జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంచలన నిర్ణయం..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ (ఫైల్)

జమ్మూ కాశ్మీర్ అతి ముఖ్యమైన సమస్య అని, దీనిపై జమ్మూ కాశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి నివేదిక తెప్పించుకుంటామని తెలిపారు. అవసరమైతే తానే స్వయంగా వ్యక్తిగతంగా ఆ రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితులను తెలుసుకుంటానని తెలిపారు.

  • Share this:
జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ చాలా మంది సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ అతి ముఖ్యమైన సమస్య అని, దీనిపై జమ్మూ కాశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి నివేదిక తెప్పించుకుంటామని తెలిపారు. అవసరమైతే తానే స్వయంగా వ్యక్తిగతంగా ఆ రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితులను తెలుసుకుంటానని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో పిల్లలను బలవంతంగా నిర్బందించారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదించారు. ఈ సందర్భంగా గొగోయ్ వ్యాఖ్యానిస్తూ.. ఒక వేళ పిటిషన్‌లో పేర్కొన్న విషయాలు తప్పని తేలితే పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి దేశవ్యాప్తంగా కోర్టుల్లో పలు పిటిషన్లు నమోదు కావడంతో, వాటన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేశారు. వాటన్నింటిని కలిపే న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. అందులో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వేసిన వ్యక్తిగత పిటిషన్ కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని తన కుటుంబ సభ్యుల్ని చూసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు. ఇటీవల ఆయన కాశ్మీర్ వెళ్లేందుకు ప్రయత్నించగా... రెండుసార్లు ఆయన్ను ఎయిర్‌పోర్ట్ నుంచే ఢిల్లీకి పంపేశారు. దాంతో ఆజాద్ కోర్టులో పిటిషన్ వేశారు.
Published by:Shravan Kumar Bommakanti
First published: