Mamata Banerjee: సీఎం అయ్యాక మమతా బెనర్జీ మొట్టమొదటి దిల్లీ టూర్.. ఎలా సాగిందంటే.. 

ఢిల్లీలో సీఎం మమతా బెనర్జీ పర్యటన దృశ్యాలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించి, మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు తమ రాష్ట్రంపైనే దృష్టి పెట్టిన మమత, ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు.

  • Share this:
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించి, మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు తమ రాష్ట్రంపైనే దృష్టి పెట్టిన మమత, ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సారి దిల్లీ పర్యటనకు వెళ్లారు. దిల్లీలో ముందుగా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత ఓ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ప్రధాన మంత్రి మోదీని కలిశారు. ఆమె దిల్లీ టూర్ ఎలా సాగిందంటే..

మొదట కాంగ్రెస్ నేతలతో..

మమతా బెనర్జీ ముందు దిల్లీకి చేరుకోగానే సీనియర్ కాంగ్రెస్ నేతలతో వరుస మీటింగుల్లో పాల్గొన్నారు. కమల్ నాథ్, అభిషేక్ మను సింగ్వి, ఆఖరికి సోనియా, రాహుల్‌తో కూడా కలిసి టీ తాగారామె. 2024లో బీజేపీని గద్దె దించాలంటే కాంగ్రెస్ ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని మమత భావన. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్ర నేతలతో ఆమె భేటీ అయ్యారు.

ప్రాంతీయ పార్టీలను కూడా..

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుంచి డీఎంకే ఎంపీ కనిమొళి వరకు మమత వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను కూడా మమత కలిశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌ను కూడా కలిసిన ఆమె ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ " స్థానిక పార్టీలు ఎంతో బలమైనవి. మేమంతా కలిసి ఉంటే మోదీతోనే కాదు.. భారత్ కోసం పోరాడతాం" అంటూ చెప్పుకొచ్చారు.

ప్రధాని మోదీతో భేటీ

ఎంత ప్రాంతీయ నాయకురాలైనా.. మమతా బెనర్జీ ఓ రాష్ట్రానికి సీఎం.. తన రాష్ట్రం కోసం కొన్ని డిమాండ్లతో ఆమె ప్రధాని మోదీని కూడా కలిశారు. తమ రాష్ట్ర పరిస్థితులను వెల్లడించి, కొన్ని డిమాండ్లను మోదీ ముందు ఉంచారు. ఆ తర్వాత ఆమె కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశారు. బెంగాల్‌లోని రహదారుల కోసం ఎన్నో డిమాండ్లను ఆయన ముందు ఉంచారు.

వారిని కూడా..

ఆ తర్వాత మమత జావేద్ అక్తర్, షబానా అజ్మీలను కూడా కలిశారు. వీరు కూడా యాంటీ బీజేపీ క్యాంప్‌లో ముఖ్యమైన వారుగా చెప్పుకోవచ్చు. 2024 లో పరివర్తన్ (మార్పు) తప్పనిసరిగా కనిపించాలని జావేద్ ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఆమె యాంటీ బీజేపీ పార్టీలు, వ్యక్తులందరినీ ఒక్క చోట చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. 2011 లో కూడా ఇలాగే యాంటీ లెఫ్ట్ పార్టీలుగా ఉన్న వారినందరినీ కలిశారు మమత. 2011 బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లందరూ మమతకు ఎంతగానో తోడ్పడ్డారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఆమె దేశవ్యాప్తంగా అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు.

ఆ తర్వాత టీఎంసీ అధినేత్రి జర్నలిస్టులను కూడా కలిశారు. వారి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అందించారు. ఆమె ప్రధాన మంత్రి కావాలనుకుంటున్నారా? అన్న అని అడిగిన ప్రశ్నకు.. అపోజిషన్ పార్టీల్లో ఎవరైనా 2024 ప్రధానమంత్రి అభ్యర్థి కావచ్చంటూ చెప్పుకొచ్చారు. ఈ మీటింగులన్నింటితో తాను ఏం చేయగలనో.. ఏం చేయడానికి ప్లాన్ చేస్తున్నానో దిల్లీ పెద్దలకు చెప్పకనే చెప్పారు మమతా బెనర్జీ. బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి 2024లో పోరాడేందుకు ఆయా పార్టీల్లో ఆమె ధైర్యాన్ని నింపారు. అయితే వాళ్లు అధికారంలోకి రావడం అనేది కలేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు మమత మాత్రం ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతున్నారు.
Published by:Sambasiva Reddy
First published: