news18-telugu
Updated: November 16, 2018, 4:19 PM IST
ప్రధాని మోదీ(ఫైల్ ఫోటో)
ఛత్తీస్‌గఢ్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధానిగా ఉండడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబానిదే పెత్తనమని మోదీ విరుచుకుపడ్డారు. గాంధీయేతరులను పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టే దమ్ములేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నెహ్రూ సుపరిపాలన వల్లే టీ అమ్ముకునే వ్యక్తి కూడా ప్రధాని అయ్యారన్న శశి థరూర్ వ్యాఖ్యలపై మోదీ కౌంటర్ అటాక్ చేశారు.

కాంగ్రెస్ నేతలకు సవాల్ విసురుతున్నా. గాంధీ ఫ్యామిలీకి చెందని వారిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా కనీసం ఐదేళ్ల పాటు నియమించగలరా? జవహర్లాల్ నెహ్రూ సరైన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించారని అప్పుడు నమ్ముతాం. దేశ ప్రజల సమస్యలను మీరు అర్ధం చేసుకోలేరు. కానీ ఛాయ్‌వాలా అర్ధం చేసుకోగలడు.
— ప్రధాని మోదీ
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తొలిదశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయిందని..మావోయిస్టులకు ప్రజలు బుద్ధిచెప్పారని అన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడతలో 72 స్థానాలకు నవంబరు 20న పోలింగ్ జరగనుంది. నవంబరు 12న తొలివిడత ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ నమోదయింది. డిసెంబరు 11న ఫలితాలు వెల్లడిస్తారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 16, 2018, 4:16 PM IST