Ramappa: యునెస్కో గుర్తింపు వస్తే ఏమవుతుంది? రామప్పకు కలిగే లాభాలేంటి?

రామప్ప టెంపుల్

Ramappa Temple: వార‌స‌త్వ ప్రాంతాలు కేవ‌లం గుర్తింపు పొంద‌డ‌మే కాదు, ఆక్ర‌మ‌ణ‌లు, పారిశ్రామికీక‌ర‌ణ‌, ఇష్టారాజ్యంగా ఆ ప్ర‌దేశాన్ని వాడేయ‌డం త‌దిత‌ర అన‌ర్థాల‌నుంచి ర‌క్ష‌ణ పొందుతాయి. ఈ ప్రాంతాల‌ను సైన్యం అవ‌స‌రాల‌కు వినియోగించుకోవ‌డానికి కుద‌ర‌దు.

  • Share this:
ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌... ఇప్పుడీ మాట మీడియాలో హోరెత్తుతోంది. మ‌న‌దేశంలో రామ‌ప్ప‌ దేవాల‌యం, తాజాగా ధోల్‌వీరా ప్రాంతాలకు ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యస‌మితికి చెందిన యునెస్కో వీటిని ప్ర‌పంచ వారసత్వ సంప‌ద‌గా గుర్తించింది. ఈ నేప‌థ్యంలో అస‌లు ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద అంటే ఏమిటి..? వాటిని ఎలా గుర్తిస్తారు? గుర్తింపుతో లాభాలేంటి? వంటి అంశాలను తెలుసుకుందాం.

మాన‌వ మేథ‌స్సు, సృజ‌నాత్మ‌క‌త క‌ల‌గ‌ల‌సిన నిర్మాణాలు, స‌హ‌జ‌సిద్ధంగా ఏర్ప‌డిన‌వి, మ‌న సాంస్కృతిక మూలాల‌కు ప్ర‌తిరూపంగా ఉండేవి ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తింపు పొందుతాయి. ప్ర‌పంచ‌ వార‌స‌త్వ సంప‌దను గుర్తించ‌డం 1959లో ప్రారంభ‌మైంది. ఆ ఏడాది ఈజిప్ట్ యునెస్కోకు ఒక విన్న‌పం చేసింది. ప్ర‌మాదంలో ప‌డిన స్మార‌క క‌ట్ట‌డాలు, ప్ర‌దేశాల‌ను ప‌దిలంగా చూసుకోవ‌డానికి వీలుగా స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని ఈజిప్ట్ కోరింది. ఇక అప్ప‌టి నుంచి ప్ర‌పంచ‌దేశాల‌న్నీ త‌మ దేశాల‌లోని ప్రాముఖ్యంగ‌ల ప్ర‌దేశాల‌ను ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద జాబితాకి జోడించ‌డం ప్రారంభ‌మైంది. ఇప్ప‌టిదాకా య‌నెస్కో ప్ర‌పంచ వార‌సత్వ సంప‌ద జాబితాలో ప్ర‌పంచ వ్యాప్తంగా 878 ప్ర‌దేశాలు ఉన్నాయి.

* గుర్తింపు ఎలా ఇస్తారు?
ప్ర‌పంచ వ్యాప్తంగా సాంస్కృతిక‌ నేపథ్యం, స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్రాముఖ్య‌మున్న ప్ర‌దేశాల‌ను యునెస్కో గుర్తిస్తుంది. ఇందుకు ప్ర‌పంచ వార‌స‌త్వ కార్యక్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలు ప్రాముఖ్యంగ‌ల ప్రాంతాల‌ను గుర్తించ‌మ‌ని కోరిన‌పుడు.. ఆ ప్రాంతాన్ని తాత్కాలిక జాబితాలోకి చేర్చుతారు. ఆపైన ఆ ప్రాంత ప్రాముఖ్యాన్ని స‌మీక్షించి, త‌రువాత ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా ఆమోదిస్తారు. అయితే ఓ ప్రాంతాన్ని లేదా క‌ట్ట‌డాన్ని ప్ర‌పంచ వార‌సత్వ సంప‌ద‌గా గుర్తించ‌డానికి యునెస్కో కొన్ని ప్ర‌మాణాల‌ను నెల‌కొల్పింది.

యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తింపు పొందేవి ఓ నిర్ణీత కాలంలో మావ‌న విలువ‌ల‌లో వ‌చ్చిన మార్పుల‌తో పాటు అంత‌రించిపోయిన లేదా మ‌నుగ‌డ‌లో ఉన్న సంస్కృతినో, నాగ‌రిక‌త‌నో ప్ర‌తిబింబించాలి. శిల్పం, సాంకేతిక‌త‌లో వ‌చ్చిన మార్పులు, ప‌ట్ట‌ణ‌ప్ర‌ణాళిక‌లు (హ‌ర‌ప్పా నాగ‌రిక‌త‌ వంటివి), లేదా స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌కృతి దృశ్యాలలో ఇది ప్ర‌తిబింబించాలి. అప్పుడు మాత్ర‌మే ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌లో సంబధిత ప్ర‌దేశం లేదా నిర్మాణం చోటు ద‌క్కించుకుంటాయి.

మాన‌వ చ‌రిత్ర‌లోని ముఖ్య‌మైన ద‌శ‌ల‌ను సూచించే విధంగా నిర్మిత‌మైన క‌ట్ట‌డాలు (తాజ్‌మ‌హ‌ల్ ,మొఘ‌లుల చ‌రిత్ర వారి జీవ‌న విధానం తెలియ‌జేస్తుంది), వాస్తుశిల్పం (రామ‌ప్ప‌దేవాల‌యం అద్భుత శిల్ప‌నైపుణ్యం వంటివి), సాంకేతిక‌త‌లో వ‌చ్చిన మార్పుల‌ను గుర్తించే నిర్మాణాలు అయి ఉండాలి. ఇవి
ప్ర‌కృతితో మాన‌వుని అనుబంధం ప్ర‌తిబింబించేలా ఉండాలి. మాన‌వుడు స్థిర నివాసం ఏర్ప‌ర‌చుకునే క్ర‌మంలో భూమిని ఉప‌యోగించుకున్న తీరు, స‌ముద్రంతో అత‌నికున్న అనుబంధం, అలాగే ఆనాటి సంస్కృతిని చూపించే విధానం, అలాగే అంత‌రించిపోయే ప్ర‌మాదంలో ప‌డిన ప్ర‌కృతి సంప‌దలను యునెస్కో గుర్తిస్తుంది.

ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న సంప్ర‌దాయాలు, సంఘటనలు లేదా జీవన సంప్రదాయాలతో, ఆలోచనలతో లేదా నమ్మకాలతో, సార్వత్రిక ప్రాముఖ్యం కలిగిన కళాత్మక, సాహిత్య రచనలతో ప్రత్యక్షంగా లేదా స్ప‌ష్ట‌మైన సంబంధం కలిగి ఉన్న‌వి... అద్భుత‌మైన ప్ర‌కృతి అందాలు, సౌందర్య ప్రాముఖ్యమున్న ప్రాంతాల‌కు గుర్తింపు ల‌భిస్తుంది. భూమి ఆవిర్భావం, దాని ప‌రిణామక్ర‌మంలో కొండ‌లు గుట్ట‌లు ఏర్ప‌డ‌టం, భౌగోళిక మార్పుల‌ను సూచించేవి, ఆ స‌మ‌యంలో జీవితాన్ని ప్ర‌తిబింబించేవాటికి గుర్తింపు నిస్తారు. ప‌ర్యావ‌ర‌ణ‌, జీవావ‌ర‌ణ ప‌రిణామ‌క్ర‌మంలో అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణలుగా నిలిచే భూములు, న‌దులు, తీర‌ప్రాంతాలు, స‌ముద్ర ప‌ర్యావ‌ర‌ణం, మొక్క‌లు , జంతువుల‌కు గుర్తింపు ల‌భిస్తుంది.
జీవ‌వైవిధ్యాన్ని కాపాడ‌టంలో భాగంగా స‌హ‌జ ఆవాసాల‌లో జీవించేవాటికి, ప్ర‌మాదంలో ప‌డిన జీవుల‌కు సైన్స్, జీవ వైవిధ్య ప‌రిర‌క్ష‌ణ దృష్ట్యా గుర్తింపునిస్తారు.

* గుర్తింపు ఉప‌యోగం ఏమిటి..?
యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద గుర్తింపు పొందితే కలిగే మొద‌టి ప్ర‌యోజ‌నం బోలెడు పేరూ, ప్ర‌చారం రావ‌డం. యాత్రికుల తాకిడి పెరుగుతుంది. ఒక‌సారి ఈ గుర్తింపు పొందిన ప్ర‌దేశాన్ని అటు మీడియా ఇటు ట్రావెల్ రైట‌ర్స్ బాగా ప్ర‌చారం చేస్తారు. ఈ ప్రాంతానికి అప్ప‌టిదాకా లేని ప్రాముఖ్యం ఒక్క‌సారిగా వ‌చ్చిప‌డుతుంది. దీనివ‌ల‌్ల ఆయా దేశాలు ఆర్థికంగానూ లాభ‌ప‌డ‌తాయి. ఇక ఈ ప్రాంతాల ప‌రిర‌క్ష‌ణ‌కు నిధులు పొందే సౌల‌భ్యం క‌లుగుతుంది. సంబంధిత ప్ర‌దేశానికి చారిత్ర‌క ప్రాముఖ్యం ఉంద‌నే విష‌యం తెలియ‌గానే దాన్ని ర‌క్షించుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ భావిస్తారు. యుద్ధంలాంటి స‌మ‌యాల‌లో ఈ వార‌స‌త్వ సంప‌ద‌ల జోలికి సైన్యం రాదు.

ఈ వార‌స‌త్వ ప్రాంతాలు కేవ‌లం గుర్తింపు పొంద‌డ‌మే కాదు, ఆక్ర‌మ‌ణ‌లు, పారిశ్రామికీక‌ర‌ణ‌, ఇష్టారాజ్యంగా ఆ ప్ర‌దేశాన్ని వాడేయ‌డం త‌దిత‌ర అన‌ర్థాల‌నుంచి ర‌క్ష‌ణ పొందుతాయి. ఈ ప్రాంతాల‌ను సైన్యం అవ‌స‌రాల‌కు వినియోగించుకోవ‌డానికి కుద‌ర‌దు. క‌ళ‌లు, సాంస్కృతిక వారసత్వం, సహజ సౌందర్యం ప్రాముఖ్యాన్ని గుర్తించ‌డం, సరిహద్దుల‌ను, రాజ‌కీయ‌భేదాల‌ను చెరిపివేసేందుకు ఈ గుర్తింపు ఉప‌యోగ‌ప‌డుతుంది.
Published by:Shiva Kumar Addula
First published: