హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Budget 2021: రైతులు ప్రభుత్వంతో మాట్లాడాలి.. న్యూస్ 18 ఇంటర్వ్యూలో నిర్మల సీతారామన్

Budget 2021: రైతులు ప్రభుత్వంతో మాట్లాడాలి.. న్యూస్ 18 ఇంటర్వ్యూలో నిర్మల సీతారామన్

న్యూస్ 18 ఇంటర్వ్యూలో నిర్మల సీతారామన్

న్యూస్ 18 ఇంటర్వ్యూలో నిర్మల సీతారామన్

FM to Network18: రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని.. వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.

కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన గురించే చర్చ జరుగుతోంది. దాదాపు 2 నెలలకు పైగా ఢిల్లీ శివారులో బైఠాయించి కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రంతో ఎన్నో సార్లు రైతు సంఘాల నేతలు చర్చలు జరిపినా..ఎలాంటి పరిష్కారం దొరకలేదు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనలపై కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడారు. నెట్‌వర్క్ 18 ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో ఇంటర్వ్యూ సందర్భంగా బడ్జెట్‌తో పాటు పలు అంశాలపై ఆమె మాట్లాడారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొట్ట మొదటగా ఒక ప్రైవేట్ న్యూస్ నెట్‌వర్క్‌తో నిర్మలా సీతారామన్ ముచ్చటించారు. రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని.. వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

''2014 నుంచి కనీస మద్దతు ధర స్థిరంగా పెరుగుతోంది. రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వంతో రైతు సంఘాలు మాట్లాడాలి. కొత్త చట్టాలపై అంశాల వారీగా చర్చలు జరపాలి. వాటిని పరిగణలోకి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.'' అని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో వ్యవసాయానికి సంబంధించి కీలక అంశాలను పొందుపరిచారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సును పెట్రోలుపై లీటరుకు రూ.2.5కు, డీజిల్‌పై లీటరకు రూ.4 చొప్పున పెంచుతున్నట్లు నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు. కాబూలీ చనాపై 30 శాతం, బీన్స్‌‌పై 50 శాతం, పప్పు ధాన్యాలపై 5 శాతం, పత్తిపై 5 శాతంపై అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సును పెంచుతున్నట్లు పేర్కొన్నారు. అయితే కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతో... ధరలపై పెద్దగా ప్రభావం పడదు

ఇక 2021-22లో రూ.16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ చెప్పారు. స్వామిత్వ్ యోజన పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అంతేకాదు ఆపరేషన్ గ్రీన్పథకాన్ని మరిన్ని పంటలకు వర్తించేలా మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే కనీస మద్దతు ధర గురించి ప్రకటన వస్తుందని అందరూ భావించారు. కానీ అలాంటిదేమీ లేకపోవడంతో కేంద్రంపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.

కాగా, ఢిల్లీ శివారులోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ ప్రాంతాల్లో దాదాపు రెండు నెలలకుపైగా రైతులు ఆందోళనలు చేపట్టారు. జనవరి 26 వరకు శాంతియుతంగానే నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వంతోనే చర్చలు జరిపారు. ఐతే జనవరి 26న చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు రైతులు ఎర్రకోటకు దూసుకెళ్లి అక్కడ జెండాలు ఎగురవేశారు. పలు ప్రాంతాల్లో పోలీసుల వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించారు. పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఆందోళనకారుల దాడుల్లో సుమారు 300 మంది పోలీసులు గాయపడ్డారు.

హింసాత్మక ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. పలువురు రైతు సంఘాల నేతలకు కూడా నోటీసులుజారీ చేశారు. ఈ ఘటనల తర్వాత రైతుల ఉద్యమంలో చీలిక వచ్చింది. ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు కొన్ని సంఘాల నేతలు ప్రకటించారు. ఇప్పటికే చాలా మంది ఢిల్లీ సరిహద్దుల నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ఇన్నాళ్లు రైతులక మద్దతిచ్చిన స్థానికులు.. ఒక్కసారిగా తిరగబడ్డారు. రైతుల ఆందోళనలు సంఘ విద్రోహకశక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపిస్తూ సింఘూ వద్ద స్థానికులు ఆందోళనలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. ఈ పరిణామాలతో రైతుల ఆందోళనలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

First published:

Tags: Budget 2021, Nirmala sitharaman, Union Budget 2021

ఉత్తమ కథలు