చెత్త, కుళ్లిపోయిన శవాలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, ఈగలు(Flies), బొద్దింకలు(Cockroaches), కలుషిత నీరు ద్వారా ప్రాణాంతక అంటువ్యాది అయిన కలరా (Cholera) సోకుతుంది. ఈ భయంకరమైన వ్యాధి మళ్లీ ఈ ఏడాదిలో ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతూ కలవరపెడుతోంది. కలరా వ్యాధి వ్యాప్తి పెరగడానికి యుద్ధం, పేదరికం, వాతావరణ మార్పులు కారణమయ్యాయి. మళ్లీ వీటి కారణంగానే ఈ వ్యాధి తిరిగి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పీడించే అవకాశముందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్(Tedros Adhanom Ghebreyesus)హెచ్చరించారు. ఈ ప్రాణాంతక వ్యాధి రాకుండా, వచ్చినవారి ప్రాణాలు పోకుండా కాపాడేలా చర్యలు చేపట్టాలని అన్ని దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
భయపెడుతున్న బ్లూ డెత్ ..
కలరా అత్యంత భయంకరమైన వ్యాధి. గతంలో ఈ అంటువ్యాధి లక్షల మంది భారతీయులను పొట్టన పెట్టుకుంది. ఇది ఇప్పటికీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఈ వ్యాధి వచ్చిన రోగులకు తక్షణమే సరైన వైద్యం అందించకపోతే వారు మరణించడం ఖాయం. ఈ వ్యాధి కారణంగా నీళ్ల విరోచనాలు, వాంతులు కావడంతోపాటు డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. ఈ డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు బాధితుల స్కిన్ బ్లూ కలర్‌గా మారుతుంది. కాబట్టి దీనిని ఒకప్పుడు "బ్లూ డెత్" అని కూడా పిలిచేవారు.
వ్యాప్తికి కారణాలు..
కలరా ప్రాణాంతకమైన వ్యాధే కానీ దానిని నివారించవచ్చు. ఈ వ్యాధి బారినపడిన రోగులకు మెరుగైన చికిత్స కూడా చేయవచ్చు. అయితే అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇథియోపియా, నైజీరియా వంటి కొన్ని దేశాల్లో వ్యాధిని నియంత్రించడానికి మెడికల్ టూల్స్ అందుబాటులో లేవు. కలరా కేసులు పెరగడానికి, మరణాలు సంభవించడానికి పేదరికం కూడా ఒక కారణం. అలానే యుద్ధాల వంటి పరిస్థితుల కారణంగా కూడా అందరూ ఒకే దగ్గర ఉండాల్సి వస్తుంది. స్వచ్ఛమైన నీరు వంటి సరైన సౌకర్యాలు లేక వారికి ఈ అంటువ్యాధి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది.
కలుషిత నీటితోనే వ్యాప్తి..
వాతావరణ మార్పుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి విపరీతంగా పెరుగుతోందని WHO చీఫ్ టెడ్రోస్ తెలిపారు. వరదలు, తుఫానులు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా కూడా స్వచ్ఛమైన నీటి ఎక్కడా లభ్యం కాదు. ఇలాంటి పరిస్థితులలో కలరా వ్యాప్తి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. యుద్ధం కారణంగా భారీ ప్రాణనష్టం వాటిల్లిన సిరియాలో ఈ వ్యాధి బీభత్సంగా వ్యాప్తి చెందుతోంది. హైతీలో గ్యాంగ్ వార్ కారణంగా కలరా కేసుల పెరుగుతున్నాయి. ఇక ఉక్రెయిన్, పాకిస్థాన్లలోనూ వ్యాధి వ్యాప్తి చెందుతోంది.
ఎలా జాగ్రత్త పడాలి..?
కలరా వ్యాప్తి చెందే ప్రాంతాల్లో నివసిస్తున్నవారు తరచుగా చేతులు కడుక్కోవాలి. మలాన్ని జనాలు తిరగని ప్రాంతాల్లో పారేయాలి. నీటిని నిమిషం పాటు మరిగించి, దానిని ఫిల్టర్ చేయాలి. ఆ నీటిలో తగిన మొత్తంలో హోమ్ బ్లీచ్ లేదా అయోడిన్ టాబ్లెట్ లేదా కమర్షియల్ క్లోరినేషన్ టాబ్లెట్లను కలపాలి. ఈ శుభ్రమైన లేదా శుద్ధి చేసిన నీటిని పాత్రలు కడగడానికి, ఐస్ తయారు చేయడానికి, ఆహారాన్ని సిద్ధం చేయడానికి, పళ్లు తోముకోవడానికి ఉపయోగించాలి. ఉడకని లేదా పచ్చి మాంసం, సీఫుడ్, పొట్టు తీయని పచ్చి లేదా సరిగ్గా ఉడకని పండ్లు, కూరగాయలు తినకూడదు.
లక్షల్లో బాధితులు..
ఒక రీసెర్చ్ ప్రకారం ఏటా 13 నుంచి 40 లక్షల మంది కలరా బారిన పడుతున్నారు. వారిలో ఏటా 21 వేల నుంచి 143,000 మంది ప్రజలు మరణిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి కారణంగా పెరిగిన అధిక డిమాండ్‌ను తీర్చడానికి కలరా వ్యాక్సిన్ సరఫరా సరిపోదని టెడ్రోస్ చెప్పారు. తయారీదారులు వ్యాక్సిన్ ప్రొడక్షన్‌ను ఎలా పెంచవచ్చో తమతో మాట్లాడాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, WHO