సర్జికల్ స్ట్రైక్స్‌లో చిరుత మల మూత్రాలు.. ఏంటా సీక్రెట్?

కుక్కలు మొరగకుండా ఉండాలంటే.. అక్కడ చిరుత సంచరిస్తున్న ఆనవాళ్లను సృష్టించగలిగితే.. అప్పుడవి భయపడి దాక్కుండిపోతాయని భావించినట్టు చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: September 12, 2018, 6:29 PM IST
సర్జికల్ స్ట్రైక్స్‌లో చిరుత మల మూత్రాలు.. ఏంటా సీక్రెట్?
ప్రతీకాత్మక చిత్రం..
  • Share this:
కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తూ వచ్చిన పాకిస్తాన్‌కి రెండేళ్ల క్రితం సర్జికల్ స్ట్రైక్స్‌తో భారత్ గట్టి బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ కోసం భారత సైన్యం పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగింది. సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని మాజీ కమాండర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజేంద్ర నింబోర్కర్‌ తాజాగా వెల్లడించారు. ఆపరేషన్ కోసం తాము చిరుత మల మూత్రాలను సైతం ఉపయోగించుకున్నామని ఆయన వెల్లడించడం గమనార్హం.

పాక్ సరిహద్దుల్లోకి చొచ్చుకెళ్లే క్రమంలో.. అక్కడి గ్రామాల్లోని కుక్కలు మొరగకుండా ఉండేందుకే చిరుత మలమూత్రాలను తీసుకెళ్లినట్టు నింబోర్కర్ తెలిపారు. సాధారణంగా ఆ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో పగటిపూట చిరుత పులులు కుక్కలపై దాడి చేస్తాయన్నారు. దీంతో రాత్రి సమయంలో ఆ కుక్కలు గట్టిగా అరుస్తాయని, సర్జికల్ స్ట్రైక్స్ సమయంలోనూ కుక్కలు అలాగే మొరిగితే ఆపరేషన్ కష్టమవుతుందని భావించినట్టుగా చెప్పారు.


కుక్కలు మొరగకుండా ఉండాలంటే.. అక్కడ చిరుత సంచరిస్తున్న ఆనవాళ్లను సృష్టించగలిగితే.. అప్పుడవి భయపడి దాక్కుండిపోతాయని భావించినట్టు చెప్పుకొచ్చారు. అనుకున్నట్టుగానే తమ ఆలోచన ఫలించిందని.. చిరుత పులి మల మూత్రాలను ఆయా గ్రామాల్లో చల్లడంతో.. ఆ రాత్రి కుక్కలు మొరగలేదని అన్నారు. దీంతో తమ ఆపరేషన్‌ను అవి పసిగట్టలేకపోయాయని, సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతం అయ్యాయని అన్నారు.

కాగా, జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో బ్రిగేడ్‌ కమాండర్‌గా పనిచేసిన నింబోర్కర్‌.. సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతం కావడంతో కీలక పాత్ర పోషించారు. కశ్మీర్ బారాముల్లాలోని సైనిక స్థావరంలోకి చొరబడి పాక్ ఉగ్రవాదులు 18మంది భారత సైనికులను మట్టుబెట్టడంతో.. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా భారత్ బదులు తీర్చుకుంది. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా దాదాపు 50మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.


First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...