యాప్తంగా అత్యధిక ఓటింగ్ శాతం ఉన్న పార్టీల్లో బీఎస్పీది మూడోస్థానం (4.2 శాతం) అయినా ఫలితం దక్కలేదు. 2014లో యూపీలో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 80 అసెంబ్లీ స్థానాల్లో 71 గెలుచుకుని రికార్డు సృష్టించింది. మూడేళ్ల తర్వాత అదే కాషాయ దళం... రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 312 సీట్లు గెలిచింది. రాష్ట్రంలోని అగ్రవర్ణ బ్రాహ్మణుల్లో 70 శాతం మంది, ఓబీసీల్లో 60 శాతం మంది, కుర్మీల్లో 53 శాతం మంది, దళితుల్లో 45 శాతం మంది బీజేపీకే ఓటు వేశారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), బీఎస్పీల ఓటు బ్యాంకైన దళితులు కూడా బీజేపీకే సపోర్ట్ ఇచ్చారు. 2017లో బీజేపీ... ఒకటి తర్వాత ఒకటిగా ఒక్కో రాష్ట్రాన్నీ గెలుచుకుంటూ పోయింది.

1989లో బీఎస్పీ తొలిసారిగా లోక్ సభ ఎన్నికలకు పోటీ చేసింది. 245 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. మూడు చోట్ల గెలిచి, 2.1 శాతం ఓటు బ్యాంక్ సంపాదించింది. తొలిసారిగా బిజ్నూర్ నుంచీ పోటీ చేసి గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పార్టీ మరింత విస్తరించింది. 2009లో ఏకంగా 500 లోక్ సభ స్థానాలకు పోటీ చేసింది. ఓటు షేరింగ్ 6.2 శాతానికి పెరిగింది. 2014లో 503 చోట్ల పోటీ చేసింది. ఒక్క చోటా గెలవలేదు.


బీఎస్పీ ఓటమికి కారణం... బీజేపీవైపు వెళ్లిపోయిన దళిత ఓటు బ్యాంకే. ముఖ్యంగా మాయాకి అండగా నిలిచిన యాదవులు (ఎస్సీలు 20 శాతం ఓటు బ్యాంకు) మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీని వీడిపోయారు. వీళ్లంతా 2014లో బీజేపీవైపు వెళ్లడంతో... ఆ పార్టీకి ఓట్లు 18 శాతం పెరిగాయి. ఇప్పుడు బీఎస్పీ... జాతీయ పార్టీ హోదా కోల్పోయేలా ఉంది. 1968 నాటి ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం... రెండు వరుస లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పెర్ఫార్మెన్స్‌ను లెక్కలోకి తీసుకొని... జాతీయ హోదాను కొనసాగించేదీ లేనిదీ నిర్ణయిస్తారు.

అసెంబ్లీలోనూ బీఎస్పీకి షాకే : 2007లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీఎస్పీకి 30.4 శాతం ఓట్ల శాతం ఉంది. 2012లో అది 25.9 శాతానికీ (80 సీట్లు), 2017లో అది 22.4 శాతానికి తగ్గిపోయింది. దళితులు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదల మద్దతుతో 2007లో బీఎస్పీ స్పష్టమైన మెజార్టీతో గెలిచింది. 2017లో ఆ ఫార్ములా వర్కవుట్ కాలేదు.

ఇతర రాష్ట్రాల్లోనూ అంతే : 2009లో మధ్య ప్రదేశ్‌లోని రేవా లోక్ సభ స్థానాన్ని బీఎస్పీ గెలుచుకుంది. అంతకు ముందు 1998లో హర్యానాలోని అంబాలా నియోజకవర్గాన్ని సొంతం చేసుకుంది. 1999లో 225 స్థానాలు, 2004లో 435 స్థానాలు, 2009లో 500 సీట్లు, 2014లో 503 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేసినా ఫలితాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. బీఎస్పీ స్థాపకుడు కాన్షీరాం... పంజాబ్ నుంచీ రావడంతో... 1989, 1991లో బీఎస్పీ గెలిచిన మూడు ఎంపీ స్థానాల్లో ఒకటి పంజాబ్ నుంచీ ఉండేది. 1996లో బీఎస్పీ గెలిచిన 11 లోక్ సభ స్థానాల్లో మూడు పంజాబ్‌లోవే. మరో రెండు సీట్లు మధ్యప్రదేశ్‌లో గెలిచినవి. మిగతావి ఉత్తరప్రదేశ్ ఖాతాలోవి.

2011 జనాభా లెక్కల ప్రకారం పంజాబ్‌లో దళితుల్ని కలిగిన ఎస్సీలు 32 శాతం ఉండగా... హర్యానాలో 20 శాతం, రాజస్థాన్లో 18 శాతం, హిమాచల్ ప్రదేశ్‌లో 25 శాతం, బీహార్‌లో 16 శాతం ఉన్నారు. అయినప్పటికీ ఈ రాష్ట్రాల్లో బీఎస్పీ ప్రభావం చూపలేకపోయింది. చాలా సందర్భాల్లో బీఎస్పీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోతున్నారు. 2008, 2015లో బీఎస్పీ... ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది. 2013లో 69 చోట్ల అభ్యర్థులను నిలిపింది. గతేడాది ఛత్తీస్ గఢ్‌లో 35 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. అలాగే 2013, 2008లో అక్కడి మొత్తం 90 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో దింపింది. 2014లో హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 87 చోట్ల క్యాండిడేట్లను ఉంచింది. 2009లో 86, 2004లో 84 చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టింది.

బెంగాల్, తమిళనాడు, ఒడిశా, గుజరాత్, కేరళ, మహారాష్ట్రలో బీఎస్పీ ఒక్క అసెంబ్లీ స్థానమూ గెలవలేకపోయింది. గత మూడు ఎన్నికల్లోనూ బీఎస్పీ ఈ రాష్ట్రాల్లో పోటీ చేసి ఓడిపోయింది. 2000 సంవత్సరం నుంచీ ఈ రాష్ట్రాలన్నింటిలో కలిపి బీఎస్పీ ఓటు శాతం రెండు శాతం కంటే తక్కువగానే ఉంది. ఒక్క మహారాష్ట్రలో మాత్రం దాదాపు 3శాతం ఉంది. దాదాపు 25 శాతం ఉంటేనే, సీట్లు గెలిచే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


ఎస్సీ రిజర్వుడు కేటగిరీల్లో దేశంలోనే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 80 లోక్ సభ స్థానాల్లో 17 సీట్లు ఎస్సీలకు రిజర్వుడ్ గా ఉన్నాయి. ఎస్సీలు తమ బాటే అనే మాయావతి... వాటిని గెలుచుకునే విషయంలోనూ వెనకబడ్డారు. 2004లో ఐదు ఎస్సీ స్థానాలు గెలిచారు. 2009లో ఒక్కటే సాధించారు. 2014లో బీజేపీ మాత్రం అన్ని రిజర్వుడు సీట్లనూ గెలుచుకుంది. ఇలా బీఎస్పీ గ్రాఫ్ నానాటికీ పడిపోతోంది. అందువల్ల 2019లో అద్భుతాలు సాధిస్తుందని చెప్పలేం.

 

Video: లారీ - ట్రక్కు ఢీ...రెప్పపాటులో నిలిచిన ప్రాణం
First published:

Tags: Bsp, Lok Sabha Election 2019, Mayawati, Narendra modi, Sp-bsp, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు