Gujarat Results : ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి గుజరాత్‌లో బీజేపీ దుమ్ము రేపుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా ఏడోసారి విజయం సాధించిన ఆ పార్టీకి ఈ ఫలితాలు ఎంతో బూస్ట్ ఇస్తున్నాయి. చెప్పాలంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బలంగా నిలిచేందుకు ఈ ఫలితాలు బీజేపీకి పాజిటివ్ కాబోతున్నాయి. బీజేపీ విజయంలో మూడు అంశాలున్నాయి. 1.బీజేపీపై సహజంగానే ప్రజల్లో ఉన్న అభిమానం. 2.ప్రతిపక్ష కాంగ్రెస్ ఏమాత్రం ఆసక్తి చూపించకుండా బలహీనంగా మారడం. 3.ఆప్ ఇతర పార్టీలు ఓట్లను చీల్చడం.
జనరల్‌గా ఏదైనా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. వీలైనంతవరకూ ఆ అధికారాన్ని కోల్పోకుండా స్థిరంగా కొనసాగిస్తూ ఉంటుంది. ఇది గుజరాత్‌లో అత్యధికంగా ఉందని ఫలితాలే చెబుతున్నాయి. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనీ.. అందువల్ల ఈసారి గుజరాత్‌లో ఆ పార్టీకి సవాళ్లు తప్పవని కొన్ని అంచనాలు మొదట్లో తెరపైకి వచ్చాయి. ఐతే.. కాంగ్రెస్ జోరుగా లేకపోవడం, ఆప్ లాంటి పార్టీలు.. ఉత్సాహం చూపించడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి బీజేపీకి కలిసొచ్చింది. ఇక మోదీ, అమిత్ షా ద్వయానికి గుజరాత్ పెట్టని కోట. అక్కడ అడుగడుగునా వారికి ప్రజామోదం ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పట్టు మరింత పెరిగింది. అందువల్లే ఈ ఫలితాలు వన్ సైడ్ అయ్యాయి.
ప్రాంతీయ పార్టీలకు సవాల్ :
ఈ ఫలితాల్ని బీజేపీ కచ్చితంగా లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగపడేలా చేసుకుంటుంది. తన మైలేజ్‌ని ఇలాగే కంటిన్యూ చేస్తూ... దేశవ్యాప్తంగా తన మార్క్ మరోసారి చూపించేందుకు ప్రయత్నించడం ఖాయం. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందువల్ల.. 2024 ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నా.. వాటి మధ్య ఐక్యత కనిపించట్లేదు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి వారు బీజేపీకి వ్యతిరేకంగా బలంగా తమ వాణి వినిపిస్తున్నా.. వారితో కలిసొచ్చేందుకు ఇతర ప్రాంతీయ పార్టీలు అంతగా ఆసక్తి చూపట్లేదు. దానికి తోడు ఈ పార్టీలేవీ కాంగ్రెస్‌తో జట్టు కట్టేందుకు సిద్ధంగా లేవు. ఇలా ప్రతిపక్షాల్లో ఉన్న చీలిక, ఎత్తుగడలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల గుజరాత్ గెలుపు.. 2024 ఎన్నికల్లో బీజేపీకి బూస్ట్ ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.