ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి మధ్య సమావేశం దాదాపు రెండు గంటలు సాగింది. యోగి 2.0 క్యాబినెట్ రూపకల్పనపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగిందని సమాచారం. ఈనెల 21న యోగి ప్రమాణస్వీకారం ఉండొచ్చని తెలుస్తోంది..
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ వరుసగా రెండోసారి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారి ఢిల్లీకి వచ్చారు. ఆదివారం హస్తినలో పర్యటించిన యోగి.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తదితరులను కలిశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కూడా యోగి కలవనుండటం గమనార్హం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతోనూ యోగి భేటీ కానున్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) వేదికగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి మధ్య సమావేశం దాదాపు రెండు గంటలు సాగింది. యోగి 2.0 క్యాబినెట్ రూపకల్పనపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగిందని సమాచారం. క్యాబినెట్లోకి ఎవరెవరిని తీసుకోవాలన్న అంశంపై మోదీతో భేటీలో యోగి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ప్రధాని మోదీని యోగి ఆహ్వానించారు.
‘ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారిని కలిశాను. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందనలు తెలిపాను. గత ఐదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. రాబోయే ఐదేళ్లు కూడా రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను..’అంటూ యోగితో భేటీ ఫొటోను ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.
आज @myogiadityanath जी से भेंट हुई। उन्हें उत्तर प्रदेश चुनाव में मिली ऐतिहासिक जीत की बधाई दी। बीते 5 वर्षों में उन्होंने जन-आकांक्षाओं को पूरा करने के लिए अथक परिश्रम किया है। मुझे पूर्ण विश्वास है कि आने वाले वर्षो में वे राज्य को विकास की और अधिक ऊंचाइयों पर ले जाएंगे। pic.twitter.com/TeRcIRFreA
యోగి 2.0 క్యాబినెట్లో ఎన్డీఏ మిత్ర పక్షాలు అప్నాదళ్, నిషాద్ పార్టీలకు చోటు కల్పనపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ప్రధానితో భేటీకి ముందు పీఎంవోలో పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తోనూ యోగి సమావేశమయ్యారు. ఈ భేటీలో భేటీలో అసోం మాజీ సీఎం-కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఢిల్లీలోని యూపీ సదన్‌కు చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు.. సదన్ అధికారులు సాదర స్వాగతం పలికారు.
కాగా, ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ఈ నెల 21న చేయనున్నారని సమాచారం. హోలీ పండుగ తర్వాతే యూపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ కూడా ఇటువంటి సంకేతాలే ఇచ్చారు. ఆదివారం ఢిల్లీకి చేరుకుని ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులతో యోగి ఆదిత్యనాథ్ వరుసగా భేటీ అయ్యారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.