బ్యాలెట్ పేపర్‌ కూడా హ్యాక్ చేయొచ్చా..? ఇందిరాగాంధీ అలానే గెలిచారా?

బ్యాలెట్ పేపర్స్‌ని హ్యాక్ చేయడం వల్లే ఇందిరాగాంధీ గెలిచారని అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి. రసాయనాలు పూసిన బ్యాలెట్ పేపర్లలో.. కంటికి కనిపించని ఇంక్‌ని ముద్రించారని.. 72 గంటల తర్వాత ప్రజలు వేసిన ఓటు ముద్ర చెరిగిపోయి... కాంగ్రెస్ పార్టీ ' ఆవుదూడ ' గుర్తు కనిపించిందని కోర్టును ఆశ్రయించాయి. మొత్తం 518 పార్లమెంటరీ స్థానాల్లో 200-250 లోక్‌సభ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బ్యాలెట్ పేపర్స్‌ని హ్యాక్ చేశారని వాదించారు.

news18-telugu
Updated: April 7, 2019, 12:59 PM IST
బ్యాలెట్ పేపర్‌ కూడా హ్యాక్ చేయొచ్చా..? ఇందిరాగాంధీ అలానే గెలిచారా?
News18 Creative by Mir Suhail.
  • Share this:
లోక్‌సభ ఎన్నికలవేళ ఈవీఎంలపై దుమారం రేగుతోంది. ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేస్తోందని..ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతోందని విపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి. 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా పలు విపక్ష పార్టీలు ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. ఐతే అలా జరిగితే ఎన్నికల కౌంటింగ్‌కు 6 రోజులు పడుతుందన్నారు ఎన్నికల అధికారులు. ఆలస్యమైనా పరవాలేని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందేనని పట్టుబట్టుతున్నాయి.

ఇక బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కొన్ని నెలల క్రితం పలు పార్టీలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో

బ్యాలెట్ పేపర్‌కి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాలెట్ పేపర్స్‌ని కూడా హ్యాక్ చేయవచ్చన్న ప్రచారం తెరపైకి వచ్చింది. ఈవీఎంలపై వస్తున్న ఆరోపణల మాదిరిగానే బ్యాలెట్ పేపర్‌పైనా గతంలో సంచలన ఆరోపణలు వచ్చాయి. బ్యాలెట్ పేపర్ హ్యాకింగ్ వల్లే 1971లో ఇందిరాగాంధీ గెలిచారని విమర్శలు వినిపించాయి. అప్పట్లో ఆ వ్యవహారంపై తీవ్రదుమారం రేగింది. అసలేం జరిగిందో తెలియాంటే..1971లోకి జరిగిన పరిణామాలను ఓసారి చూద్దాం.

1971లో భారత్‌లో ఐదవ సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్) పార్టీ విజయం సాధించింది. అనంతరం ఆమె భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐతే ఆ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్స్ హ్యాకింగ్ జరిగిదంటూ బాంబే (నేడు ముంబై)కి చెందిన 'బ్లిజ్' అనే పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల ఫలితాలను ఎలా తారుమారు చేయవచ్చో సవివరంగా అందులో పేర్కొంది. అప్పటికే ఇందిరా గాంధీ విక్టరీపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసిన ప్రత్యర్థి పార్టీలు...బ్యాలెట్ పేపర్ ట్యాంపరింగ్‌పై గళమెత్తారు.

మొత్తం 518 పార్లమెంటరీ స్థానాల్లో 200-250 లోక్‌సభ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బ్యాలెట్ పేపర్స్‌ని హ్యాక్ చేశారని పలు పార్టీలకు చెందిన నేతలు ఆరోపించారు. ''ఒక రకమైన రసాయనాలు పూసిన బ్యాలెట్ పేపర్లని ఎన్నికల్లో వినియోగించారు. బ్యాలెట్ పేపర్ కొనుగోలు సమయంలో వాటిపై కంటికి కనిపించని ఇంక్‌తో ఇందిరాగాంధీకి పార్టీకి చెందిన 'ఆవుదూడ' గుర్తును ముద్రించారు. పోలింగ్ ముగిసిన 72 గంటల తర్వాత ప్రజలు వేసిన ఓటు ముద్ర చెరిగిపోతుంది. అనంతరం..అప్పటికే ముద్రించిన ఇన్‌విజిబుల్ ఇంక్ యాక్టివేట్ అవుతుంది. దాంతో ఓటర్లు వేసిన ముద్ర స్థానంలో 'ఆవుదూడ' గుర్తు బ్యాలెట్ పేపర్‌పై కనిపించింది.'' అని ఆరోపించారు.

ఇలా బ్యాలెట్ పేపర్స్‌ని హ్యాక్ చేయడం వల్లే ఇందిరాగాంధీ గెలిచారని అప్పటి విపక్షాలు ఆరోపించాయి. పోలింగ్ తర్వాత.. 72 గంటలకు ముందు కౌంటింగ్ జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు వచ్చాయని.. అప్పటికి ఇన్‌విజిబుల్ ఇంక్ యాక్టివేట్ కాకపోవడం వల్లే అలా జరిగిందని చెప్పారు. మిగిలిన చోట్ల హ్యాకింగ్ జరగడంతో భారీగా ఓట్లు వచ్చాయని విమర్శించారు. సోవియట్ యూనియన్ నుంచి కెమికెల్స్ కోటెడ్ బ్యాలెట్ పేపర్స్‌ని దిగుమతి చేశారని వారు ఆరోపించారు.

భారతీయ జన్ సంఘ్‌కి చెందిన బాల్‌రాజ్ మధోక్ ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సౌత్ ఢిల్లీ నుంచి పోటీచేసిన ఓడిపోయిన బాల్‌రాజ్..బ్యాలెట్ పేపర్స్‌ని హ్యాక్ చేయడం వల్లే కాంగ్రెస్ నేత శశి భూషణ్ గెలిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికలకు వినియోగించిన బ్యాలెట్ పేపర్లలో కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయని..అసలు పత్రాలకు, వాటికి చాలా తేడాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ గెలిచిన చోట్ల బ్యాలెట్ పేపర్లపై నిర్ధిష్టమైన ప్రాంతంలో 'ఆవుదూడ' గుర్తు కనిపిస్తోందని... నిజంగా ప్రజలే ఓటేస్తే అందరూ ఒకే ప్రదేశంలో ఎలా ముద్రించగలుగుతారని ప్రశ్నించారు. అంతేకాదు ఆ బ్యాలెట్ పేపర్లు తాజాగా, ప్రకాశవంతంగా కనిపించాయని కోర్టులో వాదనలు వినిపించారు. పలు కౌంటింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్స్‌ని డ్రమ్ముల్లో వేసి మిక్స్ చేశారని.. ఎన్నికల అధికారులు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.ఐతే బాల్‌రాజ్ మధోక్‌తో పాటు మరికొందరు నేతలు చేసిన ఆరోపణలను అప్పటి ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఆరోపణలు చేయని వాళ్లు...ఫలితాలు వచ్చాక విమర్శలు చేయడంతో అర్ధం లేదన్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం వల్లే అసహనంతో మాట్లాడుతున్నారని తిప్పికొట్టారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్ట బందోబస్తు ఉంటుందని..హ్యాకింగ్ అసాధ్యమని కొట్టిపారేశారు అధికారులు. 250 నియోజకవర్గాల్లో బ్యాలెట్ పేపర్లని హ్యాక్ చేస్తే..కనీసం ఒక్క ప్రాంతంలోనైనా భద్రతా సిబ్బంది కంటపడదా? అని ప్రశ్నించారు. ఇక ఆ తర్వాత కోర్టుల్లోనూ బాల్‌రాజ్ మధోక్ పిటిషన్‌లు నిలబడలేదు. బ్యాలెట్ పేపర్స్ హ్యాకింగ్‌పై దాఖలైన అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో బ్యాలెట్ వివాదం అక్కడితో సద్దుమణిగింది.
Published by: Shiva Kumar Addula
First published: April 7, 2019, 12:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading