WHY LALU PRASADS POPULARITY IS STILL A FACTOR IN THE BIHAR ELECTIONS NK
Bihar Election Result 2020: బీహార్ ఎన్నికలపై లాలూ ప్రభావం... అదే వ్యూహంతో...
బీహార్ ఎన్నికలపై లాలూ ప్రభావం (File)
Bihar Assembly Exit Poll Result 2020: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం... బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాఘట్బంధన్ అధికారంలోకి రాబోతోంది. ఇందులో లాలూ ప్రభావం ఎంత?
Bihar Assembly Election Result 2020: సమోసాలో ఆలూ ఉన్నంతకాలం... బీహార్‌లో తాను ఉంటానని లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడో చెప్పారు. కేసులు, ఆరోపణలు ఎన్నిఉన్నా... యాక్టివ్ పాలిటిక్స్‌లో ఆయన తన పార్టీ సింబలైన లాంతర్ పట్టుకొని... నిలబడకపోయినా... ఈ ఎన్నికల్లో మాత్రం లాలూ ప్రభావం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల మూడో దశ పోలింగ్‌కి మూడు రోజుల ముందు... కోసీ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళ... టీవీ కెమెరా ముందుకొచ్చి.. తాను లాలూకి ఓటేస్తానని చెప్పింది. వెంటనే ఆ టీవీ రిపోర్టర్.. "లాలూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. మీరు ఆయనకు ఎలా ఓటేస్తారు" అని అడిగితే... వెంటనే ఆమె ఏమాత్రం తడుముకోకుండా... "అయితేనేం... ఆయన కొడుకు బయటే ఉన్నాడుగా" అంది.
ఇలా బీహార్‌లో చాలా మంది పెద్దవాళ్లు, ముసలివాళ్లకు... ఆర్జేడీ అంటే... ఇప్పటికీ లాలూనే. జేడీయూ వద్దనుకుంటే... వాళ్లు ఎందుకునేది లాలూనే (RJD). ఎక్కువగా పల్లెల్లో పొలం పనులు చేసుకుంటున్న రైతుల్లో ఆడవాళ్లైనా, మగవాళ్లైనా... లాలూకు ఓటేసేందుకు వెనకాడట్లేదు.
లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి... ఒకరి తర్వాత ఒకరుగా... 15 ఏళ్లపాటూ బీహార్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఈసారి మాత్రం వాళ్లిద్దరూ... ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. పోస్టర్లు, బ్యానర్లపై కూడా వాళ్ల ఫొటోలు లేవు. లాలూ కొడుకు తేజస్వీ యాదవ్... ప్రత్యేక వ్యూహంతో... RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాఘట్‌బంధన్‌కి అన్నీ తానే అవ్వాలనుకున్నారు. ప్రజలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తానే కనిపించాలనే వ్యూహంతో... తల్లిదండ్రులను ఎన్నికలకు దూరం పెట్టారు. యువతను ఆకర్షించాలంటే కూడా... ఇదే సరైన పద్ధతి అని తేజస్వీ నమ్మారు.
ప్రధానంగా లాలూ... అక్కడి అగ్ర కులాలకు ప్రతినిధిగా ఉంటూ వచ్చారు. పార్సీలు, తుర్హాలు, కుమ్మరులు, కహర్లు, కొంతమంది దళిత వర్గాల వారు లాలూతోనే ఉన్నారు. బీహార్‌లో మైనార్టీలు 16 శాతం దాకా ఉన్నారు. వీరికి మేలు చేయడం వల్ల RJDకి వీళ్లు దగ్గరయ్యారు. వీళ్ల ఓట్లను తిరిగి తాను దక్కించుకోవడంతోపాటూ... ఇతర వర్గాల ఓట్లు కూడా రాబట్టుకోవడానికి అధికార JDUపై వ్యతిరేకతను పెంచడంతోపాటూ... తన తండ్రికి చెందిన అగ్ర కుల బ్రాండ్ తనపై పడకుండా ఉండేలా తేజస్వీ వ్యూహం వేశారు. బీహార్‌లో యాదవులు, ముస్లింలు 31 శాతం ఉన్నారు. వారంతా లాలూతో ఉన్నారు. ఇప్పటికీ ఈ ఓటు బ్యాంకు చెదిరిపోలేదు.
తాను మాత్రమే తెరపై ఉండటంతో... తేజస్వీ... తన తండ్రిలాగా తాను కాదనీ... అన్ని వర్గాల వారికీ చేరువవుతాననే సందేశం ఇచ్చినట్లైంది. ఐతే... తేజస్వీపైనా ఎన్నో విమర్శలు, ఆరోపణలున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పోస్టుకు అర్హుడు కాదనేవారూ ఉన్నారు. అయినప్పటికీ... జేడీయూకి ప్రత్యా్మ్నాయంగా... ఇప్పుడు ఆర్జేడీయే ప్రజలకు కనిపించేలా చేయడంలో తేజస్వీ చాలా వరకూ సక్సెస్ అయ్యారు.
లాలూ మూడేళ్లుగా జైల్లోనే ఉన్నా... ఎన్నికల్లో లేకపోయినా... ఇప్పటికీ ప్రజలు ఆయన్ని మర్చిపోలేదు. కారణం... లాలూ ఒకప్పుడు అండగా నిలిచిన వర్గాలు... ఆయన్ని ఇప్పటికీ మర్చిపోలేదు. లాలూ రాకముందు వారంతా ఎన్నో అణచివేతలను చూశారు. లాలూ వచ్చాక... వారికి స్వేచ్ఛ లభించినట్లైంది. నితీశ్ పాలనలో వారిపై అణచివేతలు లేకపోయినా... తమకు ప్రత్యేక గుర్తింపు మాత్రం లాలూతోనే వచ్చినట్లు వారు భావిస్తున్నారు. వారిని తనవైపు తిప్పుకోవడంలో... నితీశ్ ఫెయిలయ్యారు. ఈ ఓటు బ్యాంకు... ఆర్జేడీతోనే ఉంది. ఇది ఇప్పటికీ... నిలిచే ఉండి... తేజస్వికి ప్లస్ పాయింటుగా మారుతోందనే అంచనా ఉంది.
బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఈసారి RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాఘట్బంధన్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.