WILL UTTAR PRADESH CHIEF MINISTER YOGI ADITYANATH CONTEST FROM AYODHYA IN THE UPCOMING ELECTIONS AK
Uttar Pradesh: యూపీ సీఎం యోగి ఆ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా ? బీజేపీ లెక్కేంటి ?
యోగి ఆదిత్యనాథ్ (ఫైల్ ఫోటో)
Uttar Pradesh: ఆదిత్యనాథ్‌ను కీలకమైన ఈ స్థానం నుంచి బరిలోకి దింపడం వల్ల పొరుగున ఉన్న పూర్వాంచల్‌లోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది.
త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ నాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. సర్వేల ఆధారంగా కచ్చితంగా గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని.. గెలవడం కష్టమని భావిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్కనపెట్టాలనే యోచనలో బీజేపీ నాయకత్వం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయబోతున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న యోగి.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఆయన ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య నుంచి పోటీకి దింపాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ సీనియర్ నేతలు సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే దీనిపై బీజేపీ నాయకత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. పార్టీ అగ్రనేతలకు ఏ నియోజకవర్గం సముచితమనిపిస్తే ఆ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆయన ఇటీవల వెల్లడించారు.ఫిబ్రవరి 10. ఫిబ్రవరి 14 తేదీలలో మొదటి, రెండో దశలలో ఓటింగ్ జరిగే స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది.
ప్రస్తుత సీఎం యోగి పోటీకి ఎక్కువగా అవకాశం ఉన్న నియోజకవర్గాలు అయోధ్య, మధురతో పాటు ఆయన సంప్రదాయ నియోజకవర్గమైన గోరఖ్‌పూర్ ఉంది. గోరఖ్‌పూర్ నుంచి యోగి అనేక సందర్భాల్లో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే యోగి అయోధ్య నుంచి పోటీ చేయడం వల్ల తమకు అనేక ప్రయోజనాలు ఉంటాయని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ప్రస్తుతం కొనసాగుతున్న రామ మందిర నిర్మాణం బీజేపీ రాజకీయ ప్రతిష్టను పెంచేందుకు దోహదపడింది. అయోధ్య సమాజ్ వాదీ పార్టీకి పట్టున్న అవధ్ ప్రాంతంలో వస్తుంది.
ఆదిత్యనాథ్‌ను సీటు నుంచి బరిలోకి దింపడం వల్ల పొరుగున ఉన్న పూర్వాంచల్‌లోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర యూనిట్ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్‌తో సహా రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు టికెట్ల ఖరారు అంశంపై గత రెండు రోజులుగా దేశ రాజధానిలో కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.ఇక ప్రస్తుతం అయోధ్య నుంచి బిజెపికి చెందిన వేద్ ప్రకాష్ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.