Karnataka: కౌన్ బనేగా కర్ణాటక సీఎం ? బీజేపీ కొత్త ప్రయోగం చేయనుందా ?

కర్ణాటక అసెంబ్లీ

Karnataka New CM: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కోసం బీజేపీ నాయకత్వం 8 మంది నేతల పేర్లను పరిశీలిస్తోందని తెలుస్తోంది.

  • Share this:
    కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 2023లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టి పెట్టుకుని బీజేపీ హైకమాండ్ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారనే చర్చ జరుగుతోంది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కోసం బీజేపీ నాయకత్వం 8 మంది నేతల పేర్లను పరిశీలిస్తోందని తెలుస్తోంది. యడియూరప్ప కర్ణాటకలోని బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో.. అదే వర్గానికి చెందిన ధర్వాడ్ పశ్చిమ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్, విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ యత్నల్, కర్ణాటక మంత్రులు మురుగేశ్ నిరానీ, బసవరాజు బొమ్మాయ్ పేర్లను పరిశీలిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    వీరిలో యత్నల్‌కు ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం కలిసొచ్చే అంశమని భావిస్తున్నారు. మరోవైపు సీఎంగా ఎవరు ఉండాలని యడియూరప్పను అడిగితే ఆయన బసవరాజ్ బొమ్మాయ్ పేరును చెబుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ప్రహ్లాద్ జోషి, బీఎల్ సంతోష్, సీఎన్ అశ్వనాథ్ నారాయణ్, లక్ష్మణ్ సవడి, గోవింద్ కర్జోల్, విశ్వేశ్వర హెగ్డే కగేరి, సీటీ రవి పేర్లను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. బీజేపీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని నిరానీ తెలిపారు.

    అయితే బీజేపీ నాయకత్వం కర్ణాటక కొత్త సీఎం ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యత ఇస్తుందా లేక వాటిని పట్టించుకోకుండా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలను పక్కపెట్టి. ఇతర వర్గాలకు చెందిన నాయకులకు.. అది కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నాయకుడిని ఈ పదవికి ఎంపిక చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. అయితే యడియూరప్పను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించుకున్న బీజేపీ హైకమాండ్.. ఆయన తరువాత సీఎం ఎవరనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు రేపు జరగబోయే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో దీనిపై ఆ పార్టీ ఓ నిర్ణయానికి రావొచ్చనే చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: