హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

తిరంగా, అహింస, జనగణమన... ముస్లింల నిరసనల్లో ‘భారతీయత’

తిరంగా, అహింస, జనగణమన... ముస్లింల నిరసనల్లో ‘భారతీయత’

జామా మసీదు వద్ద తిరంగా, జన గణ మన, అహింసా విధానంలో ముస్లింల నిరసన (ImagePTI)

జామా మసీదు వద్ద తిరంగా, జన గణ మన, అహింసా విధానంలో ముస్లింల నిరసన (ImagePTI)

ఎన్ఆర్‌సీ, జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఆ నిరసనల్లో కూడా భారతీయత కనిపిస్తోంది.

  (రచయిత : రషీద్ కిద్వాయ్)

  ఎన్ఆర్‌సీ, జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఆ నిరసనల్లో కూడా భారతీయత కనిపిస్తోంది. జామా మసీద్ వద్ద నిర్వహించిన ధర్నాలో ముస్లింలు జాతీయ జెండా చేతబూని, అహింసా మార్గంలో జనగణమణ పాడుతూ నిరసన తెలిపారు. వారికి హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, జైన్‌లు, ఉద్యమకారులు, ఆర్టిస్ట్‌లు, మేధావులు, బాలీవుడ్ స్టార్స్ నుంచి మద్దతు లభిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ముస్లింలకు తామూ ప్రతినిధులం అన్నట్టుగా ప్రముఖంగా కనిపించిన రాజకీయ ముఖాలేవీ అక్కడ కనిపించడం లేదు. రాజకీయ ప్రమేయం ఉన్న వారు కూడా ఇక్కడ లేరు. ఈ ఉద్యమం ఎటువైపు దారితీస్తుందో కానీ, ముస్లింలు మాత్రం తమ మనస్సు, ప్రాణాలు పెట్టి పోరాటం చేస్తున్నారు.

  ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు, ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు, అయోధ్య రామ మందిరం - బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు లేని నిరసనలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ముస్లింలు గళమెత్తుతున్నారు. మేం భారతీయులమనే అనే భావన వారిలో కనిపిస్తోంది. అయితే, మిగిలిన అంశాలతో పోలిస్తే ఎన్ఆర్‌సీ, సీఏఏ పూర్తిగా భిన్నమైనవి.

  ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం వల్ల అందులో స్త్రీ, పురుషుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనే అంశం ప్రభావం చూపకపోవడానికి కారణం బహుశా కాశ్మీర్ అనేది దూరంగా ఉండడం వల్ల కావొచ్చు. అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు విషయంలో కూడా ముస్లింలు ‘మన తలరాత’ అనే భావనకు వచ్చారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్న వారికి కూడా పెద్దగా మద్దతు లభించలేదు. మేం ఈ గడ్డకు చెందిన వారమే అనే భావన భారతీయ ముస్లింల్లో ఉంది. అది తరతరాలుగా వస్తోన్న నమ్మకం. వివేకం ఉన్న ఏ పరిశీలకుడికి అయినా జామియా మిలియా ఇస్లామియా , అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మధ్య ఐక్యతను గుర్తించాల్సి ఉంది.

  జామియా మిలియా యూనివర్సిటీ అనేది మహాత్మాగాంధీ ప్రోద్బలంతో ప్రారంభమైంది. స్వాతంత్ర్యం కంటే ముందు పాకిస్తాన్ అనుకూల వర్గం ఉన్న ఏఎంయూకి బదులిచ్చేందుకు జాతీయవాదంతో జామియా మిలియా యూనివర్సిటీని నెలకొల్పారు. అప్పట్లో జర్మనీలో పనిచేస్తున్న జకీర్ హుస్సేన్, డాక్టర్ అబిద్ హుస్సేన్, మొహమ్మద్ ముజీబ్ జామియా యూనివర్సిటీలో పనిచేసేందుకు భారత్‌కు తిరిగొచ్చారు. వారి అద్భుతమైన కెరీర్‌ను వదులుకోవడమే కాదు. ఆ ముగ్గురు సుమారు 20 సంవత్సరాలు పాటు (1926 నుంచి 1948 వరకు) జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కోసం పాటుపడ్డారు. కనీసం వారు జీతాలు కూడా లేకుండా పనిచేశారు. తమ సొంత డబ్బు ఖర్చు పెట్టారు. సైద్ధాంతిక అంశాల మీద పోరాటం చేసి ఆధునిక విద్యను తీసుకొచ్చేందుకు కృషి చేశారు. అంత గొప్ప జకీర్ హుస్సేన్ మనవడైన సల్మాన్ ఖుర్షీద్ కనీసం సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ఆందోళనల మీద కనీసం స్పందించకపోవడం శోచనీయం. ప్రజల మనసు నుంచి చెరిగిపోయిన అంశాలను బహిర్గతం చేసేందుకు కనీసం ఓ ఆర్టికల్ కూడా రాయకపోవడం దారుణం.

  స్వాతంత్ర్యానికి ముందు దేశాన్ని రెండుగా విడగొట్టడం, పాకిస్తాన్ ఏర్పాటు చేయడాన్ని మెజారిటీ ముస్లింలు వ్యతిరేకించారు. దేశంలో వెనుకబడి ముస్లింలకు ప్రతినిధిగా ఉండే ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ 1943లో ఓ తీర్మానం చేసింది. ‘భారతీయ ముస్లింలలోని జాతీయవాదం, దేశభక్తి తమ జన్మభూమిని శత్రు రాష్ట్రాలు (దేశాలు) గా చేయడానికి అంగీకరించవు’ అని తీర్మానించింది.

  దేశభక్తిగల ముస్లింలు, సంఖ్యాబలం ఉన్నప్పటికీ, ఐక్య భారతదేశంలో విఫలమయ్యారు. బ్రిటిష్ వారి నుంచి నిరంతర కుతంత్రాలు, కాంగ్రెస్‌లోని ఓ వర్గం, ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ వంటి మితవాద హిందూ రాడికల్ శక్తులను నిలువరించేందుకు వారు ఓ సమూహాన్ని నిర్వహించలేకపోయారు. దానికి ముస్లిం లీగ్ కారణం. ముస్లిం లీగ్ 1931లో సుమారు 3 లక్షల మందితో ‘ముస్లిం నేషనల్ గార్డ్స్’ అనే పాక్షిక-మిలటరీని సృష్టించింది. ఈ "వాలంటీర్లు" మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లెవ్, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదాని, మౌలానా హిఫ్జూర్ రెహ్మాన్‌తో పాటు అనేక మందిపై శారీరకంగా దాడి చేశారు.

  దేశ విభజనపై ముస్లింల ఏకైక ప్రతినిధిగా ఉన్న ముస్లిం లీగ్‌తో చర్చించినప్పుడు కాంగ్రెస్ కూడా కొన్ని తప్పులు చేసింది. ముస్లిం లీగ్ నాయకుడితో మాట్లాడిన సందర్భంలో జిన్నాను ‘ఖైద్ ఈ అజామ్’ అని సంబోధించడం ద్వారా మహాత్మా గాంధీ కూడా మూర్ఖంగా ప్రవర్తించారు.

  ఈ నేపథ్యంలో ముస్లింలు తమ గురించి తామే మాట్లాడానికి ఎందుకు ముందుకొస్తున్నారో అర్థం చేసుకోవాలి. దేశ విభజన సమయంలో జరిగిన తప్పులు మరోసారి జరగకూడదని, తమ గొంతుక కూడా వినిపించాలని భావిస్తున్నారు. తద్వారా ఈ దేశంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మూస ధోరణిని పాతిపెట్టి, రాజ్యంగం అందించిన ప్రజాస్వామ్యాన్ని, సమానత్వాన్ని, పరస్పర నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని అందించేవారు ఎవరైనా ఉన్నారా?

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Citizenship Amendment Act, Muslim Minorities, NRC

  ఉత్తమ కథలు