Home /News /national /

WHAT IS PM KISAN SCHEME HOW TO APPLY FOR PM KISAN SCHEME BA

PM KISAN: పీఎం కిసాన్ పథకం అంటే ఏంటి? ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు స్థానిక తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేసుకోవాలి. పీఎం కిసాన్ నోడల్ అధికారి ఉంటారు. వారిని కలవాలి. కేంద్రం తెచ్చిన www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లో కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) పథకానికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. రూ.18000 కోట్లను 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఈ PM KISAN పథకం గురించి చాలా మందికి తెలియదు. దీని గురించి తెలుసుకోండి. పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రైతుల ఖాతాల్లో రూ.6000 జమ చేస్తారు. దాన్ని మూడు విడుతల్లో జమ చేస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుంది.

    ఈ పథకాన్ని 2019 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. అదే ఏడాది ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని ప్రారంభించారు. పొలం యజమానులకు మాత్రమే ఈ నగదు అందుతుంది. వ్యవసాయం కోసం రైతులకు చేతి ఖర్చుల నిమిత్తం ఈ నగదును జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం కింద ఏడాదికి రూ.6000 నగదు వస్తుంది. దీన్ని రూ.2000 చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జమ చేస్తారు. అయితే, పెద్ద రైతులకు మాత్రం ఈ స్కీం వర్తించదు. చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ ఫథకం వర్తిస్తుంది. 2019లో పథకాన్ని ప్రారంభించినా, దీన్ని 2018 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చారు. 2019 ఫిబ్రవరి 1వ తేదీ లోపు గుర్తించిన లబ్ధిదారులకు మాత్రమే దీన్ని అమలు చేస్తున్నారు.

    పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ప్రత్యేకంగా www.pmkisan.gov.in అనే వెబ్ సైట్‌ను కూడా ప్రారంభించింది. ఆ వెబ్ సైట్‌లో నమోదై ఉన్న లబ్ధిదారులకు మాత్రమే నగదు అందుతుంది. వారి ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేస్తారు. ఒకవేళ నగదు రాకపోతే ఆ వెబ్ సైట్‌లోనే చెక్ చేసుకోవాలి.

    2 హెక్టార్లు, అంతకంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్న వారికి ఈ పథకాన్ని మొదట వర్తింపజేశారు. ఆ తర్వాత భూ యజమానులు అందరికీ వర్తింపజేయాలని నిర్ణయించారు. వారికి ఎంత భూమి ఉన్నా కూడా డబ్బులు జమ చేస్తారు. ఇన్ కం ట్యాక్స చెల్లించే రైతులకు మాత్రం ఇది వర్తించదు. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించినట్టు గుర్తిస్తే వారికి నగదు రాదు. డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు, నెలకు రూ.10,000 కంటే ఎక్కువ ఆదాయం ఆర్జించే వారు వ్యవసాయం చేస్తున్నా కూడా వారికి ఈ పథకం వర్తించదు. అయితే, ఈశాన్య రాష్ట్రాల వారికి మాత్రం కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అలాగే, జార్ఖండ్‌లో అటవీ భూములు దున్నుకునే వారికి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి.

    ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు స్థానిక తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేసుకోవాలి. పీఎం కిసాన్ నోడల్ అధికారి ఉంటారు. వారిని కలవాలి. కేంద్రం తెచ్చిన www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లో కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన వారు తమ అప్లికేషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి 1800-11-5526 లేదా 155261 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. లేకపోతే pmkisan-ict@gov.in ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయవచ్చు. దేశంలో సుమారు 9 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద సాయం అందుతుంది. 2015-16 వ్యవసాయ లెక్కల ప్రకారం దేశంలో 14 కోట్ల మంది వరకు లబ్ధిదారుల జాబితా పెరగనుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: PM Kisan Maan Dhan Yojana, PM Kisan Scheme

    తదుపరి వార్తలు