WHO Chief New Name : WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ)చీఫ్ టెడ్రోస్ గేబ్రియస్ అథనోమ్ కు ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) కొత్త పేరు పెట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో జరుగుతున్న మూడు రోజుల "గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్" సమ్మిట్ ప్రారంభోత్సవ వేదికగా బుధవారం టెడ్రోస్ను "తులసీ భాయ్"గా పిలిచారు మోదీ. గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి టెడ్రోస్ అథనోమ్( Tedros Ghebreyesus)హాజరయ్యారు. ఈ సందర్భంగా టెడ్రోస్ గుజరాతీలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందరికీ నమస్కారం.. ఎలా వున్నారు? అంటూ గుజరాతీ భాషలో పలకరించారు. దీంతో సభికులందరూ చప్పట్లు కొట్టారు. ఇది చూసిన మోదీ సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..."టెడ్రోస్ నాకు మంచి మిత్రుడు. ఈరోజు ఉదయం టెడ్రోస్ నన్ను కలిసినప్పుడు తనకు భారత్‌కు చెందిన గురువే చదువు చెప్పారని నాతో అన్నారు. తాను పక్కా గుజరాతీ అయిపోయానని, తనకు గుజరాతీ పేరును పెట్టాలని ఆయన నన్ను కోరారు. మహాత్మాగాంధీ నడయాడిన ఈ పుణ్యభూమిలో పుట్టిన నేను, ఒక గుజరాతీగా నా ప్రాణ స్నేహితుడిని తులసీ భాయ్(TULSI BHAI)అని పిలుస్తాను. ఒక గుజరాతీకి భాయ్ అనే పదం తప్పనిసరి అని పేర్కొన్నారు మోదీ. డాక్టర్ గెబ్రెయెసెస్ను తులసీ భాయ్గా పిలవటం చాలా సంతోషంగా ఉంది. తులసి మొక్క భారత ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగం. తరతరాలుగా తులసికి పూజలు చేస్తున్నాం. దీపావళి సమయంలో తులసి వివాహం ఉత్సవాలు నిర్వహిస్తాం. వేదికపై టెడ్రోస్ గుజరాతీలో మాట్లాడేందుకు ప్రయత్నించటం, చిన్నతనంలో తనకు పాఠాలు చెప్పిన భారత ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవటంపై చాలా ఆనందంగా ఉంది"అని అన్నారు.
ALSO READ LOC : డ్రాగన్ వంకరబుద్ది...భారత సరిహద్దుల్లో చైనా మొబైల్ టవర్లు
మరోవైపు, ఆయుష్ రంగంలో పెట్టుబడుల సదస్సు జరగడం ఇదే తొలిసారని మోదీ అన్నారు. మెడికల్ ప్లాంట్ల అమ్మకాల కోసం మార్కెట్లతో రైతులు ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు ఆయుష్ ఈ-మార్కెట్ ప్లేస్ ఆధునికీకరణ, విస్తరణపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు. భారత్ లో త్వరలో ఆయుష్ గుర్తు(AYUSH MARK)ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. దేశంలో తయారయ్యే సంప్రదాయ ఔషధాలపై ఇకపై ఆయుష్ గుర్తు ఉంటుందని మోదీ చెప్పారు. ఇది దేశంలోని నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులకు ప్రామాణికతను ఇస్తుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశీలించిన ఉత్పత్తులకు ఈ మార్క్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామనే విశ్వాసాన్ని ప్రపంచ దేశాల ప్రజలకు కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా..సంప్రదాయ ట్రీట్మెంట్స్ కోసం భారత్ కు వచ్చే విదేశీయులకు ఆయుష్ వీసా(AYUSH VISA) పేరుతో ప్రత్యేక కేటగిరీ వీసాలు మంజూరు చేయనున్నట్లు మోదీ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayushman Bharat, Gujarat, Pm modi, WHO