కాంగ్రెస్ పార్టీ (Congress Party) బాధ్యతలను ఎవరు చేపట్టబోతున్నారు? ముందుండి పార్టీని నడిపించేది ఎవరు? చాలా కాలంగా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. వాస్తవానికి సెప్టెంబరు 21 నాటికి కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు (Congress New President) రావాల్సి ఉంది. పార్టీలో ఎన్నికలు నిర్వహించిన కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. డెడ్‌లైన్‌కు ముందు ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఎవరు తీసుకుంటున్నారన్న దానిపై స్పష్టత రాపోకవడంతో.. డెడ్‌లైన్‌ను మరో నెల పాటు పొడిగించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీపావళి పండగ తర్వాతే ఎన్నిక జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఈ ఆదివారం సీడబ్ల్యూసీ చర్చించనుంది. అనంతరం షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో.. దానికి బాధ్యత వహిస్తూ.. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజీనామా చేశారు. అప్పటి నుంచీ ఏఐసీసీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. కాంగ్రెస్ సారథి బాధ్యతలను చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో సోనియా గాంధీ (Sonia Gandhi) తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఆమె కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరి ఈ ముగ్గురూ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రాకుంటే.. ఆ పదవిని ఎవరు చేపడతారన్న దానిపై కాంగ్రెస్‌లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు రాహుల్ గాంధీ ఒప్పుకోకుంటే.. అశోక్ గహ్లోత్‌ని అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు.
భారత్ పై దాడిచేయడానికి 30 వేల సుపారీ.. బార్డర్ వద్ద పాక్ ఉగ్రవాది అరెస్టు...
మరోవైపు పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టేలా.. రాహుల్ గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. చాలా మంది నేతలు ఆయన పేరునే ప్రతిపాదిస్తున్నారు. గాంధీ ఫ్యామిలీ అయితే..ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక సోనియా గాంధీ ఫ్యామిలీ విదేశాలకు వెళ్తోంది. అక్కడ సోనియా గాంధీ వైద్య పరీక్షలు చేయించుకుంటారు. అనంతరం ఇటలీ వెళ్తారు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతోన్న తన తల్లిని పరామర్శిస్తారు. సోనియా గాంధీ వెంట ప్రియాంక, రాహుల్ గాంధీలు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే సీడబ్ల్యూసీ మీటింగ్ వర్చువల్‌గా నిర్వహించనున్నారు. సోనియా, రాహుల్ గాంధీ విదేశాల నుంచే ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ కార్యకలాపాలు, అధ్యక్ష ఎన్నిక గురించి ఈ భేటీలో చర్చించి.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aicc, Congress, Rahul Gandhi, Sonia Gandhi