తమిళనాడులో డీఎంకే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు... ఎన్నికలు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. డీఎంకే మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన... అన్నాడీఎంకేకి ఓటు వేస్తే అది నరేంద్ర మోదీకి వేసినట్లే అవుతుందన్నారు. జల్లికట్టును నిషేధించి మోదీ... తమిళ ప్రజల సంస్కృతిని అవమానపరిచారని అన్నారు. కరుణానిధి వారసుడు స్టాలిన్‌ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అన్న చంద్రబాబు... ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యాంగ వ్యవస్థల్నీ పరిరక్షించాలని కోరారు. ప్రజాస్వామ్యం కోసం ఎన్నో రోజులుగా పోరాడుతున్నానన్న ఆయన... వీవీప్యాట్ స్లిప్పులలో 50 శాతం లెక్కించాల్సిందేనని మరోసారి పట్టుపట్టారు. ఈ విషయంపై ఇంకోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు.
ఈవీఎంలలో సాఫ్ట్‌వేర్ కోడ్‌ను మార్చే అవకాశం ఉందన్న ఆయన... చాలా దేశాల్లో బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయన్న చంద్రబాబు... వాటిని రిపేర్ చేసేందుకు అందుబాటులో నిపుణులు లేరని మండిపడ్డారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల కోసం రూ.9 కోట్లు ఖర్చుపెట్టారన్న చంద్రబాబు... ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రజలు ఎవరికి ఓటు వేసిందీ, ఆ ఓటు కచ్చితంగా అదే గుర్తుకి పడిందో లేదో స్పష్టత లేదన్న ఆయన... స్పష్టత వచ్చేందుకు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోరుతున్నట్లు తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పులు 7 సెకండ్ల పాటూ కనపడాల్సి వస్తే... కొన్నిచోట్ల 3 సెకండ్లే కనిపిస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు చంద్రబాబు.
ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం పోతోందన్న చంద్రబాబు... 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి ఆరు రోజులు పడుతుందని ఈసీ చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. అన్ని రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. బ్యాలెట్ విధానంలో ఫలితాలు రెండు రోజుల్లో తెలుస్తున్నప్పుడు... వీపీప్యాట్ స్లిప్పుల విషయంలోనూ అలా ఎందుకు జరగదని ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.