Gujarat CM Race: గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ (Gujarat CM Vijayuaroopani) అనూహ్య రాజీనామాతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుత సీఎం విజయరూపానీ రాజీనామా (Vijay Rupani resigned)చేయడంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఊపందుకొంది. ఈ తరుణంలో ప్రధానంగా నలుగురు బీజేపీ సీనియర్ నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ (Gujarat Deputy CM Nitin Patel), వ్యవసాయ శాఖమంత్రి ఆర్సీ ఫాల్దుతో (RC Falgutho) పాటు కేంద్రమంత్రులుగా ఉన్న పురుషోత్తం రూపాలా (Purusotham Roopala), మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రిల అమిత్ షా (Amit shah) స్వరాష్ట్రమైన గుజరాత్లో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఎవరూ ఊహించని విధంగా చోటుచేసుకున్న పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎలాంటి ప్రత్యేకమైన కారణం చెప్పకుండానే సీఎం విజయ్ రూపానీ అకస్మాత్తుగా గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించడం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కొత్త నాయకత్వంలో నూతనోత్సాహం, కొత్త శక్తితో గుజరాత్ అభివృద్ధి పథంలో మరింతగా దూసుకెళ్తుందని ఆశిస్తున్నానని.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే తన పదవికి రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు.
నితిన్ పటేల్ (Patel), ఫాల్దు, రూపాలా, మాండవీయ పేర్లు చర్చకు వస్తున్నాయని, అయితే, ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై నిర్ణయం తీసుకోనుండటంతో కొత్త సీఎం ఎవరో చెప్పడం మాత్రం కష్టమని బీజేపీ నేతలు అంటున్నారు. 2016 ఆగస్టులో అప్పటి సీఎం ఆనందిబెన్ పటేల్ రాజీనామా చేసిన సందర్భంలో కూడా నితిన్ పటేల్ తదుపరి ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, ఆఖరి నిమిషంలో విజయ్‌రూపానీకి బీజేపీ అధిష్ఠానం పగ్గాలు అప్పగించింది.
ఇప్పుడు రూపానీ రాజీనామా తరువాత నితిన్ పటేల్‌నే ముఖ్యమంత్రిని చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. పటేల్ సామాజిక వర్గం వారికే ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలన్న డిమాండ్లు వినబడుతున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేరు కూడా ప్రధానంగా వినిపస్తోంది. మరోవైపు, మహారాష్ట్ర నుంచి వచ్చి గుజరాత్లో స్థిరపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌ను సీఎం పదవికి పరిగణించే అవకాశాలు కూడా ఉన్నాయి.
గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే ఈ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఒకవైపు.. అనారోగ్య కారణాలతోనే విజయ్ రూపానీ రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, మరోవైపు ఆయన రాజీనామాకు అసలు కారణం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం ఇప్పటి నుంచే బీజేపీ పావులు కదుపుతోంది. అందుకే గుజరాత్లో బలమైన పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకే రూపానీతో రాజీనామా చేయించినట్టు సమాచారం. గత ఎన్నికల సమయంలో పటేల్ సామాజిక వర్గం నుంచి హార్ధిక్ పటేల్ తమ హక్కుల కోసం బీజేపీని బెంబేలిత్తించారు. తమ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చితే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. దాంతో అధికార బీజేపీ వైపు నుంచి స్పందన కరువైంది.
గుజరాత్లో అధికార బీజేపీకి పటేళ్ల నుంచి భారీ మద్దతు ఉంది. రాష్ట్ర జనాభాలో పటేల్ సామాజికవర్గం 15 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ, వ్యాపార రంగాల్లో పటేల్ సామాజికవర్గం కీలక స్థాయిలో ఉన్నారు. అందుకే పటేళ్లకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు బీజేపీ యోచిస్తోంది. వారికి దగ్గరయ్యేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే రూపానీతో రాజీనామా చేయించినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Gujarat, National News, Pm modi