WEST BENGAL POST POLL VIOLENCE CASE CBI COURT MONITORED SIT TO PROBE SAYS HIGH COURT MAMATA BANERJEE LIKELY TO MOVE SC SK
West Bengal: బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై కోల్‌కతా హైకోర్టు సంచలన ఆదేశాలు
కలకత్తా హైకోర్టు
మే 2న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఎన్నికల్లో అంచనాలకు మించి తృణమూల్ కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ ఓడిపోయినప్పటికీ.. టీఎంసీ మాత్రం 214 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘర్షణల్లో పలువురు చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లడంతో విచారణ జరిగింది. ఈ క్రమంలో గురువారం హైకోర్టు సంచలన ఆదేశాలు జారీచేసింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై సీబీఐ, సిట్ దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో హత్యలు, అత్యాచారం వంటి ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని, ఇతర నేరాలపై దర్యాప్తునకు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ బృందంలో కోల్‌కతా పోలీసు కమిషనర్ సౌమెన్ మిత్రా, ఐపీఎస్ అధికారులు సుమన్ బాలా సాహో, రణ్‌వీర్ కుమార్ సభ్యులుగా ఉంటారని వెల్లడించింది.
అంతేకాదు ఈ రెండు దర్యాప్తులను కోర్టు పర్యవేక్షిస్తుందని కలకత్తా హైకోర్టు తెలిపింది. వచ్చే ఆరు వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. కేసులకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐకి అప్పగించాలని పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టును బీజేపీ స్వాగతించింది. సీబీఐ విచారణ ద్వారా నిజా నిజాలు తెలుస్తాయని అభిప్రాయపడింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని యోచిస్తోంది.
ఈ ఏడాది మార్చి- ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మే 2న ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఎన్నికల్లో అంచనాలకు మించి తృణమూల్ కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ ఓడిపోయినప్పటికీ.. టీఎంసీ మాత్రం 214 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 76 స్థానాలకే పరిమితమయింది. ఇతర పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అల్లర్లలో కొందరు మహిళలపై అకృత్యాలు జరిగాయని హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. అనంతరం NHRC దర్యాప్తు జరిపి.. జులై 15న కోర్టుకు నివేదిక సమర్పించింది. అక్కడ నిజంగానే హింస చెలరేగిందని.. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని పేర్కొంది. కొందరు మహిళలపై అత్యాచారాలు కూడా జరిగాయని తెలిపింది. అనంతరం కేసును సీబీఐకి అప్పగించాలని సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.