New Parliament Building: అద్భుత కట్టడమైన పార్లమెంటు కొత్త భవనాన్ని (New Parliament Building) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28న గ్రాండ్‌గా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రజా ప్రయోజన వాజ్యం (PIL) సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ సంగతులు పక్కన పెడితే, ఢిల్లీలోని పార్లమెంట్ కొత్త భవనాన్ని డిజైన్ చేసినది, నిర్మించింది ఎవరు? అనే అంశం ఆసక్తికరంగా మారింది.
కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టాను మెరుగుపరిచే ప్రాజెక్ట్‌లో ఒక భాగం. సెంట్రల్ విస్టా అనేది భారత ప్రభుత్వం ఉన్న ప్రాంతం. ప్రస్తుత పార్లమెంట్ భవనం 1927లో ప్రారంభించారు. దాదాపు శతాబ్దం కాలం నాటి ఈ భవనం దృఢత్వంపై అనుమానంతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. 2020, డిసెంబర్ 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భవనానికి శంకుస్థాపన చేశారు. కొత్త భవనం త్రిభుజం ఆకారంలో ఉంది. పాత భవనం కంటే ఇది 10% చిన్నదిగా ఉంటుంది.
* కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన కంపెనీ
కొత్త పార్లమెంటు భవనాన్ని ఇండియన్ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్ (Tata Projects) నిర్మించింది. దీని నిర్మాణ వ్యయం అక్షరాలా రూ.861.9 కోట్లు. టాటా ప్రాజెక్ట్స్ ఛైర్మన్ డాక్టర్ ప్రవీర్ సిన్హా కాగా MDగా వినాయక్ పాయ్ కొనసాగుతున్నారు.
Viral: యువకుడిగా కనిపించేందుకు తండ్రి, కొడుకుతో రక్త మార్పిడి.. కోట్లు ఖర్చు పెడుతున్న వ్యక్తి
* కొత్త పార్లమెంటు ఆర్కిటెక్
కొత్త పార్లమెంట్ భవనానికి బిమల్ పటేల్ (Bimal Patel) ఆర్కిటెక్‌గా పని చేశారు. విశ్వనాథ్ ధామ్ కాశీ విశ్వనాథ ఆలయం, గుజరాత్ హైకోర్టు భవనం, IIM అహ్మదాబాద్ క్యాంపస్, టాటా CGPL టౌన్‌షిప్, సబర్మతి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, పండిట్ దీనదయాళ్ పెట్రోలియం యూనివర్సిటీతో సహా అనేక పెద్ద భవనాలను బిమల్ పటేల్ డిజైన్ చేశారు. గుజరాత్‌కు చెందిన ఈ వాస్తుశిల్పి ఆర్కిటెక్చర్ రంగంలో విశేషమైన సేవలందించారు. ఆయన ఆర్కిటెక్చర్ ఫీల్డ్‌లో చేసిన అద్భుతమైన కృషికి గాను 2019లో పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది.
* కొత్త భవనం విశేషాలు ఏంటి
- కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి టాటా ప్రాజెక్ట్ రూ.862 కోట్లు వెచ్చించింది.
- కొత్త పార్లమెంట్ హౌస్‌లో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులు ఉండగలిగే సామర్థ్యం ఉంది.
- టాటా ప్రాజెక్ట్ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేసింది.
- కొత్త పార్లమెంట్ హౌస్ త్రిభుజాకార ఆకారంతో నాలుగు అంతస్థుల భవనంగా నిర్మితమైంది. అయితే క్యాంపస్ మొత్తం 64,500 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉంది.
- భవనంలో జ్ఞాన ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అనే మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian parliament