WHY GIVE DEATH PENALTY WHEN DELHI AIR IS REDUCING LIFE NIRBHAYA CONVICTS PLEA IN SUPREME COURT SK
కాలుష్యంతోనే చస్తున్నా.. ఇక ఉరి శిక్ష ఎందుకు? నిర్భయ దోషి పిటిషన్
ప్రతీకాత్మక చిత్రం
2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పును సమీక్షించాలని రివ్యూ పిటిషన్ వేశాడు అక్షయ్. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల ఇప్పటికే సగం చచ్చానని.. ఇక ఉరి శిక్ష ఎందుకని పిటిషన్లో పేర్కొన్నాడు.
దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో త్వరలోనే దోషులను ఉరి తీస్తారని ప్రచారం జరుగుతోంది. నిర్భయపై అఘాయిత్యం జరిపిన రోజే (డిసెంబరు 16) వారిని ఉరితీయబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పును సమీక్షించాలని రివ్యూ పిటిషన్ వేశాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల ఇప్పటికే సగం చచ్చానని.. ఇక ఉరి శిక్ష ఎందుకని పిటిషన్లో పేర్కొన్నాడు.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం గ్యాస్ చాంబర్‌లా మారిందన్న విషయం అందరికీ తెలుసు. ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. కాలుష్యం వల్ల ఆయుష్షు తగ్గిపోతోంది. ఇక ఉరి శిక్షలు ఎందుకు? సత్యయుగంలో మనుషులు వెయ్యేళ్లు జీవించే వారు. త్రేతా యగంలో వందల ఏళ్లు బతికేవారు. కానీ ప్రస్తుత కలియుగంలో మనుషుల సగటు జీవితకాలం 50-60లకు పడిపోయింది.
— అక్షయ్ కుమార్
అంతేకాదు ధనవంతులు ఉరికొయ్య వరకు వెళ్లడం లేదని.. కేవలం పేదలకు మాత్రమే ఉరిశిక్ష విధిస్తున్నారని అక్షయ్ ఆరోపించాడు. దేశ ప్రజలందరికీ సమ న్యాయం జరగడం లేదని.. ఒక వ్యక్తికి మరణశిక్ష విధించే హక్కు ఎవరికీ లేదని పిటిషన్లో పేర్కొన్నాడు.
కాగా, నిర్భయ కేసులో మిగతా ముగ్గురు దోషులు ముకేశ్ (30), పవన్ గుప్తా (23), వినయ్ శర్మ (34) రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. 2018 జూలై 9న సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. ఐతే అక్షయ్ కుమార్ (31) మాత్రం గతంలో రివ్యూ పిటిషన్ వేయలేదు. తాజాగా అక్షయ్ తరఫున ఆయన లాయర్ ఏపీ సింగ్ మంగళవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు.
2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దక్షిణ ఢిల్లీలో ప్రాంతంలో గ్యాంగ్ రేప్ జరిగింది. కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి మర్మాంగాల్లోకి పదునైన వస్తువులను జొప్పించడంతో తీవ్రగాయాలపాలైంది. డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఎలిజబెత్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులంతా దోషులుగా తేలారు. దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. దోషిగా తేలిన మైనర్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఇక ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్‌కి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చివంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.