వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. విపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) విపక్ష నేతలందరినీ కలుస్తున్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM NitishKumar) కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) విపక్షాల తరపున ఆయనే ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిలబడతారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నితీష్ కుమార్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన బిహార్ సీఎం... 2024లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటైతే.. వెనకబడ్డ రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు.
''వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైతే, వెనకబడ్డ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వం? ఖచ్చితంగా ఇస్తాం. బీహార్ మాత్రమే కాదు.. ఇతర వెనకబడ్డ రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా రావాలి.'' అని నితీష్ కుమార్ పేర్కొన్నారు.
#WATCH | "If we (Oppn) get to form govt (at the Centre) the next time, then why would we not give special status to backward states? We're not talking only about Bihar. We're also talking about some other backward states that should get special status," says Bihar CM Nitish Kumar pic.twitter.com/cgiGYve2mN
— ANI (@ANI) September 15, 2022
కాగా, మొన్నటి వరకు ఎన్డీయేలోనే ఉన్న నితీష్ కుమార్ పార్టీ జేడీయూ.. ఈ మధ్యే బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఆ తర్వాత సీఎం పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం ఆర్జేడీ, ఇతర పార్టీలతో కలిసి బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాల తరపున ఆయన ప్రధాన మంత్రి పదవికి పోటీ చేస్తారని చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన మాత్రం అదేం లేదంటూ.. దాటవేస్తూ వస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన నితీష్ కుమార్.. కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదాపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని 2007 నుంచి నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉన్న సమయంలో కూడా ఈ డిమాండ్‌ను వినిపించారు. కానీ కేంద్రం మాత్రం ఇవ్వలేదు. సాధారణంగా ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ హోదా ఉంది. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ , సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ , మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర , మిజోరం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అమలవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Nitish Kumar