ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని బీఎస్పీ, బీజేడీ పార్టీలు స్వాగతించాయి. కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించాయి. ఇక ఏపీలో అధికార పార్టీ వైసీపీ సైతం కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించింది. కాశ్మీర్ సమస్యకు చక్కని పరిష్కారం సూచించారని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని అభినందించారు. అమిత్ షా, మోదీకి హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలు కురిపించారు విజయసాయిరెడ్డి.

అమిత్ షా, మోదీకి నా హ్యాట్సాఫ్. కాశ్మీర్ సమస్యకు ఇది మంచి పరిష్కారం. కేంద్ర నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ సమర్థించారు. ఆర్టికల్ 370ని రూపొందించి జవహర్లాల్ నెహ్రూ తప్పు చేశారు. ఆర్టికల్ 370 తాత్కాలికే అని చట్టం చెబుతున్నా దాన్ని రద్దు చేసే సాహసం కాంగ్రెస్ చేయలేదు. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉండడం సమంజసమేనా? జాతీయ జెండాను చింపేసినా కాశ్మీర్లో కేసుపెట్టలేని పరిస్థితి. కాశ్మీరీలను పెళ్లి చేసుకొని పాకిస్తానీలు భారతీయులుగా మారుతున్నారు. కాశ్మీరేతర భారతీయుడిని పెళ్లి చేసుకున్న మహిళలను అంటరానివారిగా చూస్తున్నారు. వాళ్ల హక్కులను ఆర్టికల్ 370 కాలరాస్తోంది. ఇది లింగ వివక్ష కాదా..?
— విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ
వన్ ఇండియా...వన్ నేషన్..వన్ యూనియన్ కల ఇవాల నెరవేరిందన్నారు విజయసాయిరెడ్డి. మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం భారత చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.
Published by:Shiva Kumar Addula
First published:August 05, 2019, 13:20 IST