హోమ్ /వార్తలు /జాతీయం /

ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలెందుకు... ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం మార్చారా...

ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలెందుకు... ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం మార్చారా...

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

Lok Sabha Elections 2019 : 2014లో అభివృద్ధిపై మాట్లాడిన మోదీ... ఇప్పుడు ఉగ్రవాదం, పాకిస్థాన్‌పై మాట్లాడటం వెనక అసలు కారణాలేంటి?

  2014 నాటికి యూపీఏ రెండో ప్రభుత్వం తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం, అదే సమయంలో... బీజేపీ నుంచీ అగ్రనేతగా ఎదుగుతూ వస్తున్న నరేంద్ర మోదీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టడం, అప్పటికే ఆయన గుజరాత్‌లో వైబ్రంట్ గుజరాత్ వంటి కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకోవడంతో... దేశ ప్రజలు మరో మాట లేకుండా బీజేపీకి పట్టం కట్టారు. దేశం మొత్తం మోదీ మేనియా కనిపించింది. ఐతే... మొదటి సంవత్సరం మోదీ పాలనలో అవినీతి జరగలేదు... అలాగని అభివృద్ధి కూడా జరగలేదని విశ్లేషకులు తేల్చారు. ప్రధానిగా మోదీ తొలిసారి కావడంతో... కాస్త అనుభవం కావాలి అని సర్దిచెప్పుకున్నారు. ఐతే... ఆ తర్వాత వరుసగా నాలుగేళ్లు గడిచిపోయాయి. నోట్ల రద్దు, జీఎస్టీ, సర్జికల్ స్ట్రైక్స్ తప్పితే... కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదన్న వాదన వినిపిస్తోంది. ప్రధానంగా మోదీ దేశాన్ని సరికొత్త దిశలో నడిపిస్తారనీ, దేశ దశ, దిశను మార్చేస్తారని ఎన్నో అంచనాలు పెట్టుకున్న యువత... మోదీ ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చెయ్యలేదన్న వాదన వినిపిస్తున్నారు. ప్రధాని పీఠంపై ఉండి... ప్రభుత్వంలో అవినీతికి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడినా... చెప్పుకోతగ్గ అభివృద్ధి ప్రాజెక్టులేవీ కేంద్రం చేపట్టలేదన్న అభిప్రాయం దేశ ప్రజల్లో ఉందంటున్నారు విశ్లేషకులు.


  ఐదేళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎన్నికలు వచ్చాయి... మరోసారి అధికారం తమదే అంటున్న ప్రధాని మోదీ... 2014లో ఏ రేంజ్‌లో ప్రచారం చేశారో... ఇప్పుడు అదే ఉత్సాహంతో, అదే దూకుడుతో ప్రచారం చెయ్యట్లేదన్న కోణం కనిపిస్తోంది. ఇటీవల బీజేపీ గ్రాఫ్ పడిపోవడం, మూడు కీలక రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్) బీజేపీ అధికారాన్ని కోల్పోవడంతో... సహజంగానే ఆ పార్టీలో ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో... ఓటర్లను ఆకట్టుకునేందుకు మోదీ... భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఉగ్రవాదం, పాకిస్థాన్ అంశం, సరిహద్దుల్లో దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ వంటి అంశాల్ని తమ ప్రచారంలో లేవనెత్తుతున్న మోదీ... ఈ వారంలో మరింత ఘాటైన వ్యాఖ్యలు చేస్తుండటం కలకలం రేపుతోంది.


  దేశంలో హిందూ ఉగ్రవాదం లేదన్న మోదీ... హిందువులు ఎప్పుడూ ఉగ్రవాదానికి పాల్పడినట్లు బ్రిటీష్ చరిత్రకారులు కూడా ఎప్పుడూ ఎక్కడా రాయలేదని అన్నారు. తద్వారా హిందువుల మనసులు గెలుచుకునేందుకు, హిందువుల ఓట్లు కొల్లగొట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు. ఐతే... మోదీ ఓ విషయం గ్రహించాలి. భారత దేశంలో అన్ని మతాలవారూ ఉన్నారు. అన్ని వర్గాల వారూ ఉన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న నేత... ఎవరి మనోభావాలనూ కించపరచకుండా ప్రచారం సాగించాలే తప్ప... ఓ వర్గం ఓట్ల కోసం... మరో వర్గం ఇబ్బందిపడేలా ప్రసంగాలు చెయ్యడం భావ్యం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి భావజాలం వల్ల... అభివృద్ధి సంగతేమోగానీ... దేశంలో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.


  కాంగ్రెస్ ముక్త భారత్ స్థానంలో చౌకీదార్ : ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లపాటూ... కాంగ్రెస్ ముక్త భారతే తమ నినాదమని ప్రకటించారు. కానీ... ఎన్నికల ఏడాదిలో సీన్ మారింది. తుడిచిపెట్టుకుపోతుందనుకున్న కాంగ్రెస్ కాస్తా... కాస్త పుంజుకోవడం... అదే సమయంలో... బీజేపీ కాస్త బలహీనపడటంతో... మోదీ ఈ ఎన్నికల్లో ఆ ప్రస్తావన తేవట్లేదు. దానికి బదులుగా చౌకీదార్ నినాదాన్ని వీలైనంతగా ప్రచారం చేస్తున్నారు. నా ఖావుంగా... నా ఖానేదూంగా అన్న ప్రధాని... అందులో భాగంగానే తాను దేశానికి చౌకీదార్ (కాపలాదారు) అని చెప్పుకున్నారు. ఐతే... ప్రతిపక్ష కాంగ్రెస్ అధినేత... మోదీ చౌకీదార్ కాదనీ... చోర్ అనీ ప్రచారం సాగిస్తుండటంతో... దాన్ని తిప్పికొట్టేందుకు మోదీ... తన ట్విట్టర్ అకౌంట్‌లో పేరు ముందు చౌకీదార్ అనే పదాన్ని చేర్చారు. బీజేపీ ప్రముఖులంతా అదే విధంగా చెయ్యడం ద్వారా ఈ ఎన్నికల్లో చౌకీదార్ నినాదాన్ని ప్రచారం చేస్తున్నారని అర్థమవుతోంది. దీని ద్వారా... తాను అవినీతికి పాల్పడలేదని చెప్పుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.


  ఇలా ఈ ఎన్నికల సమయంలో... అభివృద్ధి, భారీ ప్రాజెక్టులు, మిషన్, విజన్ అంశాల కంటే... భావోద్వేగాల్ని రెచ్చగొట్టే అంశాలకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోదంటున్నారు విశ్లేషకులు. తొలి దశ ఎన్నికల ప్రచారం ముగియడానికి ఇంకా వారం సమయం కూడా లేదు. ఐతే... అందువల్ల బీజేపీ ప్రచారం ఇంకా ఏ స్థాయికి దిగజారుతుందన్నది తేలాల్సిన అంశం. కాంగ్రెస్ ఇచ్చిన కనీస ఆదాయ పథకం వల్ల చాలా వరకూ ఓట్లు, సీట్లూ చేజారే అవకాశం ఉందని నమ్ముతున్న బీజేపీ పెద్దలు... మరిన్ని అస్త్రాలు తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


   


  ఇవి కూడా చదవండి :

  IPL 2019 : ముంబై ఇండియన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అరుదైన దృశ్యాలు...


  ప్రచారానికి ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్లు... కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు... చాపర్ల అద్దెలు ఎంతో తెలుసా...


  తెలంగాణలో మరో 6 ఔటర్ రింగ్ రోడ్డులు... రూ.9000 కోట్లతో నిర్మాణం.... ఎన్నికల తర్వాత మొదలు....


  PICS: హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సభ


  First published:

  Tags: Congress, Lok Sabha Election 2019, Narendra modi, Rahul Gandhi

  ఉత్తమ కథలు