Home /News /national /

Elections: ముగిసిన పోలింగ్.. ఎన్నికలు ఎక్కడెలా జరిగాయంటే.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎప్పుడో తెలిసింది..!

Elections: ముగిసిన పోలింగ్.. ఎన్నికలు ఎక్కడెలా జరిగాయంటే.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎప్పుడో తెలిసింది..!

తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు

తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు

అసోంలోని 12 జిల్లాల్లో ఉన్న 40 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా అసోంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తమిళనాడు ఎన్నికల్లో సామాన్య ప్రజలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ సినీ నటుడు విజయ్ సైకిల్‌పై...

ఇంకా చదవండి ...
  తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం గొప్పగా లేకపోయినప్పటికీ ఫర్వాలేదని చెప్పవచ్చు. పోలింగ్ ముగిసే సమయానికి తమిళనాడులో 65.11 శాతం పోలింగ్ నమోదు కాగా, కేరళలో 69.95 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓటు వేసేందుకు ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చారు. దీంతో.. అక్కడ పోలింగ్ శాతం మెరుగ్గానే కనిపించింది. పోలింగ్ ముగిసే సమయానికి పుదుచ్చేరిలో 78.03 శాతం పోలింగ్ నమోదైంది. ఇక.. బెంగాల్‌లో మూడో విడత ఎన్నికలు జరగ్గా.. 77.68 శాతం పోలింగ్ నమోదైంది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అసోంలో ఓటింగ్ శాతం భారీగానే నమోదైంది. అసోంలో మూడో విడత ఎన్నికలు, చివరి విడత ఎన్నికలు ఇవే కావడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. అసోంలో 7 గంటల సమయానికి పోలింగ్ ముగిసింది. 82 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. అసోంలోని 12 జిల్లాల్లో ఉన్న 40 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా అసోంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తమిళనాడు ఎన్నికల్లో సామాన్య ప్రజలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ సినీ నటుడు విజయ్ సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా విజయ్ పోలింగ్ కేంద్రానికి ఇలా వెళ్లారు.

  మరో తమిళ నటుడు అజిత్ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన క్రమంలో ఓ అభిమాని అతనితో సెల్ఫీకి యత్నించాడు. అతని చేతులో నుంచి ఫోన్‌ను లాక్కున్న అజిత్ తిరిగివ్వలేదు. మాస్క్ పెట్టుకోకుండా, కోవిడ్-19 నిబంధనలు పాటించకుండా సెల్ఫీలేంటని అజిత్ తన అభిమానిని మందలించాడు. తర్వాత కొద్దిసేపటికి అతని ఫోన్ అతనికిచ్చేశాడు. తమిళనాడులోని ఈరోడ్‌లోని అంథియుర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కథిరిమలై గ్రామానికి ఈవీఎంలను, ఇతర పోలింగ్ సామాగ్రిని గాడిదలపై తరలించారు. ఆ గ్రామానికి వెళ్లేందుకు రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ఇలా తీసుకెళ్లినట్లు పోలింగ్ అధికారులు తెలిపారు.

  ఇక.. డీఎంకే అగ్ర నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తీరు వివాదాస్పదమైంది. డీఎంకే చిహ్నంతో కూడిన షర్ట్‌ను ధరించి ఉదయనిధి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వెళ్లడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. సినీ నటుడు, ‘మక్కల్ నీది మయం’ పార్టీ అధినేత కమల్ తన కుమార్తె శ్రుతి హాసన్‌తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ నటి త్రిష కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక.. కేరళలో హీరోయిన్ కీర్తి సురేష్ ఓటు వేశారు.

  ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే.. నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఏప్రిల్ 29న వెల్లడి కానున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మునుపెన్నడూ లేని ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేయడం, కమల్ పార్టీ బరిలో నిలవడం, డీఎంకే దూకుడుగా చేసిన ప్రచారంతో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తి ప్రజల్లో కనిపిస్తోంది.

  ఇక.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఈసారి బీజేపీ, టీఎంసీతో పాటు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మమతను ఓడించేందుకు బీజేపీ అగ్రనేతలంతా ప్రచారం చేయడం, మమత అనుచరుడే బీజేపీలో చేరి నందిగ్రామ్‌లో ఆమెపై పోటీకి నిలవడం, అమిత్ షా వ్యూహాలతో బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడం.. ఇలా పలు అంశాలు బెంగాల్ ఫలితాలపై గతంలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠకు దారితీశాయి.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: 5 State Elections, Assam Assembly Elections 2021, Kerala, Kerala Assembly Elections 2021, Puducherry Assembly Elections 2021, Tamil Nadu Assembly Elections 2021, Tamilnadu, West Bengal Assembly Elections 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు