అది నక్సలైట్ల కంచుకోట. నిత్యం తుపాకుల మోతతో దద్దరిల్లే ప్రాంతం. అటు వైపు వెళ్లాలంటేనే భయం. ఎప్పుడూ చూసిన వార్తాల్లో నిలిచే ప్రదేశం. అదే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నిత్యం నక్సలిజం రాజ్యమేలే దంతేవాడ. అందమైన కమలం బురదలో వికసిస్తుందన్నట్లు... అరాచకశక్తులు పుట్టి పెరిగిన ఈ నేలలోనే ఓ ఐపీఎస్ ఆఫీసర్ కూడా పుట్టుకొచ్చింది. 25ఏళ్ల ఆ విద్యా కుసుమం ఈ నేల నుంచే వికసించింది. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 12వ ర్యాంకు సాధించి దంతేవాడ జిల్లాను మరోసారి దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేసింది. ఆమె పేరు... నమ్రతా జైన్. దంతేవాడ జిల్లాలోని గీదం సొంతూరు. 2016 సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో 99వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమిలో ట్రైనింగ్ అవుతోంది. పదోతరగతి వరకు దంతేవాడలోనే చదువుకున్న నమత్రా ఆ తర్వాత పై చదువుల కోసం బిలాయి వెళ్లింది. అక్కడ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసింది. నమత్ర తండ్రి వ్యాపార వేత్త, తల్లి హౌస్ వైఫ్, సోదరుడు చార్టడ్ ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు.
అయితే నమ్రతాకు కలెక్టర్ కావాలన్నది జీవితలక్ష్యం. ఆమె 8వతరగతి చదవుతున్న సమయంలో ఒకసారి ఓ మహిళా అధికారి నమత్ర చదువుతున్న స్కూల్‌కు వెళ్లారు. అయితే వచ్చిన అధికారిణి కలెక్టర్ అని తెలియడంతో అప్పట్నుంచి నమ్రత కూడా కలెక్టర్ కావాలని కలలుకంది. ఆ స్ఫూర్తితోనే కష్టపడి చదివింది. అనుకున్నది సాధించింది. తన ప్రాంతంలో జరుగుతున్న నక్సల్స్ దాడులు చూసి... సివిల్ సర్వీస్‌లో చేరాలనుకుంది. తన ప్రాంతంలోని పేదవారికి ఏదో విధంగా సాయపడాలని భావించింది నమ్రత జైన్. దంతేవాడలో పెద్దగా విద్య సౌకర్యాలు ఏవీ లేవని చెబుతోన్న నమ్రత.. తన ప్రాంత అభివృద్ధికి ఐఏఎస్ ఆఫీసర్‌గా చేతనైన సాయం చేస్తానని చెబుతోంది.