Covid Vaccine Covishield: ఇండియాలో ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లలో ఒకటైన కోవిషీల్డ్‌ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సిన్‌ను ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఉత్పత్తిచేస్తోంది. ఈ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్నారు ఆదార్ పూనావల్లా (Adar Poonawalla). వ్యాక్సిన్‌కి అనుమతి లభించడంతో... ఇప్పుడు ఆయన నెక్ట్స్ ప్లాన్స్ ఆలోచిస్తున్నారు. SII ఇప్పటికే ఇండియాలో 5 కోట్ల దాకా వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. మరి పంపిణీ, ధర ఇతరత్రా అంశాలపై పూనవల్లా ఏం చెప్పారో తెలుసుకుందాం. తద్వారా ఇండియాలో ఈ వ్యాక్సిన్ పంపిణీకి ఎన్నాళ్లు పడుతుందో తెలుస్తుంది.
ప్రశ్న- అనుమతి రాకముందే SII కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారుచేసింది. అనుమతి లభిస్తుందని అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది?
పూనవల్లా జవాబు - మార్చి-ఏప్రిల్ సమయంలో మేము ఈ ఉత్పత్తికి సిద్ధమయ్యాం. మొదట్లో మాకు కాన్ఫిడెన్స్ లేదు. కానీ 100 శాతం నిబద్ధతతో పనిచేయాలని అనుకున్నాం. ఫైనాన్షియల్‌గా, టెక్నికల్‌గా పూర్తిగా పనిచేశాం. చాలా కష్టపడ్డాం. దాని ఫలితం దక్కింది. డబ్బు విషయమే కాదు... ఇది సక్సెస్ అవ్వకపోతే, ఆరు నెలలుగా మేం పడిన శ్రమంతా వృథా అయ్యేది. ప్రజలకు కూడా వ్యాక్సిన్ రావడం మరింత ఆలస్యమయ్యేది. DCGI ఆమోదించడం గొప్ప విజయం.
ప్రశ్న- ఆమోదం పొందడానికి మరింత ఎక్కువ సమయం పట్టవచ్చని మీరు అనుకున్నారా?
పూనవల్లా జవాబు - జరిగిన దానికి మేం ఆనందపడుతున్నాం. మేమైతే... ఏదీ కంగారుగా చేయకూడదని అనుకున్నాం. మేం కేంద్ర ఆరోగ్య శాఖ, DCGIని అన్ని రిపోర్టులూ పూర్తిగా చూడమని చెప్పాం. ప్రతీదీ డబుల్ చెక్ జరిగేలా చేశాం. ఆక్స్ఫర్డ్ కూడా ఇలాగే చేసింది.
ప్రశ్న- ఆమోదం లభించింది. నెక్ట్స్ ఏం జరుగుతుంది?
పూనవల్లా జవాబు - భారత ప్రభుత్వం మాతో కొనుగోలు ఆర్డర్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే వ్యాక్సిన్ ఎక్కడెక్కడికి పంపాలో చెప్పాలి. ఆ తర్వాత 7 నుంచి 10 రోజుల్లో మేము వ్యాక్సిన్ పంపగలం. మేము కేంద్ర ప్రభుత్వానికి రూ.200కే వ్యాక్సిన్ ఇస్తున్నట్లుగా లిఖితపూర్వకంగా తెలిపాం. ఇది మొదటి 10 కోట్ల డోసులకు మాత్రమే. ఆ తర్వాత ధర పెరగొచ్చు, మారొచ్చు. ప్రైవేట్ మార్కెట్లో ఒక డోస్ ధర రూ.1000 ఉంటుందని అనుకుంటున్నాం. లేదంటే మేం రూ.600 నుంచి రూ.700 మధ్య అమ్ముతాం. ఎక్స్పోర్ట్ విషయంలో మేము 3 నుంచి 5 డాలర్లకు ఇస్తాం. ఆయా దేశాలతో సంతకాలు, డీల్స్ చేసుకుంటాం. అది మార్చి, ఏప్రిల్‌లో జరగొచ్చు. ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ చేయవద్దని కేంద్రం చెప్పింది. మేం దీన్ని ప్రైవేట్ మార్కెట్‌కి ఇవ్వట్లేదు.
ప్రశ్న- ఈ పరిమితి వల్ల మీరు కోవాక్స్ ఫెసిలిటీకి కూడా సప్లై చెయ్యలేరా?
పూనవల్లా జవాబు - పరిమితులు ఎత్తివేసినప్పుడే మేము కోవాక్స్‌కి ఇవ్వగలం. ఐతే... 2 నెలల్లో పరిమితులు ఎత్తివేస్తారనే నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సరిపడా డోసులు వచ్చాక... విదేశాలకు ఎగుమతికి అనుమతిచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రశ్న- ఇప్పుడు మీరు ఎన్ని డోసులు కేంద్రానికి రెడీగా ఇవ్వగలరు?
పూనవల్లా జవాబు - 5 కోట్లు.
ప్రశ్న- రకరకాల వదంతులు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి?
పూనవల్లా జవాబు - ప్రశ్నించే, డౌట్లు లేవనెత్తే హక్కు ఎవరికైనా ఉంటుంది. కాకపోతే... డేటాను చదవాలి. ఎలాంటి టెస్టులు జరిగాయో తెలుసుకోవాలి. నిపుణులు చెప్పేది తెలుసుకోవాలి, వారితో మాట్లాడాలి. తద్వారా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ వ్యాక్సిన్లు సేఫ్ అని తెలుస్తుంది. వ్యాక్సిన్ తీసుకోమని ఎవరినీ, ఎవరూ ఒత్తిడి చెయ్యరు.
ఇది కూడా చదవండి: Health: వంట గదిలో ఇవి ఉంటే... వైరస్‌కి మంటే...
ప్రశ్న- ప్రపంచంలో మూడు వ్యాక్సిన్లే సమర్థమైనవి అని మీరు అనడం కరెక్టేనా?
పూనవల్లా జవాబు - ఇప్పటివరకూ మూడు వ్యాక్సిన్లే (ఫైజర్, మోడెర్నా, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా) తమ ఎఫికసీని నిరూపించాయి. ఇండియా, రష్యా, యూరప్ ఎక్కడా ఇంకా పూర్తిగా ఎఫికసీ స్టడీ పూర్తి కాలేదు. వారంతా సేఫ్టీ, ఇన్యునోజెనిసిటీ స్టడీస్ చేశారు. ఇండియాలో మేము కూడా అది పూర్తి చేశాం. ఇండియాలో కొన్ని ఇతర కంపెనీలు, నేను పేరు చెప్పను, అవి కూడా ఇలాంటివి చేశాయి. కానీ... వాటి స్టడీలో ఎఫికసీ లేనప్పుడు... ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందని నేననుకోను.