Luqma Initiative: మహిళా సాధికారతకు కృషి చేస్తున్న హైదరాబాద్‌ సఫా సొసైటీ.. లుక్మా ఫుడ్ ప్రోగ్రాంతో ముస్లిం మహిళలకు ఉపాధి

లుక్మా ప్రోగ్రాంతో ఉపాధి పొందుతున్న మహిళలు

తెలంగాణలోని మహిళలు సామాజిక, ఆర్థిక సాధికారత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సఫా సొసైటీలో లుక్మా ప్రోగ్రాం ఒక భాగం. కమర్షియల్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా వెనుకబడిన మహిళలకు అండగా నిలవడమే లుక్మా ముఖ్య ఉద్దేశం.

  • Share this:
Mirza Ghani Baig, న్యూస్ 18, హైదరాబాద్

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ‘ఆత్మ నిర్భర్‌ భారత్' అని చెబుతూ స్వయం సమృద్ధి లక్ష్యాన్ని సాధించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మాట ప్రకారం ఎంత మంది ప్రజలు తమ సొంత కాళ్లపై నిలబడ్డారో తెలీదు కానీ హైదరాబాద్ నగరవాసులు తమ అభిరుచినే వృత్తిగా మార్చుకొని స్వయం ఉపాధి కల్పించుకుంటున్నారు. నగరానికి చెందిన చాలామంది ముస్లిం మహిళలు వంట చేసే తమ అభిరుచిని వృత్తిగా మార్చుకుంటున్నారు. లుక్మా (LUQMA) అనే పోగ్రాం ద్వారా వీరు స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. తెలంగాణలోని మహిళలు సామాజిక, ఆర్థిక సాధికారత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సఫా సొసైటీలో లుక్మా ప్రోగ్రాం ఒక భాగం. కమర్షియల్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా వెనుకబడిన మహిళలకు అండగా నిలవడమే లుక్మా ముఖ్య ఉద్దేశం.

లుక్మా అనేది రుచికరమైన హైదరాబాదీ వంటకాలు ప్రిపేర్ చేసి గ్రేటర్ హైదరాబాద్‌లో డోర్ డెలివరీని అందించే ఒక వంట మనుషుల బృందం. కస్టమర్లు వెబ్‌సైట్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఫోన్ ద్వారా లుక్మా సేవలను పొందవచ్చు. ఫుడ్ డెలివరీ కోసం కనీసం 24-48 గంటల ముందే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం, 15 మంది మహిళలు లుక్మాతో కలిసి పని చేస్తున్నారు. అయితే వీరు తామే ఓనర్.. తామే ఉద్యోగి అనే కాన్సెప్ట్ తో పని చేస్తున్నారు. కస్టమర్లు చేసే ప్రతి ఆర్డర్‌పై ఈ సఫా సొసైటీ చెఫ్‌లకు కమీషన్ లభిస్తుంది. లుక్మాతో పనిచేస్తున్న ఈ 15 మంది మహిళల్లో ఒంటరివారు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారే ఉన్నారు.

లుక్మా పార్సిల్స్


హైదరాబాద్‌లోని వట్టెపల్లి ప్రాంతానికి చెందిన రజియా లుక్మా కార్యక్రమం ద్వారా లబ్ది పొందుతున్నారు. మూడేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే సఫా సొసైటీలో టైలరింగ్ సెంటర్ లో చేరారు కానీ ఆ వృత్తిలో ఆదాయం నామమాత్రంగానే ఉంది. దాంతో ఆమె కర్వాన్ కిచెన్‌లో చేరి ప్రొఫెషనల్ చెఫ్‌గా శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం లుక్మా సహకారంతో.. నెలకు రూ.8,000 సంపాదిస్తున్నానని చెబుతూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

టాలెంటెడ్ చెఫ్‌లలో ఒకరైన ఆషీయా సుల్తానా మాట్లాడుతూ తాను.. చికెన్ బిర్యానీ, లుక్మా చికెన్, చికెన్ కట్లెట్స్, పూరన్ పూరీ వంటి హైదరాబాదీ వంటకాలను తయారు చేయడం నేర్చుకున్నానని చెప్పారు. లుక్మా సాయంతో తాను నెలకు రూ. 5,000 సంపాదిస్తున్నానన్నారు. కస్టమర్ల ఆర్డర్స్ బట్టి నెలకు రూ.12 వేల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు.

లుక్మా తయారీతో ఉపాధి పొందుతున్న మహిళలు


తాజాగా న్యూస్ 18తో మాట్లాడిన సఫా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఫరీసా ఖాన్.. లుక్మా కార్యక్రమం హైదరాబాద్ ఒంటరి మహిళలను స్వశక్తిపై నిలబడేలా ప్రోత్సహిస్తుందని చెప్పారు. ప్రస్తుతం, లుక్మా రోజుకు 1000 ఆర్డర్‌లను డెలివరీ చేయగలదని ఆమె చెప్పారు. లుక్మాకి ఎక్కువ ఆర్డర్లు వస్తే, సొసైటీ చెఫ్‌ల సంఖ్యను పెంచుతుందని ఫరీసా విశ్వాసం వ్యక్తం చేశారు. లుక్మా రోగులకు హెల్తీ హోమ్ ఫుడ్ అందిస్తుందన్నారు.

కరోనా సమయంలో ఐసోలేషన్ కేంద్రాలకు లుక్మా ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేసిందన్నారు. లుక్మా కిచెన్ ఖట్టి దాల్, బగార్-ఇ-బైగాన్, దమ్-కా-ఖీమా, దాల్-చా, ఆచారి చికెన్, తలవా గోష్ట్, కుబూలి, దస్తీ రోటీ, మిర్చి-కా-సలాన్, షమీ కబాబ్, చికెన్ కట్లెట్స్ వంటి హైదరాబాద్ సంప్రదాయ వంటకాలను తయారు చేస్తుంది. గిలే-ఇ-ఫిర్దౌస్, కుబానీ కా మీఠా, డబుల్ కా మీఠా కూడా లుక్మా ద్వారా ఆర్డర్ చేయొచ్చన్నారు.

లుక్మా తయారీలో పాల్గొంటున్న మహిళలు


సఫా సొసైటీ ప్రెసిడెంట్ రుబినా నఫీస్ ఫాతిమా మాట్లాడుతూ.. లుక్మా కిచెన్ ద్వారా సాధారణ మహిళలను ఆహార రంగ వ్యాపారస్తులుగా మార్చడమే సొసైటీ ముఖ్య ఉద్దేశమన్నారు. స్వశక్తిపై ఎదిగేలా మహిళలకు లుక్మా కార్యక్రమం సహాయం చేస్తుందని వెల్లడించారు.

సఫా సొసైటీలో సోషల్ ఎంటర్‌ప్రైజెస్ మేనేజర్ అయిన సయ్యద్ యూనస్ మాట్లాడుతూ.. లుక్మాకి పాత నగరంతో పోలిస్తే హైదరాబాద్ న్యూ సిటీ నుంచే ఎక్కువ ఆర్డర్‌లు వస్తున్నాయని తెలిపారు. ఫుడ్ డెలివరీ కోసం, లుక్మా కిచెన్ Mowo (మూవింగ్ ఉమెన్) అనే ఓ సోషల్ ఇనిషియేటివ్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తుందన్నారు. 1000 మందికి పంపిణీ చేయగల లుక్మా ఫంక్షన్‌ల ఆర్డర్ల మేరకు ఫుడ్ తయారు చేయగలదన్నారు.

Benefits Of Ghee: నెయ్యి వల్ల ఎన్నో ప్రయోజనాలు.. ఈ రకమైన అనారోగ్యాలకు చెక్ పెట్టండి

TSRTC: తెలంగాణ ఆర్టీసీకి సీఎం కేసీఆర్ బిగ్ షాక్... నాలుగు నెలలే గడువు

* లుక్మా స్టూడియో:
సఫా సొసైటీ మహిళల కోసం ప్రత్యేకంగా లుక్మా స్టూడియో తీసుకువచ్చింది. కిచెన్ ప్రక్కనే ఉండే ఈ స్టూడియోలో 25 మందికి సరిపడా వసతులున్నాయి. మహిళలను ప్రోత్సహించేలా ఈ స్టూడియో గోడలను వివిధ చిత్రాలతో అలంకరించారు. మహిళలు ఈ స్టూడియోకి విచ్చేసి ఫుడ్ బిజినెస్ గురించి డిస్కస్ చేయొచ్చు. సఫా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఫరీసా ఖాన్ న్యూస్ 18తో మాట్లాడుతూ గ్రూప్ డిస్కషన్ లేదా మీటింగ్ కోరుకునే మహిళలకు లుక్మా స్టూడియో ఇంటి వాతావరణాన్ని అందిస్తుందన్నారు.
Published by:Kishore Akkaladevi
First published: