ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్.. EOS-3 భూ పర్యవేక్షిత ఉపగ్రహాన్ని భూకక్ష్యలో ప్రవేశపెట్టడంలో గురువారం విఫలమైంది. నింగిలోకి టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే సాంకేతిక సమస్య వల్ల రాకెట్ ప్రయోగం విఫలమైంది. అయితే ఈ స్టేజ్ వద్ద ప్రయోగం ఎందుకు విఫలం అయిందో వివరంగా తెలుసుకుందాం.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10ని ప్రయోగించగా.. రాకెట్ మొదటి, రెండవ దశలు విజయవంతమయ్యాయి. రాకెట్ పేలోడ్ ఫెయిరింగ్‌ని వేరు చేసే ప్రక్రియ కూడా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు కనిపించింది. లిఫ్ట్‌ఆఫ్ అయిన నాలుగు నిమిషాల 55 సెకన్ల తర్వాత సెకండ్ స్టేజ్ సపరేట్ అయింది. తరువాత క్షణకాలంలోనే క్రయోజెనిక్ స్టేజ్ ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. దీనితో క్షణాల్లోనే క్రయోజెనిక్ స్టేజ్ నియంత్రణ కోల్పోవడం ప్రారంభమైంది.
ఈలోగా క్రయోజెనిక్ స్టేజ్ ఎత్తును, వేగాన్ని కోల్పోవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అనంతరం ప్రయోగం విఫలమైందని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ధారించారు. క్రయోజెనిక్ స్టేజ్ ఇగ్నేట్ అవ్వకపోవడం వల్లనే రాకెట్ ప్రయోగం విఫలమైంది. క్రయోజెనిక్ స్టేజ్ లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రయోగం విజయవంతం కాలేదని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ వెల్లడించారు.
అసలు క్రయోజెనిక్ స్టేజ్ అంటే ఏంటి..?
అంతరిక్ష ప్రయోగ వాహనాల చివరి దశను క్రయోజెనిక్ స్టేజ్ అంటారు. ఇది అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద మెటీరియల్స్ ని వినియోగించే పెద్ద వస్తువులను ఎత్తి అంతరిక్షంలో ప్రవేశ పెడుతుంది. క్రయోజెనిక్ ఇంజిన్.. లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్‌ను ప్రొపెల్లెంట్‌లుగా ఉపయోగిస్తుంది. ట్యాంకుల్లో స్టోర్ చేసే ఈ లిక్విడ్స్ బూస్టర్ పంపుల ద్వారా టర్బో పంప్‌లోకి వెళ్లి దహన చాంబర్ లోపల ప్రొపెల్లెంట్‌లకు హైఫ్లో రేట్ ఉండేలా చేస్తాయి.
ఈ ప్రయోగం విజయవంతం కావడం ఎందుకు ముఖ్యం?
హై రిజల్యూషన్ కెమెరాలు కలిగిన ఈ అత్యాధునిక ఇమేజింగ్ ఉపగ్రహం.. భారతీయ భూభాగం, మహాసముద్రాలు, వరదలు, తుఫానులు, పంటలు, వృక్షసంపద వంటి వాటిని రియల్-టైమ్ మానిటర్ చేస్తుంది. ఈ ఉపగ్రహంతో దేశ సరిహద్దులను పర్యవేక్షించడం సులభతరం అవుతుంది. ఈ ఉపగ్రహం ప్రకృతి వైపరీత్యాలను ముందుగా తెలుసుకొని డిజాస్టర్ వార్నింగ్స్ ఇస్తుంది. దీనివల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. నిజానికి జీఐశాట్ -1 ప్రయోగం మార్చి 5, 2020న జరగాల్సి ఉంది కానీ సాంకేతిక కారణాలు, కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ISRO