Sindhutai Sapkal: అనాథలకు తల్లి సింధుతాయ్ సప్కాల్... ఈ ఏడాది పద్మశ్రీ గ్రహీత

సింధుతాయ్ సప్కాల్ (image courtesy - instagram)

Sindhutai Sapkal: పద్మశ్రీ అవార్డు పొందేవరకూ సింధుతాయ్ సప్కాల్ చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె ఎవరు, ఎందుకు కేంద్రం ఆమెకు పద్మశ్రీ ఇచ్చిందో తెలుసుకుందాం.

 • Share this:
  Sindhutai Sapkal: గొప్ప గొప్ప వాళ్ల గురించి మనం అప్పుడప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మనం వారి నుంచి ఎంతో కొంత ప్రేరణ పొందగలం. ఓ మంచి సినిమా చూసినప్పుడు, ఓ మంచి పుస్తకం చదివినప్పుడు ఎలా సంతృప్తిగా ఫీలవుతామో... గొప్పవారి గురించి తెలుసుకున్నప్పుడు కూడా అదే ఫీల్ కలుగుతుంది. ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నవారిలో సింధుతాయ్ సప్కాల్ ఒకరు. మహారాష్ట్ర నుంచి ఈ సంవత్సరం చాలా మంది అవార్డులు గెలుచుకున్నారు. వారిలో సప్కాల్... పుణెకు చెందినవారు. ఆమెను చాలా మంది తాయ్ అని పిలుస్తారు. అంటే అమ్మ అని అర్థం. ఆమెను వెయ్యి మంది అనాథల తల్లిగా అభివర్ణిస్తారు. నిజానికి ఆమె 2000 మంది అనాథలను దత్తత తీసుకున్నారు.

  మహారాష్ట్రలోని వార్ధాలో ఓ పేద కుటుంబంలో పుట్టారు సింధుతాయ్. చాలా మంది పిల్లల లాగే ఆమె కూడా వివక్షను ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో ఆమె తల్లికి కూతురుని స్కూలుకు పంపడం ఇష్టం లేదు. కానీ తండ్రి ప్రోత్సహించి... స్కూలుకు పంపారు. కూతురిని గేదెల కాసేందుకు పంపాలనుకున్న తల్లి ఆలోచన కార్యరూపం దాల్చలేదు. దాంతో ఆమె... కూతురికి 12 ఏళ్లు రాగానే... స్కూల్ మాన్పించి... ఆమె కంటే 20 ఏళ్ల పెద్ద వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేసింది.

  పెళ్లి తర్వాత సింధును వార్ధాలోని నవర్గావ్‌కి భర్తతోపాటూ పంపించేశారు. ఆ భర్త ఏనాడూ ఆమెను భర్తలా చూడలేదు. గౌరవించలేదు. టీనేజ్‌లో సింధు ధైర్యం చేసింది. భర్తను లెక్క చెయ్యకుండా... స్థానికుల సమస్యలపై కదం తొక్కింది. అక్కడి అటవీ అధికారులు, భూస్వాముల అక్రమాలను ఎదుర్కొని స్థానిక మహిళలకు అండగా నిలిచింది.

  20 ఏళ్ల వయసులో సింధు నాలుగోసారి గర్భం దాల్చింది. అప్పటికే 3సార్లు ఫెయిలైంది. ఈసారి కూడా ఆమెను భర్త చితకబాది చంపేస్తాడని స్థానికులు భావించారు. ఆ పరిస్థితుల్లో ఆమె... ఓ షెడ్డులో పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టాక భర్త ఆమెను వదిలేశాడు. దాంతో పుట్టింటికి రాగా... తల్లి పొమ్మంది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఆమె... వీధులు, రైళ్లలో అడ్డుక్కోవడం మొదలుపెట్టింది. అసలే రక్షణ లేని రోజులు. రాత్రి వేళ తన కోసం, తన కూతురి రక్షణ కోసం ఆమె శ్మశానాలు, గొడ్లచావిళ్లలో ఉండేది.

  క్రమంగా బతుకుపోరాటంలో సింధు రాటుతేలింది. ఆ క్రమంలో ఆమెకు అనాథ పిల్లలు పరిచయమయ్యారు. అలా ఓ డజను మందిని దత్తత తీసుకుంది. వాళ్ల బాగోగులు చూసుకుంది. వారి కోసం మరింత ఎక్కువగా అడుక్కుంది.

  1970లో కొంత మంది సింధుకు సాయం చేసి... అమరావతి (మహారాష్ట్ర)లోని చికల్దారలో ఓ ఆశ్రమాన్ని నిర్మించి ఇచ్చారు. ఆ తర్వాత ఆమె అక్కడే సావిత్రీభాయ్ ఫూలే బాలికల హాస్టల్, ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేశారు. అనాథలకు తల్లిగా మారిన సింధుతాయ్... తన జీవితాన్ని వారికే అంకితం చేశారు. ఆమె ద్వారా పైగి ఎదిగిన ఎందరో ఇప్పుడు లాయర్లు, డాక్టర్లు, ఇంకా ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు.

  సమాజానికి చేస్తన్న సేవలకు గుర్తింపుగా సింధుతాయ్... 270కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఎంత మందిని దత్తత తీసుకున్నా ఇంకా తన కోరిక చావట్లదేని ఆమె అన్నారంటే... ఆమె మనసు ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. 20 లక్షల మందిని దత్తత తీసుకోవాలని ఆమె కోరుకుంటున్నట్లు 2019లో ది హిందూ పత్రికకు తెలిపారు.

  తాజాగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాక మీకు ఏమనిపిస్తోంది అని అడిగితే ఆమె ఏమన్నారో తెలుసా... "చాలా సంతోషం. ఈ అవార్డు వల్ల నా పిల్లలకు మరింత మందికి ఆకలి తీరే అవకాశం వస్తుంది" అన్నారు. అంతేకాదు... తాను ఇంత మందికి సాయం చేయడానికి తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అవార్డును అంకితం చేస్తున్నానని అన్నారు.

  ఇది కూడా చదవండి: Viral Video: అడవిలో డిష్షుం డిష్షుం... పులి నాలిక కొరికేసిన మరో పులి... వైరల్ వీడియో

  ప్రస్తుతం ప్రజలు ఇస్తున్న డొనేషన్లు, ఆమె దగ్గర ఒకప్పుడు అనాథలుగా ఉన్నవారు ఇస్తున్న డబ్బుతోనే... సింధుతాయ్ మరింత మంది అనాథలను కాపాడుతున్నారు. ఇలా తన జీవితాన్ని వాళ్లకే అంకితం చేస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: