మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఓ యువతి దేవుడి పట్ల అతి విశ్వాసంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది. గుడిలోకి వెళ్లి ఏకంగా నాలుక (Woman cuts her tongue in Temple) కోసుకుంది. ఆ నాలుకను దేవత విగ్రహం ముందు ఉంచింది.
మన భారతదేశంలో ఆస్తికులు ఎక్కువే. దేవుడు ఉన్నారని వీరు నమ్ముతారు. భగవంతుడిని ప్రతిరోజూ పూజిస్తారు. కానీ ఇందులో కొంత మంది విశ్వాసం మాత్రం హద్దులు దాటుతుంది. ప్రతిదానిని గుడ్డిగా నమ్మేస్తుంటారు. అంధభక్తితో వింతగా ప్రవర్తిస్తుంటారు. దేవుడి కోసం ఏం చేసేందుకైనా వెనకాడరు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఓ యువతి కూడా దేవుడి పట్ల అతి విశ్వాసంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది. గుడిలోకి వెళ్లి ఏకంగా నాలుక (Woman cuts her tongue in Temple) కోసుకుంది. ఆ నాలుకను దేవత విగ్రహం ముందు ఉంచింది. ఊహించని ఈ పరిణామంతో ఆలయ పూజారితో పాటు ఇతర భక్తులు, ఆమె కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..సీధీ జిల్లా బారాగోన్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల రాజ్‌కుమారికి దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి ఇంట్లో దేవుడి పటాల ముందు పూజలు చేస్తుంది. అప్పుడప్పుడూ గుడికి వెళ్లి ప్రార్థనలు చేసేది. శుక్రవారం ఉదయం కూడా ఆమె తన తల్లిదండ్రులతో కలిసి.. బరాగావ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయానికి వెళ్లింది. అక్కడ హనుమంతుడిని దర్శించుకొని.. పక్కనే ఉన్న సంతోషి మాత ఆలయానికి కూడా వెళ్లారు. అమ్మవారి ముందు నిల్చుని ప్రార్థనలు చేసిన రాజ్ కుమారి.. ఒక్కసారిగా బ్లేడ్‌తో తన నాలుకని కోసుకుంది. ఆ నాలుకను అమ్మ వారి పాదాల ముందుకు విసిరేసింది. ఆమె తీరును చూసి అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. రాజ్‌కుమారికి తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం స్పృహ తప్పిపడిపోయింది. స్థానికులంతా తరలివచ్చి.. గుడిలో గుమిగూడారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధంకాలేదు. ఆస్పత్రికి వెళ్దామని తల్లిదండ్రులు చెబుతున్నా.. అక్కడున్న వారు వినలేదు. పూజలను అలాగే కొనసాగించారు.
మరోవైపు కూతురి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..వారు డాక్టర్లతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి చెందిన డాక్టర్లు ఆమెను పరీక్షించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. ప్రథమ చికిత్స తర్వాత ఆ యువతి కోలుకుంది. అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాలుక మొత్తం తెగిపడడంతో ఆమెకు తిరిగి మాటల వచ్చే అవకాశాలు లేవని వైద్యులు వెల్లడించారు. ఐతే అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకే ఆమె ఇలా చేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దేవుడంటే విశ్వాసం ఉండడంలో తప్పులేదని.. కానీ అంధ భక్తి ఉండకూడదని వైద్యులు, పోలీసులు చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.