హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amit Shah: ‘కశ్మీర్‌ ప్రజల మాట వింటాం.. వారితోనే మాట్లాడుతాం.. పాకిస్థాన్‌తో కాదు’

Amit Shah: ‘కశ్మీర్‌ ప్రజల మాట వింటాం.. వారితోనే మాట్లాడుతాం.. పాకిస్థాన్‌తో కాదు’

అమిత్ షా (ఫైల్)

అమిత్ షా (ఫైల్)

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జమ్మూ కశ్మీర్ పర్యటన ముగిసింది. బుధవారం బారాముల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) జమ్మూ కశ్మీర్ పర్యటన (Jammu - Kashmir Tour) ముగిసింది. బుధవారం బారాముల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధికి 70 ఏళ్లుగా ఏం చేశారని అడిగారు. యువత చేత్తుల్లో రాళ్లు, తుపాకీలు పెట్టారని మండిపడ్డారు. అబ్దుల్లా, ముఫ్తీలు, గాంధీలు 70 సంవత్సరాలకు పైగా జమ్మూ కశ్మీర్‌ను పాలించారని.. కేవలం రూ.15,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కేవలం మూడు సంవత్సరాలలోనే ఈ ప్రాంతానికి రూ.56,000 కోట్ల పెట్టుబడి వచ్చేలా మోదీ కృషి చేశారని వివరించారు. IIT, AIIMS, NIT, NIFT, అదనపు వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలను తీసుకొచ్చామని చెప్పారు. అక్టోబర్ 5న బారాముల్లాలో జరిగిన సభలో గుప్కార్ కూటమిని ఉద్దేశించి.. ‘మేం కశ్మీర్‌ లోయలోని ప్రజలు చెప్పిందే వింటాం, వారితోనే మాట్లాడుతాం.. పాకిస్థాన్‌తో కాదు’ అన్నారు.

* మోదీ ఉగ్రవాదాన్ని అంగీకరించరు

ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానికులను ఉద్దేశించి షా మాట్లాడుతూ.. ‘నేను పాకిస్థాన్‌తో మాట్లాడాలని వారు కోరుకుంటున్నారు. పాకిస్థాన్‌ మాట వినాలని వారు కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని అంగీకరించరు. ఉగ్రవాదం నుంచి దాదాపుగా జమ్మూ & కశ్మీర్‌కు ప్రధాని విముక్తి కల్పించారు.’ అని చెప్పారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో ప్రాంతీయ నేతలు గమనించాలని అమిత్‌ షా సూచించారు. కరెంటు, నీళ్లు అందుబాటులో లేవని, ఆసుపత్రులు కూడా లేవని చెప్పారు. కశ్మీర్‌లో మాత్రం ప్రతి గ్రామానికీ విద్యుత్తు సదుపాయం ఉందని తెలిపారు. తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న కశ్మీర్‌.. ఇప్పుడు పర్యాటకానికి హాట్‌స్పాట్‌గా మారిందని, సంవత్సరానికి కేవలం ఆరు లక్షల మంది పర్యాటకులు వచ్చేవారని, ఇప్పుడు అక్టోబర్ వరకే 22 లక్షల మంది పర్యాటకులు వచ్చారని షా వివరించారు.

* ఆజాన్‌ వినిపిస్తుండగా ప్రసంగం ఆపిన షా

షా ప్రసంగిస్తున్న సమయంలో స్థానిక మసీదు స్పీకర్‌ నుంచి అజాన్‌ వినిపించడంతో ఆయన గౌరవ సూచకంగా ప్రసంగాన్ని నిలపేశారు. ఆజాన్‌ పూర్తయిన తర్వాత మాట్లాడుతూ.. కశ్మీర్‌ ప్రజలు ప్రధాన స్రవంతిలో చేరాలని కోరారు. జమ్మూ & కశ్మీర్‌లో సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నామని, ప్రజలు అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

* తండ్రి భుజాలపై అతి పెద్ద భారం కొడుకు శవపేటిక

ఎవరైనా హత్యకు గురైతే తన హృదయానికి బాధ కలుగుతుందని అన్నారు. తండ్రి భుజాలపై ఉండే అతి పెద్ద భారం అతని కొడుకు శవపేటిక అని, కశ్మీర్‌లో దాదాపు 42,000 మంది సాధారణ ప్రజలు తీవ్రవాదం కారణంగా చనిపోయారని తెలిపారు. అందులో ఎవరూ రాజకీయ నాయకుడి కొడుకు కాదని, 42,000 మరణాలకు ఎవరు బాధ్యులు? అని షా ప్రశ్నించారు.

* రిజ్వరేషన్‌లో కోత ఉండదు

ఓటర్ల జాబితాల ఖరారు ప్రక్రియను అనుసరించి జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతాయని షా చెప్పారు. J&K డీలిమిటేషన్ కమిషన్ నిజమైన ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చేలా చేసిందన్నారు. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత, ఎస్టీలు, షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని షా చెప్పారు. గుజ్జర్ల రిజర్వేషన్‌ను కట్ చేస్తానని ప్రజలను ఫరూక్ అబ్దుల్లా రెచ్చగొడుతున్నారని, గుజ్జర్లు, బకర్వాల్లు, పహారీలు అందరికీ విద్య , ఉద్యోగాలు, ఎన్నికలలో రిజర్వేషన్లు లభిస్తాయని, గుజ్జర్ల రిజర్వేషన్‌లో కోత ఉండదని హామీ ఇచ్చారు.

* ప్రజల నవ్వుల్లో అభివృద్ధి కనిపిస్తోంది

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ప్రధాని మోదీ కృషి J&K ప్రజల నవ్వుతున్న ముఖాల్లో కనిపిస్తోందని షా అన్నారు. 1947లో మక్బూల్ షెర్వానీ పాత్రను కూడా గుర్తుచేసుకున్నారు. అతను 1947లో మాతృభూమిని కాపాడటానికి పాకిస్థాన్‌తో పోరాడి ప్రాణాలను అర్పించాడని చెప్పారు. లేకుంటే బారాముల్లా కూడా వెనుకబడిన POKలో భాగమై ఉండేదన్నారు.

* ప్రజాస్వామ్యంలో 30 వేల మందికి చోటు

మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్వీట్‌ను షా ప్రస్తావిస్తూ.. ‘ముఫ్తీ, అబ్దుల్లా.. ప్రజలను కళ్లు తెరవనివ్వండి, 75 ఏళ్లలో మీరు J&Kకి ఏమి ఇచ్చారు? ప్రజాస్వామ్యం 87 మంది శాసనసభ్యులు, ఆరుగురు పార్లమెంటు సభ్యులకు పరిమితం అయింది’ అన్నారు. పంచాయతీ నుంచి తహసీల్ వరకు ఎన్నికల ప్రక్రియను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడం ద్వారా 30,000 మందిని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కల్పించామని తెలిపారు.

* గుప్కార్ గ్యాంగ్‌పై విమర్శలు

కశ్మీర్‌లో శాంతి, అభివృద్ధి, సామరస్యమే మోదీ నమూనా అని కేంద్ర మంత్రి చెప్పారు. గుప్కార్ మోడల్ పుల్వామా దాడిని అందించిందని, మోదీ మోడల్ పుల్వామాలో రూ.2,000 కోట్ల విలువైన ఆస్పత్రిని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. గుప్కర్ మోడల్ చేతుల్లో రాళ్లు, మూసి ఉన్న కాలేజీలు, యువత చేతుల్లో మెషిన్ గన్‌ల కోసం రూపొందించారని, మోదీ నమూనా పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తోందని అన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Amit Shah, Jammu and Kashmir, National News, Pakistan

ఉత్తమ కథలు