పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూ, వాహనదారుల గుండెల్లో గునపాలు దించుతున్నాయి. బండిలో పెట్రోల్ కొట్టించుకునేందుకు వెళ్తే, పర్సు మొత్తం ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి. దేశంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో అయితే పెట్రోలు ధర వంద రూపాయలకు చేరింది. దీంతో సగటు జీవి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాడు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన సమయాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కడం వాహనదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ లో పెట్రో, డీజిల్ ధరలపై కాస్త తీపికబురు ఉంటుందేమోనని సగటు వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంపాదించిన మొత్తంలో అధిక శాతం పెట్రోలు, డీజిల్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన నిర్మలా సీతారామన్ కూడా, ఈ మేరకు ఓ తీపికబురును అందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ రేట్ 89.77 రూపాయలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోలు ధర 92.18 రూపాయలుగా ఉంది. చెన్నైలో 88.82 రూపాయలు, బెంగళూరు నగరంలో 89.21 రూపాయలుగా ఉంటే, దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 86.30 రూపాయలుగా ఉంది. దీంతో రోజురోజుకు కొండెక్కుతున్న పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కాస్తయినా ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నారు.
ఇదిలా ఉండగా, సోమవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై అన్ని రంగాల్లోనూ అంచనాలు తారస్థాయిని చేరుకున్నాయి. మధ్యతరగతి వర్గం, సామాన్య ప్రజలు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, వైద్య రంగం.. ఇలా ఒకటేమిటి అన్ని రంగాలు కూడా తమ వాటాగా బడ్జెట్ లో ఏం లభించబోతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అదే సమయంలో దేశంలోని ప్రధాన రాష్ట్రాలు కూడా బడ్జెట్ కేటాయింపుల్లో తమకు లభించబోయే కేటాయింపుల గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత రీతిలో ఈ బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి నిర్మలా సీతారామన్ ఏఏ వర్గాలపై వరాల జల్లు కురిపిస్తారో తెలియాలంటే పార్లమెంట్ సెషల్ ప్రారంభమయ్యే దాకా ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2021, Indian parliament, Nirmala sitharaman, Union Budget 2021