Onion price: ఉల్లి ధరలు మళ్లీ కొండెక్కుతాయా? భారీ వర్షాలతో పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉల్లి ధరలు

ప్రతీకాత్మక చిత్రం

గత వారం వరకు స్తబ్దుగానే ఉన్న ఉల్లి ధరలు కొద్దికొద్దిగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి (kg onions) రూ. 20 నుంచి ఉల్లి రకాలను బట్టి రూ.50 వరకు చేరింది. అయితే కొద్దిరోజుల్లో ఉల్లి ధరలు పెరిగే అవకాశమూ లేకపోలేదు

  • Share this:
    రాష్ట్రంలో ఉల్లి ధరలు (Onion prices) సామాన్యుడికి కంటతడి పెట్టించే సూచనలు కనిపిస్తున్నాయి. గత వారం వరకు స్తబ్దుగానే ఉన్న ఉల్లి ధరలు కొద్దికొద్దిగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి (kg onions) రూ. 20 నుంచి ఉల్లి రకాలను బట్టి రూ.50 వరకు చేరింది. అయితే కొద్దిరోజుల్లో ఉల్లి ధరలు పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే మహారాష్ట్ర (Maharashtra), తదితర ప్రాంతాల నుంచి ఉల్లి దిగుమతులు (imports) రాష్ట్రానికి వస్తాయి. అయితే అక్కడ వర్షాలు (Rains) ఎక్కువ పడుతుండటంతో మార్కెట్లలోకి సరుకు రావట్లేదు. మహారాష్ట్రలో ఉల్లి పంట ( వర్షాలకు దెబ్బతింది. దీంతో మార్కెట్లలో డిమాండ్​ పెరిగింది. గత వారం వరకు రూ. 20–25 లకే కేజీ ఉల్లిని విక్రయించిన వ్యాపారులు ఇప్పుడు ఏకంగా రూ. 40–45 కు విక్రయిస్తున్నారు. ఇంకొందరు వ్యాపారులు ఉల్లి నాణ్యతను బట్టి మరింత ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవలి వర్షాలకు దిగుబడి తగ్గడంతో పాటు మహారాష్ట్రలో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌లో ఉల్లి కొరత ఏర్పడటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

    కరోనా లాక్‌డౌన్‌ సమయం (lock down time)లో ఉల్లి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో కేజీ ఉల్లి ధర రూ. 100 వరకు చేరిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా ధరలు దిగి రావడంతో సామాన్య జనం ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో మహారాష్ట్రలోనూ ధరలు (rates) విపరీతంగా పెరిగాయి.  ఆ తర్వాత సుమారు 6 నెలల పాటు ఉల్లి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ధరలు పెరగవని సామాన్యులు ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు ధరలు పెరుగుతుండటంతో వారి ఆశలన్ని అడియాశలు అవుతున్నాయి.

    విదేశాల్లోనూ డిమాండ్​..

    మహారాష్ట్రలోని రైతులు నిల్వ చేసిన పాత ఉల్లికి విదేశాల్లో (foreign countries) మంచి డిమాండ్‌ ఉంటుంది. దీంతో కొందరు రైతులు నేరుగా విదేశాలకు ఎగుమతి చేసే (exports) ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉన్న పంటలు నాశనమయ్యాయి. అదే సమయంలో నాటు వేసిన ఉల్లి చేతికి రావాలంటే మరి కొద్ది నెలల సమయం పడుతుంది. దీంతో అప్పటి వరకు ఉల్లి కొరత తప్పదని, ధరలు పెరుగుతూనే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గే అవకాశాలున్నాయి. ఒకవేళ వర్షాలు తగ్గక... ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి ధరలు కొండెక్కే ఆస్కారం ఉంది. అయితే మహారాష్ట్రలో ఉల్లి ధరలు ఎక్కువవడంతో.. డిమాండ్​ తగ్గాలని సరకు ఎక్కువ వచ్చేలా అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

    నవంబర్​లోనే చేతికి రావాలి..

    వర్షాకాలం ముగుస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో కూడా అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చిన ఉల్లి పంటలు నాశనమయ్యాయి. సాధారణంగా నవంబర్‌ మొదటి వారంలో కొత్త ఉల్లి మార్కెట్‌లోకి రావడం మొదలవుతుంది. వర్షాల కారణంగా ఉల్లి పంటలకు అపార నష్టం వాటిల్లడంతో ఈసారి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published: